150 పాఠశాలలకు పుష్కర సెలవులు
-
డీఈవో శ్రీనివాసులురెడ్డి వెల్లడి
గుంటూరు ఎడ్యుకేషన్ : కృష్ణా పుష్కరాలు జరిగే రోజుల్లో జిల్లాలోని 150 ప్రభుత్వ పాఠశాలలకు సెలవులు ప్రకటిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి కేవీ శ్రీనివాసులురెడ్డి చెప్పారు. పుష్కర నగర్, ఘాట్లకు సమీపంలో ఉన్న ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలను గుర్తించి ప్రభుత్వానికి నివేదిక పంపామని తెలిపారు. శుక్రవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ ఈ నెల 12న ప్రారంభం కానున్న పుష్కరాల విధుల్లో నిమగ్నమైన రెవెన్యూ, పోలీస్, ఆర్టీసీ ఉద్యోగులు, సిబ్బంది బస చేసేందుకు ఈ పాఠశాలలను కేటాయించనున్నట్లు చెప్పారు. పుష్కరాలు జరిగే 12 రోజులూ ఆయా పాఠశాలలు ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయన్నారు. సిబ్బంది అవసరాల నిమిత్తం 12వ తేదీకి ముందే వాటిని స్వాధీనం చేసుకునే అవకాశముందని చెప్పారు. పుష్కరాల సందర్భంగా పని దినాలు నష్టపోయిన పాఠశాలలను ఆదివారాలు, ఇతర సెలవు దినాల్లో నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లాలోని అన్ని పాఠశాలలకు ఈ నెల 12న, తిరిగి 24న సెలవులుగా పరిగణించే విషయమై జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సెలవులు ప్రకటిస్తామని చెప్పారు. పుష్కరాలు జరిగే రోజుల్లో ఉన్నత పాఠశాలల్లోని విద్యార్థులకు ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం వక్తృత్వ, వ్యాసరచన పోటీలు నిర్వహించాలని ఎంఈవోలను ఆదేశించారు.