ఆదాయంపై ఉన్న శ్రద్ధ పూజలపై లేదు
ఆదాయంపై ఉన్న శ్రద్ధ పూజలపై లేదు
Published Fri, Oct 21 2016 10:02 PM | Last Updated on Mon, Sep 4 2017 5:54 PM
– దేవాదాయ శాఖ తీరుపై స్వరూపానందేంద్ర సరస్వతి ధ్వజం
పాలకొల్లు సెంట్రల్ :
దేవాదాయ శాఖ అధికారులకు ఆదాయంపై ఉన్న శ్రద్ధ ఆలయాల్లో చేయాల్సిన పూజలపై లేదని విశాఖలోని శ్రీ శారదా పీఠం అధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ధ్వజమెత్తారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని పంచారామ క్షేత్రం ఉమా రామలింగేశ్వరస్వామి ఆలయంలో గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్, సేవ్ టెంపుల్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో రెండు రోజులపాటు నిర్వహించిన మహా కుంభాభిషేకం శుక్రవారం ముగిసింది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన స్వరూపానందేంద్ర మాట్లాడుతూ పంచారామ క్షేత్రాల్లో కుంభాభిషేకాలు చేయాలని ఆగమ శాస్త్రం చెబుతున్నా దేవాదాయ శాఖకు ఆ ఆలోచనే లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దేవుడి సొమ్మును దేవుడికి ఖర్చు చేయడానికి వీళ్లకు వచ్చిన ఇబ్బంది ఏమిటో అర్థం కావడం లేదన్నారు. తమిళనాడులోని ప్రతి ఆలయంలో 12 ఏళ్లకు ఒకసారి తప్పనిసరిగా కుంభాభిషేకం నిర్వహిస్తారన్నారు. దీనివల్ల ఆలయానికి ఉన్న దోషాలు పోయి గర్భాలయంలోని విగ్రహానికి మంచి శక్తి వస్తుందన్నారు. కలశాల్లో జలాలను పోసి మూడు, ఐదు రోజులు మంత్రోచ్ఛారణ చేసి ఆ జలాలతో అభిషేకం చేస్తే ఏడు జన్మల సహస్ర పాపాలను తొలగించినట్టు అవుతుందన్నారు. కుంభాభిషేకానికి అంత ప్రాముఖ్యత ఉందని తెలిపారు.
Advertisement