జీడిపల్లికి పుష్కర శోభ
బెళుగుప్ప: కృష్ణా పుష్కరాల్లో భాగంగా మండల పరిధిలోని జీడిపల్లి రిజర్వాయర్ పుష్కర శోభను సంతరించుకుంది. రిజర్వాయర్‌లో ఏర్పాటు చేసిన ఘాట్‌లో పవిత్ర పుష్కర స్నానాలను ఆచరించడానికి ఆదివారం వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. జిల్లా వాసులతో పాటు కర్ణాటక ప్రాంతం నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు.
పుష్కరాలకు వచ్చు భక్తులకు ఆదివారం మండల పరిధిలోని నక్కలపల్లి గ్రామస్తులు భోజన వసతిని కల్పించారు. ప్రతి రోజూ మండల పరిధిలోని ఒక గ్రామం తరుపున భోజన వసతి కల్పనకు ముందుకు వచ్చారని అధికారులు తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు నడపాలని, రిజర్వాయర్ వద్ద మరిన్ని సౌకర్యాలు కల్పించాలని భక్తులు కోరుతున్నారు.