రాలిన ఆశల కుసుమం
♦ విషయం తెలిసి సొమ్మసిల్లిన తల్లిదండ్రులు
♦ చదువుకుంటానని బలవంతం చేస్తే పంపాం
♦ ఇలా జరుగుతుందనుకోలేదు
♦ కన్నీటిపర్యంతమవుతున్న కుటుంబ సభ్యులు
అచ్చన్నపాలెం (నల్లజర్ల) : చదువుకుంటానని బలవంత పెట్టాడు.. పది లక్షలు అప్పు చేసి మరీ పంపాం. ఇలా జరుగుతుందని అనుకోలేదని జర్మనీలో ఆదివారం మృతి చెందిన దండమూడి నాగమణిశంకర్ తల్లిదండ్రులు దిక్కులు పిక్కటిల్లేలా రోదిస్తున్నారు. ఆస్తి లేకున్నా అప్పు చేసైనా నా కొడుకును ఉన్నత చదువులు చదివించాలనుకున్నా. పది లక్షలు అప్పు చేసి మరీ ఉన్నత చదువుల కోసం జర్మనీ పంపాను. విధి వెక్కిరించింది. మృత్యువు కబళించింది. ఇపుడు తమకు దిక్కెవరంటూ ఆ దంపతులు రోదిస్తున్నారు. సోమవారం అచ్చన్నపాలెంలో దండమూడి వెంకటరత్నం ఇంటి వద్ద విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఉన్నత చదువుల కోసం జర్మనీ వెళ్ళి అసువులు బాసిన దండమూడి ఉదయ నాగ మణి శంకర్ బీచ్ వద్ద ఈతకొడుతూ మృతి చెందినట్టు తెల్సుకున్న బంధువులు, స్నేహితులు అతని ఇంటికి తరలి వచ్చారు. తండ్రి వెంకటరత్నం, తల్లి లక్ష్మీకుమారి, తాత శ్రీరామ్మూర్తి ఈవిషయం తెలియగానే సొమ్మసిల్లి పోయారు. వారిని బంధువులు ఓదార్చారు. తమకు ఎలాను చదువు లేదు. తమకున్న ఆరెకరాలలో మూడెకరాలు కూతురికి కట్నంగా ఇచ్చినా ఉన్న మూడెకరాలు అమ్మైనా కొడుకును ప్రయోజకుణ్ణి చేయాలనుకున్నాను.
నా ఆశలు అడియాసలయ్యాయంటూ తండ్రి కన్నీళ్ళ పర్యంతరమవుతున్నాడు. కనపడ్డవారందర్ని కనీసం నాకొడుకు శవానైన్నా తీసుకురండంటూ వేడుకుంటున్నాడు. దీనిపై స్పందించిన జెడ్పీ చైర్మన్ బాపిరాజు ఎంపీ కంభంపాటి రామ్మెహనరావుతోను, జర్మనీ తెలుగు అసోసియేషన్ సభ్యులతోను మాట్లాడారు. సీఎంతో మాట్లాడి మృతదేహం త్వరగా వచ్చే ఏర్పాట్లు చేస్తామని తల్లిదండ్రులకు ఆయన హామీ ఇచ్చారు.