మాట్లాడుతున్న ఎమ్మెల్యే రామలింగారెడ్డి
- నిర్మాణానికి రూ. 1.70 కోట్లు
- ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి
దుబ్బాక: మధ్యాహ్న భోజన కార్మికుల బాధలను తీర్చడానికి వంట గదుల నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం భారీగా నిధులను విడుదల చేసిందని రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి తెలిపారు. ఆదివారం స్థానిక విలేకరులతో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎండనక, వాననక ప్రభుత్వ పాఠశాలల్లో వంటలు చేసే మధ్యాహ్న భోజన కార్మికుల కష్టాలు ఇక నుంచి తప్పనున్నట్లు పేర్కొన్నారు.
నియోజకవర్గంలోని మిరుదొడ్డి, చేగుంట, తొగుట, దౌల్తాబాద్, దుబ్బాక మండలాల్లోని 95 ప్రభుత్వ పాఠశాలలకు రూ. 1.70 కోట్ల నిధులను కేసీఆర్ ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో వంటగదుల్లేక ఆరుబయటనే మధ్యాహ్న భోజనాన్ని కార్మికులు విద్యార్థులకు వడ్డించాల్సి వస్తోందన్నారు. మధ్నాహ్న భోజన కార్మికులు పడుతున్న కష్టాలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడంతోనే వంట గదుల నిర్మాణానికి భారీగా నిధులను కేటాయించిందన్నారు.
దుబ్బాక మండలంలో 11 పాఠశాలలు, మిరుదొడ్డిలో 17, తొగుటలో 29, దౌల్తాబాద్‌లో 13, చేగుంట మండలంలోని 25 పాఠశాలల్లో వంట గదులను నిర్మించడానికి నిధులను కేటాయించిందని ఆయన వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడానికి టీఆర్‌ఎస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందన్నారు.
వంట గదులకు నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడంతోనే నిధులను విడుదల చేసిన సీఎం కేసీఆర్, విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి తన్నీరు హరీశ్‌రావులకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షుడు జీడిపల్లి రవి, ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ జిల్లా కమిటీ సభ్యులు తౌడ శ్రీనివాస్, టీఆర్‌ఎస్ జిల్లా నాయకులు ర్యాకం శ్రీరాములు, పేరుడి దయాకర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.