పులిచింతల నిర్వాసితులను పట్టించుకోరా..?
బెల్లంకొండ: పులిచింతల ప్రాజెక్టు నిర్మాణం కోసం సర్వస్వం వీడి పునరావాస కేంద్రాలకు వచ్చిన తమను ప్రభుత్వం, అధికారులు పట్టించుకోవడం లేదని బాధితులు జిల్లా జాయింట్ కలెక్టర్ కృతికా శుక్లా వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలోని మాచాయపాలెం పునరావాస కేంద్రాల్లో మంగళవారం జన్మభూమి– మా ఊరు కార్యక్రమంలో జేసీ పాల్గొన్నారు. మొదట మండలంలోని పాపాయపాలెం గ్రామంలో మండల అధికారులు జన్మభూమి కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం పునరావాస కేంద్రాల్లో జరిగిన కార్యక్రమంలో బాధితులు వారి సమస్యలను జేసీకి వివరించారు. తాము ఇక్కడకు వచ్చి దాదానుగా ఆరేళ్లు దాటినా ఇంతర వరకూ ప్రత్యేక పంచాయతీగా గుర్తించలేదని తెలిపారు. సైడ్ డ్రైనేజీలు లేవని, పుశువులు మేతకు వెళ్లేందుకు డొంక లేదని తెలిపారు. శ్మశానం లేక పోవడంతో తీవ్ర అవస్థలు పడుతున్నామని, మంచి నీటి సమస్య తీవ్రంగా ఉందన్నారు. వారి సమస్యలను పరిష్కరిస్తామని జేసీ శుక్లా హామీ ఇచ్చారు. ఎంపీడీవో సీహెచ్ బ్రమరాంబ, సర్పంచ్ నూన్సావతు బుజ్జికుమారి బాయి, ఎంపీటీసీ సభ్యుడు నరసింహానాయక్, పులిచింతల స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ దేవసహాయం, మండల స్పెషల్ ఆఫీసర్ వెంకటేశ్వరరెడ్డి, డిప్యూటీ తహశీల్ధార్ ఈశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.