రాంగోపాల్‌పేట: బ్యాంక్‌లో ఓ వినియోగదారుడికి చెందిన రూ.1.5 లక్షలు మాయమయ్యాయి. గోపాలపురం పోలీసుల కథనం ప్రకారం... బోయిగూడకు చెందిన భాస్కర్ ఫ్యాబ్రిక్ పనులు చేస్తుంటాడు. సోమవారం ఉదయం 11.30కి సెయింట్ మేరీస్‌రోడ్‌లోని ఆంధ్రాబ్యాంక్‌కు వచ్చిన భాస్కర్ తన వ్యాపారాల కోసం రూ.8.5 లక్షలు నగదు డ్రా చేశాడు. ఇతరులకు ఇచ్చేందుకు రూ.7 లక్షలు ఒక పేపర్‌లో చుట్టుకుని రూ. 1.5 లక్షలు పక్కన పెట్టాడు.
పేపర్‌లో చుట్టుకున్న రూ.7 లక్షలు తీసుకుని వెళ్లిపోయిన ఆయన మిగతా లక్షన్నర అక్కడే పెట్టి మరచిపోయాడు. కొద్దిదూరం వెళ్లాక బ్యాంక్‌లో మర్చిపోయిన డబ్బు గుర్తుకు వచ్చి..వెంటనే బ్యాంక్‌కు తిరిగి వచ్చి చూడగా అక్కడ కనిపించ లేదు. బ్యాంక్‌లో వాకబు చేసినా డబ్బు దొరకలేదు. దీంతో ఆయన గోపాలపురం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు.