'ఆస్తుల కోసమే హత్యలు'
ప్రొద్దుటూరు: టీడీపీ మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరద రాజులరెడ్డి కుటుంబ సభ్యులు ఆస్తి కోసమే హత్యలకు పాల్పడ్డారని వైఎస్‌ఆర్ జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి ఆరోపించారు. ఆయన విలేకరులకు ఆయా ఘటనల గురించి వివరించారు.
‘విజయవాడలో ఆంధ్రపత్రిక స్థలాన్ని యజమాని శంభుప్రసాద్.. ఆడిటర్ చక్రపాణికి విక్రయించి, అదే స్థలాన్ని మస్తాన్‌రెడ్డి అనే వ్యక్తికి రిజిస్ట్రేషన్ చేయించాడు. వరద రాజుల రెడ్డి కుటుంబీకులు తక్కువ ధరకు మస్తాన్‌రెడ్డి నుంచి కొనుగోలు చేశారు. మార్కెట్లో రూ.100 కోట్ల విలువైన ఈ ఎకరా స్థలానికి సంబంధించి టీడీపీ నేత వరదరాజులరెడ్డి మేనల్లుడు తోపుదుర్తి రాజశేఖరరెడ్డికి 35 శాతం, కుమారుడు నంద్యాల కొండారెడ్డికి 30 శాతం, మిగిలినదాంట్లో మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ శంకాపురం ప్రసాదరెడ్డి, ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య కుమారుడు బచ్చల ప్రతాప్, హైదరాబాద్‌కు చెందిన శ్రీనివాస ప్రసాద్‌కు వాటాలు ఉన్నాయి. అనంతరం వీరు 22 ఫిబ్రవరి, 2012లో హైదరాబాద్‌లో ఆడిటర్ చక్రపాణిని హత్య చేశారు. ఈ కేసులో వీరిపై అదే నెల 29న హైదరాబాద్‌లో కేసు నమోదైందని’ తెలిపారు.
తర్వాత డబ్బు విషయంలో తేడా రావడంతో కటిక శివకుమార్‌ను గత నెల 7న హత్య చేశారని ఆరోపించారు. గతంలో వీరు తన హత్యకు కుట్ర పన్నారని, న్యాయవాది ఈవీ సుధాకర్‌రెడ్డిపై దాడి చేశారని, చెన్నమరాజుపల్లెకు చెందిన నడిపెన్న అనే వ్యక్తిని కూడా హత్య చేయించారని ఆరోపించారు. కేసు నుంచి బయట పడేందుకు రామచంద్రాపురం పోలీసులకు కోటి రూపాయల వరకు ముట్టజెప్పాలని ప్రయత్నించినట్లు రాచమల్లు పేర్కొన్నారు. ఇందుకోసం ప్రొద్దుటూరుకు చెందిన ఓ సీఐ నుంచి రూ.40 లక్షలు అప్పుతీసుకున్నారన్నారు.