పూరింటికి రూ.18 లక్షల కరెంటు బిల్లు
రావికమతం: ఏపీలో అదో పూరిల్లు.. అందులో ఉన్నవి రెండు బల్బులు, ఒక ఫ్యాన్.. మరి ఆ ఇంటికి వచ్చిన కరెంటు బిల్లు ఎంతో తెలుసా.. అక్షరాలా 18,68,026 రూపాయలు. ఏంటీ.. ఈ అంకెలు చూడగానే షాక్ తిన్నారా! ఆ ఇంటి యజమానురాలి పరిస్థితీ అదే. విశాఖ జిల్లా రావికమతం మండలం దొండపూడి గ్రామానికి చెందిన గొంతిన దేముళ్లమ్మ (60) కుమారుడితో కలసి పూరిపాకలో నివసిస్తోంది. రెండు బల్బులు, ఒక ఫ్యాన్ మాత్రమే ఉన్న ఆ ఇంటికి ప్రతి నెలా రూ.50-60 మధ్య బిల్లు వస్తుంటుంది. ఇదిలాఉండగా జనవరి నెలకు సంబంధించి ఈ నెలలో బిల్లు వచ్చింది.
ఎప్పటిలాగే బిల్లు మొత్తం ఉంటుందన్న ధీమాతో ఆమె బిల్లులోని అంకెలను గమనించలేదు. బుధవారం కొత్తకోటలోని మీ సేవా కేంద్రంలోని కౌంటర్‌లో బిల్లుతో పాటు రూ.వంద నోటు ఇచ్చింది. రూ.18 లక్షలకు పైగా బిల్లు వస్తే రూ.100 ఇచ్చావేమిటని మీసేవ నిర్వాహకుడు ప్రశ్నించడంతో ఆ వృద్ధురాలు ఒక్కసారిగా నిర్ఘాంతపోయింది. అట్నుంచి అటే రావికమతం వెళ్లి విద్యుత్ అధికారులకు ఫిర్యాదు చేసింది. దీనిపై ఏఈ గొంపస్వామిని వివరణ కోరగా రీడింగ్ నమోదులో జరిగిన పొరపాటు వల్ల అలా జరిగిందని, ఆందోళన చెందాల్సిన పనిలేదని చెప్పారు.