కృష్ణం వందే.. జగద్గురుం | krishna pushkaras in jeedipalli | Sakshi
Sakshi News home page

కృష్ణం వందే.. జగద్గురుం

Published Tue, Aug 23 2016 11:12 PM | Last Updated on Fri, Jun 1 2018 8:59 PM

కృష్ణం వందే.. జగద్గురుం - Sakshi

కృష్ణం వందే.. జగద్గురుం

– ఘనంగా ముగిసిన కృష్ణా పుష్కరాలు
– ప్రత్యేకSపూజలు, హారతితో పుష్కరుడికి వీడ్కోలు పలికిన ఇన్‌చార్జ్‌ కలెక్టర్, ఎస్పీ దంపతులు
– చివరిరోజూ పోటెత్తిన జీడిపల్లి
– 12 రోజుల్లో దాదాపు 10 లక్షల మంది పుష్కర స్నానం
– ‘అనంత’ను సస్యశ్యామలం చేయాలని కృష్ణమ్మను వేడుకున్న భక్తులు
– నేటి నుంచి ఏడాది పాటు అంత్యపుష్కరాలు
– పుష్కరాల విజయవంతంలో పోలీస్, రెవెన్యూ అధికారుల కీలకపాత్ర


 పన్నెండు రోజుల పుష్కర ఘట్టం మంగళవారం అద్వితీయంగా ముగిసింది. ఇన్నాళ్లూ కృష్ణమ్మ ఒడిలో సేదతీరిన లక్షలాది మంది భక్తులు.. చివరిరోజు పుష్కరుడికి ఘనంగా వీడ్కోలు పలికారు. నీ స్పర్శతో పునీతులయ్యామని, వచ్చే పుష్కరాల వరకు ఈ ఆనందానుభూతులను గుర్తుంచుకుంటామంటూ కృష్ణవేణికి వందనం సమర్పించారు. వేదపండితులు ప్రత్యేక పూజలు చేసి.. అఖండజ్యోతితో హారతిపట్టి పుష్కరుడికి వీడ్కోలు పలికారు. జిల్లా ఇన్‌చార్జ్‌ కలెక్టర్‌ లక్ష్మీకాంతం, ఎస్పీ రాజశేఖరబాబు దంపతులు పూజల్లో పాల్గొన్నారు. రాత్రి ఏడు గంటలకు దీపాలను రిజర్వాయర్‌లో వదిలి పుష్కరఘట్టానికి ముగింపు పలికారు. ఈ కార్యక్రమానికి వేలాదిమంది భక్తులు హాజరయ్యారు. కరువుతో నిత్యం అల్లాడుతున్న ‘అనంత’ను వచ్చే పుష్కర కాలానికి పూర్తి కరువు రహితంగా మార్చాలని  కృష్ణమ్మను వేడుకున్నారు.

సాక్షి ప్రతినిధి, అనంతపురం : జిల్లాలో తొలిసారి నిర్వహించిన కృష్ణ పుష్కరాలు ఘనంగా ముగిశాయి. ముగింపు వేడుకలను బెళుగుప్ప మండలం జీడిపల్లి రిజర్వాయర్‌లో కళ్యాణదుర్గం ఆర్డీవో రామారావు పర్యవేక్షణలో మంగళవారం నిర్వహించారు. సాయంత్రం ఆరు గంటలకు రిజర్వాయర్‌లో స్నానం ఆచరిస్తున్న భక్తులందరినీ ఆపేసి పూజలు మొదలెట్టారు. పూజలకు ఇన్‌చార్జ్‌ కలెక్టర్‌ లక్ష్మీకాంతం, ఎస్పీ రాజశేఖరబాబు దంపతులు హాజరయ్యారు. బంకమట్టితో తయారుచేసిన పార్థివలింగానికి జల, భస్మ, క్షీరాభిషేకాలు చేశారు. ఐదు వేల కడవలతో మహాకుంభాభిషేకం నిర్వహించారు. తర్వాత కృష్ణమ్మకు పంచ హారతులు పట్టారు. చివరగా సంధ్యాహారతి ఇచ్చి.. దీపాలను రిజర్వాయర్‌లో వదిలిపెట్టి పుష్కరుడికి వీడ్కోలు పలికారు. ముగింపు కార్యక్రమంలో పూజలతో పాటు కృష్ణమ్మపై ప్రత్యేకంగా పాటలు, భజనలు ఆలపించారు. వేలాదిమంది భక్తిపారవశ్యంలో మునిగిపోయారు.

పదిలక్షల మంది పుష్కరస్నానం  
జీడిపల్లిలో కృష్ణాపుష్కరాలు ఈ నెల 12న మొదలయ్యాయి. జేసీ దంపతులు స్నానం ఆచరించి పుష్కరాలు ప్రారంభించారు. ఆ రోజు కేవలం 1500 మంది భక్తులు హాజరయ్యారు. ఆ తర్వాత భక్తుల సంఖ్య అమాంతం పెరిగింది. రోజుకు  50–70మంది దాకా స్నానం చేశారు. చివరి మూడురోజులు రెండులక్షలమంది  చొప్పున తరలివచ్చారు. చివరిరోజు పీసీసీ చీఫ్‌ రఘువీరారెడ్డి, కేంద్రమాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి, ప్రభుత్వ చీఫ్‌విప్‌ కాలవ శ్రీనివాసులు, ఆర్డీవో మలోలతో పాటు పలువురు న్యాయమూర్తులు స్నానం ఆచరించారు. చివరిరోజు కావడంతో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. మంగళవారం తెల్లవారుజామున నాలుగు గంటల నుంచే స్నానాలు మొదలయ్యాయి. ఏడు గంటలకు ఘాట్లన్నీ కిక్కిరిశాయి. కర్ణాటకతో పాటు చిత్తూరు, వైఎస్సార్‌ జిల్లాలకు చెందిన భక్తులు   భారీ సంఖ్యలో తరలివచ్చారు.

ఆ ముగ్గురు కీలకపాత్ర
పుష్కరాలను జీడిపల్లిలో నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వం ఎలాంటి ప్రకటనా చేయలేదు. ఏర్పాట్లకు ఒక్కరూపాయి కేటాయించలేదు. ఈ నెల 11న కృష్ణమ్మ జీడిపల్లిలోకి చేరగానే ఆర్డీవో రామారావు వేదపండితులు రాఘవేంద్రజోషి, వేణుగోపాల్‌తో పాటు బెళుగుప్ప మండలంలోని ప్రజల సహకారంతో పుష్కరాలకు  ఏర్పాట్లను చేశారు. భక్తుల రద్దీ పెరిగిన తర్వాత ఎస్పీ రాజశేఖరబాబు రోజూ 7–10మంది డీఎస్పీలతో పాటు వందలాదిమంది పోలీసులతో ప్రత్యేక బందోబస్తు నిర్వహించారు. పుష్కరాలు ఈ స్థాయిలో జరుగుతాయనే ఊహ లేకపోవడంతో 2,400 మంది పోలీసులను విజయవాడ బందోబస్తుకు పంపారు. అయినప్పటికీ ఉన్న పోలీసులతోనే ఎలాంటి ఇబ్బందీ లేకుండా చూశారు. చివరి నాలుగురోజులు స్వయంగా బందోబస్తును పర్వవేక్షించారు. వీరితో పాటు రాఘవేంద్ర తోటి మిత్రుల సహకారంతో సొంతంగా ఏర్పాట్లు చేయడంతో పాటు దాదాపు 50 మంది వేదపండితులను అక్కడ ఉంచి భక్తులతో పిండప్రదానాలు చేయించారు.

నేటి నుంచి  అంత్య పుష్కరాలు
పుష్కరఘట్టం ముగిసినప్పటికీ మరో ఏడాది పాటు అంత్యపుష్కరాలు కొనసాగుతాయి. నేటి నుంచి రోజూ గంటపాటు పుష్కరుడు ఉంటారు. మధ్యాహ్నం 12.30 నుంచి 1.30 వరకూ గంటపాటు స్నానాలు చేయొచ్చు. తర్వాత సరిగ్గా ఏడాదికి 12రోజుల ముందు అంత్యపుష్కర ‡వేడుకలో మళ్లీ 12 రోజుల పాటు జరుగుతాయి. ఇప్పుడు పుష్కరస్నానం చేసిన భక్తులు ఏడాది తర్వాత అంత్యపుష్కరాల్లో కూడా స్నానం ఆచరిస్తే మంచిదని వేదపండితులు చెబుతున్నారు.

వైఎస్‌ను స్మరించుకున్న లక్షలాదిమంది భక్తులు
జీడిపల్లి అనేది పదేళ్ల కిందట అడవిలా ఉండేది. ఇలాంటి ప్రాంతంలో రిజర్వాయర్‌ నిర్మించి, కృష్ణాజలాలు జిల్లాకు వచ్చేలా చేశారు.. దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి. జిల్లా వాసులు నేడు పుష్కరస్నానం ఆచరించేందుకు కారణం వైఎస్సేనని భక్తులంతా స్మరించుకున్నారు. ‘కరువుజిల్లాను సస్యశ్యామలం చేసేందుకు ఎక్కడో శ్రీశైలంలోని నిన్ను ఇంతదూరం తీసుకొచ్చారు. లక్షలాదిమంది పూజలు ఫలించేలా వచ్చే పుష్కరకాలానికి అనంతపురంలో కరువు అనేది కన్పించకుండా జిల్లాను సస్యశ్యామలం చేయాల’ని భక్తులు కృష్ణమ్మను వేడుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement