పాల శీతలీకరణ కేంద్రాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే
దుబ్బాక: భవిష్యత్‌లో ప్రజలు స్వచ్ఛమైన పాల కోసం బల్వంతాపూర్ దారి పట్టాల్సిందేని, గ్రామస్తులు స్వయం కృషిలో పాడి పంటపై ఆధారపడి జీవించడం అభినందనీయమని రాష్ర్ట శాసన సభ అంచనాల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ర్ట పాడి పరిశ్రమాభివృద్ధి సంస్థ సహకార సమాఖ్య ఆధ్యర్యంలో బుధవారం మండలంలోని బల్వంతాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన మినీ పాల శీతల కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని రైతులు అత్యధికంగా పాల ఉత్పత్తిపై ఆధారపడి జీవిస్తుంటారని, రైతుల సౌకర్యార్థం సిద్దిపేట లాంటి మిల్క్ చిల్లింగ్ కేంద్రాన్ని దుబ్బాకలో పెట్టడానికి కృషి చేస్తానన్నారు. దీంతో వేలాది మంది రైతులకు స్వయం ఉపాధి దొరకుతుందన్నారు. రోజుకు 1500 లీటర్ల స్వచ్ఛమైన పాలను సేకరించడమే కాకుండా పది రోజులకోసారి వేతనాలను తీసుకుంటున్న గ్రామస్తులను ఎమ్మెల్యే అభినందించారు. పాల సేకరణ ఉత్పత్తిని పెంచాలని సూచించారు.
గ్రామంలో ఏర్పాటు చేసిన మినీ పాల శీతలీకరణ కేంద్రంలో ఆరు వేల లీటర్ల పాలను స్టోర్ చేసుకోవచ్చన్నారు. పశువులను ఎక్కడైతే పెంచి పోషిస్తారో అక్కడే శాంతి, పాడి పంటలు, అష్ట ఐశ్వర్యాలతో ప్రజలు జీవిస్తారన్నారు. గేదెలను ఓపికతో పోషిస్తేనే సుఖాన్ని అనుభవిస్తారన్నారు.
పాలను కల్తీ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హెచ్చరించారు. గ్రామస్తుల కోరిక మేరకు గ్రామంలో పాల శీతల కేంద్ర భవనాన్ని తన స్వంత నిధులతో నిర్మిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. పాడి రైతుల కోసం డీసీసీబీ బ్యాంకు అధికారులు పాడి గేదెలను సబ్సిడీపై అందించడంపై సంతోషాన్ని వ్యక్తం చేశారు. ప్రతి ఇంటికి రెండు గేదెలు ఉండే విధంగా చూడాలన్నారు.
మల్లన్న సాగర్‌పై రాజకీయాలు తగవు
నాలుగు జిల్లాల ప్రజలకు జీవప్రధానియైన కొమురవెళ్లి మల్లన్న సాగర్ రిజర్వాయర్‌ను ప్రతి పక్షాలు అడ్డుకోవాలని చూస్తున్నాయని, తాము చేయలేనిది కేసీఆర్ ప్రభుత్వం చేస్తోందన్న అక్కసుతో ప్రతిపక్షాలు ఓర్వలేని రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపించారు. సాగు, తాగు నీరుంటేనే ప్రజలు సుఖ సంతోషాలతో జీవిస్తారని, దీన్ని దృష్టిలో పెట్టుకున్న టీఆర్‌ఎస్ ప్రభుత్వం మల్లన్న సాగర్ ప్రాజెక్టును నిర్మించతలపెట్టిందన్నారు.
వర్షాల్లేక ప్రజల పరిస్థితి ఆగమ్యగోచరింగా మారిందని, దీనికి తోడు ఇక్కడి ముంపు బాధితులను ప్రతి పక్షాలు రాజకీయ సుడిగుండంలోకి లాగుతున్నారని, ఎవరెన్ని కుట్రలు చేసినా ముంపు బాధితులు ప్రతిపక్షాల ఉచ్చులో పడరన్నారు. హైకోర్టు కూడా 123 జీఓకు అనుకూలంగా తీర్పునివ్వడం శుభ సూచకమన్నారు. 200 కిలో మీటర్ల దూరంలో ఉన్న గోదావరి నది నుంచి దుబ్బాక ప్రాంతానికి ప్రభుత్వం సాగు నీరు తీసుకొస్తోందని, వచ్చిన నీటితో పాడి పంటలు శోభిల్లుతాయన్నారు. మల్లన్న సాగర్‌పై ప్రతి పక్షాల కుట్రలు ఇక నుంచి సాగబోవన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ ర్యాకం పద్మ, జెడ్పీటీసీ ఏల్పుల గౌతమి, గ్రామ సర్పంచ్ కొంగరి కనకవ్వ, ఎంపీటీసీ సభ్యురాలు అక్కల వినోద, పీఏసీఎస్ చైర్మన్ అమ్మన రవీందర్‌రెడ్డి, మెదక్ మిల్క్ షెడ్ డిప్యూటీ డైరెక్టర్ మోహన్‌మురళి, విజయ పాల డైరీ జిల్లా అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షుడు జీడిపల్లి రవి, ఏఎంసీ వైస్ చైర్మన్ పోలబోయిన నారాగౌడ్, టీఆర్‌ఎస్ మండల శాఖ అధ్యక్షుడు టేకులపల్లి మల్లారెడ్డి, టీఆర్‌ఎస్ నాయకులు ర్యాకం శ్రీరాములు, ఏల్పుల మహేష్, కోమటిరెడ్డి సంజీవరెడ్డి, అక్కల శ్రీనివాస్ గౌడ్, బండి రాజు, జనగాం పర్శరాములు, పారిపల్లి సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.