
జీడిపల్లి రిజర్వాయర్‌లో యువకుడు గల్లంతు
బెళుగుప్ప : జీడిపల్లి రిజర్వాయర్‌లో ఈతకు వెళ్లిన ఓ యువకుడు గల్లంతయ్యాడు. బాధితుడి కుటుంబసభ్యులు, స్థానికులు తెలిపిన మేరకు.. గంగవరం గ్రామానికి చెందిన కంసలి లక్ష్మప్ప, రాజేశ్వరి దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. గత ఏడాది లక్ష్మప్ప అనారోగ్యంతో చనిపోయాడు. దీంతో పెద్ద కుమారుడు వినయ్ గాలిమరల కంపెనీలో దినసరి కూలీగాను, రెండవ కుమారుడు రాజశేఖర్ (23) హైదరాబాద్‌లోని ప్రైవేట్ కంపెనీలో అటెండర్‌గాను పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు.
నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకుని ఆదివారం తన మిత్రులతో కలసి రాజశేఖర్ జీడిపల్లి రిజర్వాయర్‌కు వెళ్లి అక్కడే విందు చేసుకున్నారు. అనంతరం తిరిగి వెళుతూ రిజర్వాయర్ మరువ వద్ద స్నేహితులతో కలసి ఈతకు దిగాడు. అరకొరగా ఈత వచ్చే రాజశేఖర్ నీటిలో మునిగాక ఎంతసేపటికీ బయటకు రాలేదు. దీంతో స్థానికులు, రాజశేఖర్ బంధువులు మరువ ప్రాంతంలో గాలింపు చేపట్టినా జాడ కనిపించలేదు.