లీకైన ప్రశ్నపత్రం ఇదే..
-పరీక్షకు ఒకరోజు ముందుగానే గణితం సమ్మెటీవ్-2 లీక్
– సోషల్ మీడియాలో హల్‌చల్
– చర్యలు తీసుకుంటామన్న డిప్యూటీ ఈఓ
కొలిమిగుండ్ల/నంద్యాల విద్య: విద్యార్థుల ప్రతిభను గుర్తించేందుకు సమ్మెటీవ్ పరీక్షలు నిర్వహిస్తుంటారు. అయితే, పరీక్షకు ఒక రోజు ముందే తొమ్మిది, పదోతరగతి గణితం అర్ధసంవత్సర (సమ్మెటీవ్–2) ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయి. సోషల్‌మీడియాలో అవి హల్‌చల్ చేస్తున్నాయి. సాధారణంగా సంక్రాంతి సెలవులకు ముందే పరీక్షలు పూర్తి చేసి..పాఠశాలలకు సెలవులు ప్రకటించడం ఆనవాయితీగా వస్తోంది. ఈసారి మాత్రం ప్రభుత్వం ఈనెల 7,8,9 తేదీల్లో తెలుగు, హిందీ, ఇంగ్లిషు పరీక్షలు నిర్వహించి..మిగిలిన పరీక్షలను సెలవులు తరువాత నిర్వహిస్తుంది.
ఇందులో భాగంగా సోమవారం నుంచి సమ్మెటీవ్–2 పరీక్షలు జరగాల్సి ఉంది. అయితే, ఒకరోజు ముందుగానే నంద్యాల, కొలిమిగుండ్ల ప్రాంతాల్లో టెన్త్ గణితం ప్రశ్నాపత్రాలు ఆదివారమే విద్యార్థుల దరి చేరాయి. ఇంకే ముందే ఎంచక్కా వారు అందులోని ప్రశ్నలకు జవాబులు సిద్ధం చేసుకున్నారు. మార్చిలో జరగనున్న పబ్లిక్ పరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేసేందుకు సమ్మెటీవ్–2 పరీక్షలు కీలకం.అంతటి ప్రాధాన్యమున్న ఈ పరీక్షల ప్రశ్నాపత్రాలు ఏ పాఠశాల నుంచి లీక్ అయ్యిందో తెలియాల్సి ఉంది. ప్రశ్నాపత్రాలు లీక్ ఘటనలు కష్టపడి చదువుకునే విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపుతాయని విద్యావంతులు, పిల్లల తల్లితండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రశ్నాప్రతాల లీకేజీపై విద్యాశాఖ ఉన్నతాధికారులు విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు. దీనిపై డిప్యూటీ డీఈఓ సుమతిని వివరణ కోరగా పేపర్ లీక్ సమాచారం తనకు అంద లేదని, ఏదైనా జరిగి ఉంటే బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు.