jeedipalli reservoir
-
జీడిపల్లి రిజర్వాయర్‌లో పూర్తిగా తగ్గిన నీటి మట్టం
బెళుగుప్ప: మండలంలోని జీడిపల్లి రిజర్వాయర్‌లో రోజురోజుకూ నీటి మట్టం తగ్గుతోంది. జీడిపల్లి రిజర్వాయర్‌కు 1.68 టీఎంసీల నీటిని నిల్వ ఉంచే సామర్థ్యం వుంది. ప్రస్తుత కరువు సమయంలో కొద్ది వరకు పీఏబీఆర్ డ్యాంకు నీటిని అందించి అక్కడి నుంచి జిల్లా కేంద్రానికి తాగునీటి అవసరాలకు వాడుతున్నారు. ఇటీవల రాప్తాడు నియోజకవర్గంలోని కొన్ని చెరువులకు, ధర్మవరం, బుక్కపట్నం చెరువులకు జీడిపల్లి రిజర్వాయర్‌లోని నీటిని తరలించారు. ప్రస్తుతం జీడిపల్లి రిజర్వాయర్‌లో కేవలం 0.35 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. ప్రాజెక్టు పరిధిలోని 36వ ప్యాకేజీ పనులు పూర్తయితే సాగునీటి కోసం రిజర్వాయర్‌లోని నీటి నిల్వల మొత్తంను సైతం తీసుకునే అవకాశం ఉంటుందని హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌డీఈ మురళీధర్‌రెడ్డి అన్నారు. అయితే 36వ ప్యాకేజీ ఆయకట్టుకు సాగునీటిని ప్రభుత్వం అందించకపోవడం మూలంగా రిజర్వాయర్‌లో నీటిమట్టం తగ్గుతోంది. సమీపంలోని బోరుబావుల్లో సైతం నీటి లభ్యత తగ్గుతుండడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. -
జీడిపల్లి రిజర్వాయర్‌లో యువకుడు గల్లంతు
బెళుగుప్ప : జీడిపల్లి రిజర్వాయర్‌లో ఈతకు వెళ్లిన ఓ యువకుడు గల్లంతయ్యాడు. బాధితుడి కుటుంబసభ్యులు, స్థానికులు తెలిపిన మేరకు.. గంగవరం గ్రామానికి చెందిన కంసలి లక్ష్మప్ప, రాజేశ్వరి దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. గత ఏడాది లక్ష్మప్ప అనారోగ్యంతో చనిపోయాడు. దీంతో పెద్ద కుమారుడు వినయ్ గాలిమరల కంపెనీలో దినసరి కూలీగాను, రెండవ కుమారుడు రాజశేఖర్ (23) హైదరాబాద్‌లోని ప్రైవేట్ కంపెనీలో అటెండర్‌గాను పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకుని ఆదివారం తన మిత్రులతో కలసి రాజశేఖర్ జీడిపల్లి రిజర్వాయర్‌కు వెళ్లి అక్కడే విందు చేసుకున్నారు. అనంతరం తిరిగి వెళుతూ రిజర్వాయర్ మరువ వద్ద స్నేహితులతో కలసి ఈతకు దిగాడు. అరకొరగా ఈత వచ్చే రాజశేఖర్ నీటిలో మునిగాక ఎంతసేపటికీ బయటకు రాలేదు. దీంతో స్థానికులు, రాజశేఖర్ బంధువులు మరువ ప్రాంతంలో గాలింపు చేపట్టినా జాడ కనిపించలేదు. -
రేపు హంద్రీ–నీవా–2కు నీరు విడుదల
అనంతపురం సెంట్రల్ : బెళుగుప్ప మండలంలోని జీడిపల్లి రిజర్వాయర్ నుంచి ఈ నెల 24న హంద్రీ–నీవా రెండోవిడత కాలువకు నీరు విడుదల చేయనున్నట్లు చీఫ్ ఇంజనీర్ (సీఈ) జలంధర్ తెలిపారు. గురువారం ఆయన సాక్షితో మాట్లాడారు. ఈ నెల 20న నీటిని వదలాలని తొలుత భావించినప్పటికీ సాంకేతిక కారణాల వల్ల వాయిదా వేసినట్లు చెప్పారు. శ్రీశైలం జలాశయం నుంచి హంద్రీ–నీవా ద్వారా వీలైనంత ఎక్కువ నీటిని తీసుకురావడానికి కషి చేస్తున్నామని వివరించారు. ఇప్పటివరకూ శ్రీశైలం డ్యాం వద్ద 7.09 టీఎంసీల నీరు విడుదలైందని, జీడిపల్లి జలాశయానికి నాలుగు టీఎంసీలు చేరిందని తెలిపారు. హంద్రీ–నీవా రెండోవిడత కాలువకు నీళ్లు విడుదల చేసిన అనంతరం మిగిలిన నీరంతా పెన్నహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (పీఏబీఆర్)కు పంపుతామని చెప్పారు. -
జీడిపల్లి రిజర్వాయర్ లో యువకుడి గల్లంతు
బెళుగుప్ప : మండల పరిధిలోని జీడిపల్లి రిజర్వాయర్‌కు పుష్కర స్నానానికి వచ్చిన ప్రదీప్ (18) అనే యువకుడు గల్లంతయ్యాడు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. అనంతపురం నగరంలోని నాయక్‌నగర్‌లో నివాసం ఉంటున్న ప్రదీప్ తన మిత్రులు, సమీప బంధువులతో కలిసి ఆటోలో పుష్కర స్నానానికి జీడిపల్లి రిజర్వాయర్‌కు మంగళవారం వచ్చాడు. లోతు ఎక్కువ ఉన్న ప్రాంతంలోకి వెళ్లడంతో మునిగిపోయాడు. ఇది గమనించిన స్నేహితులు గాలించినా ఫలితం లేక పోయింది. విషయాన్ని ప్రదీప్ తల్లి కృష్ణమ్మకు తెలిపారు. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బెళుగుప్ప ఇన్చార్జ్ డీఎస్పీ చలపతిరావు, ఇన్చార్జ్ ఎస్ఐ శంకర్‌రెడ్డి, ఏఎస్ఐ విజయనాయక్ రిజర్వాయర్ వద్దకు బుధవారం వెళ్లి ఆరా తీశారు. గజ ఈతగాళ్లతో గల్లంతైన ప్రాంతంలో గాలింపుచర్యలు చేపట్టారు. అయినా ఎలాంటి ఆచూకీ లభించలేదు. ప్రదీప్ తండ్రి మునెప్ప మృతి చెందగా, తల్లి తమ్ముడితో కలసి ఉంటున్నాడు. ఆటో నడుపుతూ కుటుంబానికి అండగా ఉండేవాడని యువకుడి తల్లి కన్నీరు మున్నీరుగా విలపించింది. -
కృష్ణం వందే.. జగద్గురుం
– ఘనంగా ముగిసిన కృష్ణా పుష్కరాలు – ప్రత్యేకSపూజలు, హారతితో పుష్కరుడికి వీడ్కోలు పలికిన ఇన్చార్జ్ కలెక్టర్, ఎస్పీ దంపతులు – చివరిరోజూ పోటెత్తిన జీడిపల్లి – 12 రోజుల్లో దాదాపు 10 లక్షల మంది పుష్కర స్నానం – ‘అనంత’ను సస్యశ్యామలం చేయాలని కృష్ణమ్మను వేడుకున్న భక్తులు – నేటి నుంచి ఏడాది పాటు అంత్యపుష్కరాలు – పుష్కరాల విజయవంతంలో పోలీస్, రెవెన్యూ అధికారుల కీలకపాత్ర పన్నెండు రోజుల పుష్కర ఘట్టం మంగళవారం అద్వితీయంగా ముగిసింది. ఇన్నాళ్లూ కృష్ణమ్మ ఒడిలో సేదతీరిన లక్షలాది మంది భక్తులు.. చివరిరోజు పుష్కరుడికి ఘనంగా వీడ్కోలు పలికారు. నీ స్పర్శతో పునీతులయ్యామని, వచ్చే పుష్కరాల వరకు ఈ ఆనందానుభూతులను గుర్తుంచుకుంటామంటూ కృష్ణవేణికి వందనం సమర్పించారు. వేదపండితులు ప్రత్యేక పూజలు చేసి.. అఖండజ్యోతితో హారతిపట్టి పుష్కరుడికి వీడ్కోలు పలికారు. జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ లక్ష్మీకాంతం, ఎస్పీ రాజశేఖరబాబు దంపతులు పూజల్లో పాల్గొన్నారు. రాత్రి ఏడు గంటలకు దీపాలను రిజర్వాయర్‌లో వదిలి పుష్కరఘట్టానికి ముగింపు పలికారు. ఈ కార్యక్రమానికి వేలాదిమంది భక్తులు హాజరయ్యారు. కరువుతో నిత్యం అల్లాడుతున్న ‘అనంత’ను వచ్చే పుష్కర కాలానికి పూర్తి కరువు రహితంగా మార్చాలని కృష్ణమ్మను వేడుకున్నారు. సాక్షి ప్రతినిధి, అనంతపురం : జిల్లాలో తొలిసారి నిర్వహించిన కృష్ణ పుష్కరాలు ఘనంగా ముగిశాయి. ముగింపు వేడుకలను బెళుగుప్ప మండలం జీడిపల్లి రిజర్వాయర్‌లో కళ్యాణదుర్గం ఆర్డీవో రామారావు పర్యవేక్షణలో మంగళవారం నిర్వహించారు. సాయంత్రం ఆరు గంటలకు రిజర్వాయర్‌లో స్నానం ఆచరిస్తున్న భక్తులందరినీ ఆపేసి పూజలు మొదలెట్టారు. పూజలకు ఇన్చార్జ్ కలెక్టర్ లక్ష్మీకాంతం, ఎస్పీ రాజశేఖరబాబు దంపతులు హాజరయ్యారు. బంకమట్టితో తయారుచేసిన పార్థివలింగానికి జల, భస్మ, క్షీరాభిషేకాలు చేశారు. ఐదు వేల కడవలతో మహాకుంభాభిషేకం నిర్వహించారు. తర్వాత కృష్ణమ్మకు పంచ హారతులు పట్టారు. చివరగా సంధ్యాహారతి ఇచ్చి.. దీపాలను రిజర్వాయర్‌లో వదిలిపెట్టి పుష్కరుడికి వీడ్కోలు పలికారు. ముగింపు కార్యక్రమంలో పూజలతో పాటు కృష్ణమ్మపై ప్రత్యేకంగా పాటలు, భజనలు ఆలపించారు. వేలాదిమంది భక్తిపారవశ్యంలో మునిగిపోయారు. పదిలక్షల మంది పుష్కరస్నానం జీడిపల్లిలో కృష్ణాపుష్కరాలు ఈ నెల 12న మొదలయ్యాయి. జేసీ దంపతులు స్నానం ఆచరించి పుష్కరాలు ప్రారంభించారు. ఆ రోజు కేవలం 1500 మంది భక్తులు హాజరయ్యారు. ఆ తర్వాత భక్తుల సంఖ్య అమాంతం పెరిగింది. రోజుకు 50–70మంది దాకా స్నానం చేశారు. చివరి మూడురోజులు రెండులక్షలమంది చొప్పున తరలివచ్చారు. చివరిరోజు పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి, కేంద్రమాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి, ప్రభుత్వ చీఫ్‌విప్ కాలవ శ్రీనివాసులు, ఆర్డీవో మలోలతో పాటు పలువురు న్యాయమూర్తులు స్నానం ఆచరించారు. చివరిరోజు కావడంతో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. మంగళవారం తెల్లవారుజామున నాలుగు గంటల నుంచే స్నానాలు మొదలయ్యాయి. ఏడు గంటలకు ఘాట్లన్నీ కిక్కిరిశాయి. కర్ణాటకతో పాటు చిత్తూరు, వైఎస్సార్ జిల్లాలకు చెందిన భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఆ ముగ్గురు కీలకపాత్ర పుష్కరాలను జీడిపల్లిలో నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వం ఎలాంటి ప్రకటనా చేయలేదు. ఏర్పాట్లకు ఒక్కరూపాయి కేటాయించలేదు. ఈ నెల 11న కృష్ణమ్మ జీడిపల్లిలోకి చేరగానే ఆర్డీవో రామారావు వేదపండితులు రాఘవేంద్రజోషి, వేణుగోపాల్‌తో పాటు బెళుగుప్ప మండలంలోని ప్రజల సహకారంతో పుష్కరాలకు ఏర్పాట్లను చేశారు. భక్తుల రద్దీ పెరిగిన తర్వాత ఎస్పీ రాజశేఖరబాబు రోజూ 7–10మంది డీఎస్పీలతో పాటు వందలాదిమంది పోలీసులతో ప్రత్యేక బందోబస్తు నిర్వహించారు. పుష్కరాలు ఈ స్థాయిలో జరుగుతాయనే ఊహ లేకపోవడంతో 2,400 మంది పోలీసులను విజయవాడ బందోబస్తుకు పంపారు. అయినప్పటికీ ఉన్న పోలీసులతోనే ఎలాంటి ఇబ్బందీ లేకుండా చూశారు. చివరి నాలుగురోజులు స్వయంగా బందోబస్తును పర్వవేక్షించారు. వీరితో పాటు రాఘవేంద్ర తోటి మిత్రుల సహకారంతో సొంతంగా ఏర్పాట్లు చేయడంతో పాటు దాదాపు 50 మంది వేదపండితులను అక్కడ ఉంచి భక్తులతో పిండప్రదానాలు చేయించారు. నేటి నుంచి అంత్య పుష్కరాలు పుష్కరఘట్టం ముగిసినప్పటికీ మరో ఏడాది పాటు అంత్యపుష్కరాలు కొనసాగుతాయి. నేటి నుంచి రోజూ గంటపాటు పుష్కరుడు ఉంటారు. మధ్యాహ్నం 12.30 నుంచి 1.30 వరకూ గంటపాటు స్నానాలు చేయొచ్చు. తర్వాత సరిగ్గా ఏడాదికి 12రోజుల ముందు అంత్యపుష్కర ‡వేడుకలో మళ్లీ 12 రోజుల పాటు జరుగుతాయి. ఇప్పుడు పుష్కరస్నానం చేసిన భక్తులు ఏడాది తర్వాత అంత్యపుష్కరాల్లో కూడా స్నానం ఆచరిస్తే మంచిదని వేదపండితులు చెబుతున్నారు. వైఎస్‌ను స్మరించుకున్న లక్షలాదిమంది భక్తులు జీడిపల్లి అనేది పదేళ్ల కిందట అడవిలా ఉండేది. ఇలాంటి ప్రాంతంలో రిజర్వాయర్ నిర్మించి, కృష్ణాజలాలు జిల్లాకు వచ్చేలా చేశారు.. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి. జిల్లా వాసులు నేడు పుష్కరస్నానం ఆచరించేందుకు కారణం వైఎస్సేనని భక్తులంతా స్మరించుకున్నారు. ‘కరువుజిల్లాను సస్యశ్యామలం చేసేందుకు ఎక్కడో శ్రీశైలంలోని నిన్ను ఇంతదూరం తీసుకొచ్చారు. లక్షలాదిమంది పూజలు ఫలించేలా వచ్చే పుష్కరకాలానికి అనంతపురంలో కరువు అనేది కన్పించకుండా జిల్లాను సస్యశ్యామలం చేయాల’ని భక్తులు కృష్ణమ్మను వేడుకున్నారు. -
జనసాగరం
-
జీడిపల్లికి పుష్కర శోభ
బెళుగుప్ప: కృష్ణా పుష్కరాల్లో భాగంగా మండల పరిధిలోని జీడిపల్లి రిజర్వాయర్ పుష్కర శోభను సంతరించుకుంది. రిజర్వాయర్‌లో ఏర్పాటు చేసిన ఘాట్‌లో పవిత్ర పుష్కర స్నానాలను ఆచరించడానికి ఆదివారం వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. జిల్లా వాసులతో పాటు కర్ణాటక ప్రాంతం నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. పుష్కరాలకు వచ్చు భక్తులకు ఆదివారం మండల పరిధిలోని నక్కలపల్లి గ్రామస్తులు భోజన వసతిని కల్పించారు. ప్రతి రోజూ మండల పరిధిలోని ఒక గ్రామం తరుపున భోజన వసతి కల్పనకు ముందుకు వచ్చారని అధికారులు తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు నడపాలని, రిజర్వాయర్ వద్ద మరిన్ని సౌకర్యాలు కల్పించాలని భక్తులు కోరుతున్నారు. -
ఒట్టి మాటలే..!
సాక్షి ప్రతినిధి, అనంతపురం :మాటలకు చేతలకు పొంతన కుదరకపోవడం అంటే ఇదే! హంద్రీ-నీవా సుజల స్రవంతి పథకం తొలి దశ ఆయకట్టు 1.98 లక్షల ఎకరాలకు నీళ్లందిస్తామని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి 2012 నవంబర్ 29న జీడిపల్లి రిజర్వాయర్‌ను జాతికి అంకితం చేసిన సందర్భంలో హామీ ఇచ్చారు. కానీ.. ఆ తర్వాత నీళ్లందించే ఆయకట్టును 1.98 లక్షల ఎకరాల నుంచి 40 వేలకు కుదించారు. పోనీ.. ఆ 40 వేల ఎకరాలకైనా నీళ్లందిస్తారా అంటే నీటిపారుదలశాఖ అధికారుల నుంచి స్పష్టమైన సమాధానం రావడం లేదు. కారణం.. ఆయకట్టుకు నీళ్లందించే డిస్ట్రిబ్యూటరీల పనులను కాంట్రాక్టర్లు ఇప్పటికీ ప్రారంభించకపోవడమే. దుర్భిక్ష రాయలసీమను సస్యశ్యామలం చేయడం కోసం దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హంద్రీ-నీవా సుజల స్రవంతి పథకాన్ని చేపట్టారు. ఈ ప్రాజెక్టు నుంచి 40 టీఎంసీలను ఎత్తిపోసి 6.02 లక్షల ఎకరాలకు సాగునీరు, 33 లక్షల మంది ప్రజలకు తాగునీరు అందించాలని నిర్ణయించారు. ఇందుకు రూ.6,850 కోట్లతో పరిపాలనపరమైన అనుమతులను జారీ చేసి.. పనులను ప్రారంభించారు. ఇందులో హంద్రీ-నీవా తొలి దశ అంచనా వ్యయం రూ.2,774 కోట్లు. ఇప్పటిదాకా 2,750 కోట్ల విలువైన పనులను పూర్తి ఒట్టి మాటలే..!చేశారు. తొలి దశ పనులు పూర్తి కావాలంటే మరో రూ.400 కోట్లను ఖర్చు చేయాలి. కానీ.. సర్కారు సక్రమంగా నిధులను విడుదల చేయకపోవడంతో హంద్రీ-నీవా తొలి దశ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఇప్పటిదాకా డిస్ట్రిబ్యూటరీల పనులనే కాంట్రాక్టర్లు ప్రారంభించకపోవడం అందుకు తార్కాణం. హంద్రీ-నీవా తొలి దశలో 1.98 లక్షల ఆయకట్టు ఉండగా.. ఇందులో 80 వేల ఎకరాల ఆయకట్టు కర్నూలు జిల్లా పరిధిలోనూ.. తక్కిన 1.18 లక్షల ఎకరాల ఆయకట్టు మన జిల్లాలోనూ ఉంది. హంద్రీ-నీవా తొలి దశ పనులను పాక్షికంగా పూర్తి చేసిన ప్రభుత్వం నవంబర్ 18న ట్రయల్ రన్ చేసింది. శ్రీశైలం రిజర్వాయర్ నుంచి 2.5 టీఎంసీల నీటిని ట్రయల్ రన్లో భాగంగా ఎత్తిపోసింది. ఇందులో 0.58 టీఎంసీల జలాలు జీడిపల్లి రిజర్వాయర్‌కు చేరాయి. జీడిపల్లి రిజర్వాయర్‌కు నీళ్లు చేరిన సందర్భంగా నవంబర్ 29న రఘువీరా పాదయాత్రను అక్కడ ముగించారు. ఈ సందర్భంగా సీఎం కిరణ్ మాట్లాడుతూ హంద్రీ-నీవా తొలి దశ ఆయకట్టుకు 2013 ఖరీఫ్‌లో నీళ్లందిస్తామని హామీ ఇచ్చారు. కృష్ణమ్మ పొంగిపొర్లుతున్నా.. హంద్రీ-నీవాను మిగులు జలాల ఆధారంగా చేపట్టిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో 2012 నవంబర్ 18న ట్రయల్ రన్ సందర్భంగా 2.5 టీఎంసీల నీళ్లను హంద్రీ-నీవా కాలువల్లోకి ఎత్తిపోస్తే ఓ ప్రాంతం ప్రజాప్రతినిధులు రాద్ధాంతం చేశారు. మిగులు జలాలతో చేపట్టిన ప్రాజెక్టుకు నికర జలాలను ఎలా విడుదల చేస్తారని నానా యాగీ చేశారు. హంద్రీ-నీవాకు కృష్ణా మిగులు జలాల్లో కేటాయించిన 40 టీఎంసీలను.. శ్రీశైలం రిజర్వాయర్‌కు వరద వచ్చే 120 రోజుల్లో వినియోగించుకోవాలని ప్రభుత్వం నిర్దేశించింది. గత 20 రోజులుగా శ్రీశైలం రిజర్వాయర్‌ను వరద ముంచెత్తుతోంది. శ్రీశైలం రిజర్వాయర్‌లో నీటిమట్టం పూర్తిస్థాయికి చేరుకోవడంతో పక్షం రోజుల క్రితమే నాగార్జునసాగర్‌కు నీటిని విడుదల చేశారు. నాగార్జునసాగర్ డ్యామ్ కూడా బుధవారం నిండిపోయింది. దాంతో.. గురువారం నాగార్జునసాగర్ నుంచి ప్రకాశం బ్యారేజీకి నీటిని విడుదల చేశారు. ఎట్టకేలకు బుధవారం ఉదయం 7.30 గంటల నుంచి శ్రీశైలం రిజర్వాయర్ నుంచి హంద్రీ-నీవాకు 700 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేస్తున్నారు. అదే 20 రోజుల క్రితమే నీటిని విడుదల చేసి ఉంటే.. వర్షాభావంతో అలమటిస్తోన్న ‘అనంత’ దాహార్తి అయినా తీరి ఉండేదనే భావన సర్వత్రా వ్యక్తమవుతోంది. ఇక బుధవారం శ్రీశైలం రిజర్వాయర్ నుంచి హంద్రీ-నీవా కాలువల్లోకి ఎత్తిపోసిన జలాలు గురువారం మధ్యాహ్నానికి బ్రాహ్మణకొట్కూరు వద్దకు చేరాయి. మన జిల్లాలోని జీడిపల్లి రిజర్వాయర్‌కు వచ్చే బుధవారం నాటికి కృష్ణా జలాలు చేరే అవకాశం ఉందని హంద్రీ-నీవా ఎస్ఈ సుధాకర్‌బాబు వెల్లడించారు. ఆయకట్టు కనికట్టే.. 2010 ఖరీఫ్‌లోనే హంద్రీ-నీవా తొలి దశ కింద ఆయకట్టుకు నీళ్లందిస్తామని అప్పటి సీఎం రోశయ్య 2010 ఏప్రిల్ 24న ప్రకటించారు. కానీ.. 2010 ఖరీఫ్ నాటికి తొలి దశ పనులే పూర్తి కాలేదు. 2011 ఖరీఫ్ నాటికి ఆయకట్టుకు నీళ్లందిస్తామని ప్రస్తుత సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి హామీ ఇచ్చారు. కానీ.. 2011 నాటికి పనులు పూర్తి కాలేదు. దాంతో.. ముహూర్తాన్ని 2012 ఖరీఫ్‌కు వాయిదా వేశారు. కానీ.. ఆ ముహూర్తం కూడా కుదరలేదు. చివరకు 2013 ఖరీఫ్‌లో నీళ్లందిస్తామని ప్రకటించారు. పోనీ.. ఈ సారైనా జాగ్రత్తలు తీసుకున్నారా అంటే అదీ లేదు. తొలుత 1.98 లక్షల ఎకరాలకు నీళ్లందిస్తామని సీఎం ప్రకటించారు. కానీ.. ఆ తర్వాత మాట మార్చి 80 వేల ఎకరాలకు నీళ్లందిస్తామన్నారు. పోనీ.. ఆ మాటపైనైనా నిలబడ్డారా అంటే అదీ లేదు.. చివరకు 40 వేల ఎకరాలకు నీళ్లందిస్తామని తేల్చారు. ఇందులో కర్నూలు జిల్లాలో 20 వేల ఎకరాలకు.. మన జిల్లాలో 20 వేల ఎకరాలకు నీళ్లందిస్తామని ప్రకటించారు. కానీ.. ఆ ఆయకట్టుకు కూడా నీళ్లందించే పరిస్థితులు కన్పించడం లేదు. ఎందుకంటే.. జిల్లా పరిధిలో ఎక్కడా డిస్ట్రిబ్యూటరీల పనులు పూర్తికాలేదు. వీటిని పరిగణనలోకి తీసుకుంటే ఈ ఏడాది ఆయకట్టుకు నీళ్లందించడం అసాధ్యమేనన్నది స్పష్టమవుతోంది. వాస్తవాలను పరిగణనలోకి తీసుకోని రెవెన్యూ మంత్రి రఘవీరారెడ్డి హంద్రీ-నీవా కింద ఆరుతడి పంటలు సాగు చేసుకునే రైతులను చైతన్య పరచాలని అధికారులకు దిశానిర్దేశం చేయడం కొసమెరుపు.