సాగర్‌లో ఆగిన పుష్కర పనులు
నాగార్జునసాగర్ : సాగర్‌లో జరుగుతున్న పుష్కర పనులు నిలిచిపోయాయి. సురికి ఆంజనేయస్వామి ఘాట్‌లో రెండు రోజులుగా మెట్లు నిర్మించే పనులను నిలిపివేశారు. కాంక్రీట్ పనులు పూర్తి కావొస్తున్నాయి. ఈనెల 28 వరకే పనులు పూర్తి చేయాలని కలెక్టర్ విధించిన గడువు నేటితో ముగియనుంది. ఎలాంటి ఎటయిల్స్ వేయాలి, ఎక్కడ వరకు వేయాలనే విషయమై డ్యాం అధికారులు క్లారిటీ ఇవ్వలేదు. కాంట్రాక్టర్ టెయిల్స్ కంపెనీవారితో మాట్లాడుకొని గడువులోపు వేసేలా ఒప్పందం కుదుర్చుకున్నట్లు కిందిస్థాయి అధికారులు చెబుతున్నారు. సంబంధిత సీఈ మాత్రం ఇంతవరకు కాంట్రాక్టర్‌కు టెయిల్స్‌కు సంబంధించిన ఆదేశాలు జారీ చేయలేదని అంటున్నారు. అలాగే పార్కుల్లోనూ పనులు నిలిచిపోయాయి.
ఆగిన రోడ్డు పనులు
పుష్కర భక్తులకు పూర్తి భద్రత చేకూర్చేందుకు గాను డ్యాం అధికారులు వన్‌వే కోసం పాత రోడ్డుకు మరమ్మతులు చేస్తున్నారు. అయితే అటవీ అధికారులు అనుమతి లేదంటూ రెండు రోజలు క్రితం రోడ్డు పనులను నిలిపివేశారు. ఈ విషయమై డ్యాం అధికారులను సంప్రదించగా అనుమతుల కోసం దరఖాస్తు చేయనున్నట్లు తెలిపారు. అటవీ అధికారులను సంప్రదించగా అనుమతి కోసం దరఖాస్తు చేస్తే పరిశీలిస్తామని తెలిపారు.