ముచ్చుమర్రి వద్దు.. నెహ్రూనగర్ ముద్దు!
Published Tue, Aug 9 2016 12:15 AM | Last Updated on Tue, Aug 21 2018 5:54 PM
అధికార పార్టీ నేతలు ఏమి చేసినా చెల్లుబాటు అవుతుందనేందుకు మరో ఉదాహరణ ఇది. పగిడ్యాల మండలం ముచ్చుమర్రి వద్ద రాయలసీమ పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి సొంత ఖర్చుతో పుష్కర ఘాట్ ఏర్పాటు చేస్తుంటే అధికార యంత్రాంగం ఒంటి కాలిపై లేచింది. 144 సెక్షన్ అంటూ కట్టడి చేసింది. జరగరానిది జరిగితే ఎవరు బాధ్యులంటూ పనులను నిలిపివేయించింది. ఇదే నియోజకవర్గంలో.. అదే ప్రాంతానికి సమీపంలో.. అధికార పార్టీ నేత అదే పనికి సిద్ధమయితే.. ఇదే అధికారులు దగ్గరుండి బందోబస్తు కల్పించారు. టీడీపీ నందికొట్కూరు నియోజకవర్గ ఇన్‌చార్జి మాండ్ర శివానందరెడ్డి నెహ్రూనగర్ సమీపంలోని గోకరాజు కుంట వద్ద తాత్కాలిక పుష్కరఘాట్ ఏర్పాటుకు సిద్ధపడగా.. ఒక సీఐ, ఇద్దరు ఎస్‌ఐలు, ఆరుగురు పోలీసులు బందోబస్తును పర్యవేక్షించడం.. అధికారులు కూడా కిక్కురుమనకపోవడం గమనార్హం.
పగిడ్యాల:
మండలంలోని నెహ్రూనగర్ గ్రామ సమీపంలోని గోకరాజుకుంట వద్ద తాత్కాలిక పుష్కర ఘాట్ ఏర్పాటుకు తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త మాండ్ర శివానందరెడ్డి సన్నహాలు చేస్తున్నారు. ఈ మేరకు సోమవారం ఆయన గ్రామానికి చేరుకుని స్థానిక నాయకులతో చర్చించారు. అదేవిధంగా రోజూ 5వేల మందికి భోజనాలు పెట్టేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. అయితే మరో మూడు రోజుల్లో కష్ణా పుష్కరాలు ప్రారంభం కానున్న వేళ మా్రండ నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం కోట్లాది రూపాయల వ్యయంతో సంగమేశ్వరం, శ్రీశైలం వద్ద పుష్కర ఘాట్‌లను అధికారికంగా నిర్మించినప్పటికీ అధికార పార్టీకే చెందిన నేత సొంత ఘాట్ నిర్మాణానికి సిద్ధపడటం గమనార్హం. ఇకపోతే ఇదే నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి రాయలసీమ పుష్కరాల నిర్వహణ పేరిట ముచ్చుమర్రిలో సొంత ఖర్చుతో ఘాట్ నిర్మాణానికి సిద్ధపడగా.. చివరి నిముషంలో అధికారులతో పాటు పోలీసులు అడ్డుపడ్డారు. చివరకు 144 సెక్షన్ విధించి పనులను నిలిపివేయించారు. అయితే ఇదే నియోజకవర్గంలో అధికార పార్టీ నేత సొంతంగా పుష్కర ఘాట్ నిర్మించేందుకు సిద్ధపడగా అధికారులు నోరు తెరవకపోగా.. పోలీసులు కూడా ఆయనకు బందోబస్తు కల్పించడం విమర్శలకు తావిస్తోంది.
Advertisement
Advertisement