-
ఎయిర్‌పోర్టుకు వెళ్లేందుకు కీలక మార్గం
-
పుష్కరాల నిధులు రూ.11.5 కోట్లు కేటాయింపు
-
మోకాలడ్డుతున్న ప్రజాప్రతినిధి
సాక్షి, రాజమహేంద్రవరం :
క్వారీ మార్కెట్ రోడ్డు అభివృద్ధికి ఓ ప్రజాప్రతినిధి మోకాలడ్డుతున్నారు. దీంతో అనుమతులు, నిధులు మంజూరైనప్పటికీ ఏడాదిన్నరగా పనులు ప్రారంభంకావడం లేదు. వివరాలివి...గోదావరి పుష్కరాల సమయంలో ఎయిర్‌పోర్టు నుంచి వీఐపీలు, భక్తులు వేల సంఖ్యలో వచ్చే అవకాశం ఉండడంతో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా వీరందరి రాకపోకలకు వీలుగా క్వారీ మార్కెట్ నుంచి లాలాచెరువు జంక్ష¯ŒS వరకూ ఇందుకు రూ.11.5 కోట్లతో రెండు కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మించేందుకు అధికారులు, ప్రజా ప్రతినిధులు నిర్ణయించారు. కానీ ఈ మార్గం ప్రతిపక్ష కార్పొరేటర్ల పరిధిలో ఉండడంతో ఈ రోడ్డు నిర్మాణాన్ని అధికార పార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి అడ్డుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఈ ప్రాంతం అభివృద్ధి చెందకూడదన్న ఉద్ధేశంతోనే ఆ ప్రజాప్రతినిధి రోడ్డు నిర్మాణ ప్రతిపాదనలు పక్కనబెట్టారని ఆ ప్రాంత ప్రజలు ఆరోపిస్తున్నారు. పేదల ఇళ్లు తొలగించాల్సి వస్తుందన్న నెపంతో ఈ రోడ్డు నిర్మాణాన్ని నిలిపివేశారని విమర్శిస్తున్నారు. పుష్కరాల సమయంలో 100 అడుగుల మేర ఈ రోడ్డును నిర్మించాలని రూ.11.5 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించారు. దానవాయిబాబు గుడి నుంచి సుబ్బారావుపేట వరకూ కొంత మంది పేదలు నివాసముంటున్నారు. దీంతో అప్పటి కమిషనర్ ఈ రోడ్డు నిర్మాణాన్ని 80 అడుగులకు కుదించారు. పుష్కరాల అనంతరం కమిషనర్ బదిలీ అయ్యారు. తర్వాత ఈ ప్రతిపాదనలు అటకెక్కాయి.
ఎంతో కీలకంగా మారిన రోడ్డు
సీఎం చంద్రబాబునాయుడు జిల్లా పర్యటనకు వచ్చిన ప్రతిసారి ఈ మార్గం నుంచే రాకపోకలు సాగిస్తున్నారు. ఎయిర్‌పోర్టు నుంచి క్వారీ మార్కెట్ జంక్ష¯ŒS మీదుగా లాలాచెరువు చెరుకుని నగరం, రూరల్ ప్రాంతాల్లోని వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. పశ్చిమగోదావరి జిల్లా నుంచి మధురపూడి విమానాశ్రయానికి వచ్చే ప్రజాప్రతినిధులు, ప్రయాణికులు ధవళేశ్వరం, వేమగిరి నుంచి 16వ నంబర్ జాతీయ రహదారి మీదుగా లాలాచెరువు వచ్చి క్వారీ మార్కెట్ రోడ్డు మీదుగా వెళతారు. ఇంతటి ప్రాధాన్యమున్న రోడ్డుకు ప్రతిపాదనలు రూపొందించినా ఇప్పటి వరకూ నిర్మాణం చేపట్టలేదు. ఇటీవల ఈ రోడ్డుకు ఇరువైపుల డ్రైనేజీలు కూడా పూర్తి చేశారు. ఈ ఏడాదిన్నర కాలంలో సీఎం వచ్చిన ప్రతిసారి నగరపాలక సంస్థ రూ.లక్షలు వెచ్చించి గుంతలు పూడ్చేందుకు తాత్కాలికంగా ప్యాచ్ వర్కులు చేయిస్తోంది. ఇప్పటికైనా అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి ఈ రోడ్డు నిర్మాణానికి తక్షణం చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.