స్వాతంత్య్ర వేడుకలకు పరేడ్ గ్రౌండ్ ముస్తాబు
ఏలూరు (మెట్రో): జిల్లాలో 71వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు సందర్బంగా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ, జిల్లా ఇన్‌చార్జి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. స్వాతంత్య్ర దినోత్సవం వేడుకల్లో భాగంగా మంగళవారం ఏలూరు పోలీస్ పేరెడ్ గ్రౌండ్స్‌లో 71వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఉదయం 8.30 గంటల నుండి ప్రారంభమవుతాయని, 8.45 గంటలకు జిల్లా ఎస్పీ ఎం.రవిప్రకాష్, 8.50 గంటలకు కలెక్టర్ కాటంనేని భాస్కర్, 8.55 గంటలకు ఏలూరు రేంజ్ డీఐజీ పీవీఎస్ రామకృష్ణల పోలీస్ పేరెడ్ గ్రౌండ్స్‌కు చేరుకుంటారు. ఉదయం 8.59 గంటలకు మంత్రి గ్రౌండ్‌కు చేరుకుని జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీస్ గౌరవ వందనాన్ని స్వీకరిస్తారు. పేరెడ్ కమాండర్ బీ.చంద్రశేఖర్, డీఎస్పీ ఆర్మ్‌డ్ రిజర్వ్‌డ్ ఆధ్వర్యంలో మార్చ్‌ఫాస్ట్ నిర్వహించబడుతుంది. విద్యార్థులతో పలు సాంస్కృతిక కార్యక్రమాలు, వివిధ శాఖల్లో ప్రతిభ కనబరిచిన అధికారులు, సిబ్బందికి మంత్రి ప్రశంసాపత్రానలను బహుకరిస్తారు.