నిలిచిన రేడియాలజీ సేవలు
కర్నూలు(హాస్పిటల్): రేడియాలజిస్టులు సమ్మె చేయడంతో జిల్లా వ్యాప్తంగా గురువారం సేవలు ఆగిపోయాయి. ప్రభుత్వ, ప్రై వేటు ఆస్పత్రులు, డయాగ్నోస్టిక్ సెంటర్లలో ఎక్స్‌రేలు, సిటీ స్కాన్‌లు, ఎంఆర్‌ఐ స్కాన్‌లు, ఆల్ట్రాసౌండ్ స్కానింగ్‌ల రిపోర్టులను చేయకుండా నిలిపివేశారు. అయితే అత్యవసర సేవలకు సమ్మెలో మినహాయింపు ఇచ్చి సేవలు అందించారు. సాధారణ సేవలు నిలిపివేయడంతో సూదూర ప్రాంతాల నుంచి ఆస్పత్రులకు వచ్చిన రోగులు వైద్య పరీక్షల రిపోర్టులు అందక ఇబ్బంది పడ్డారు. సమ్మెను పురస్కరించుకొని గురువారం కర్నూలు మెడికల్ కళాశాలలోని లైబ్రరీ వద్ద రేడియాలజిస్టులు ధర్నా నిర్వహించారు. అనంతరం ర్యాలీగా బయలుదేరి డీఎంఅండ్‌హెచ్‌ఓ కార్యాలయం చేరుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ డా.యు.స్వరాజ్యలక్ష్మికి వారు వినతిపత్రం సమర్పించారు. అనంతరం రేడియాలజీ వైద్యుల అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ పీసీపీన్‌డీటీ యాక్ట్‌ను సవరించాలని ఎనిమిది నెలల క్రితం కేంద్ర ప్రభుత్వానికి వినతిపత్రం సమర్పించినా స్పందన లేదన్నారు. యాక్ట్‌లోని చిన్న చిన్న లోపాలను ఎత్తిచూపుతూ రేడియాలజిస్టులను, స్కానింగ్ సెంటర్లను ఇబ్బందులకు గురి చేయడం సరికాదన్నారు. స్కానింగ్ సెంటర్ల అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నా నెలలు తరబడి అధికారులు స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.కార్యక్రమంలో అసోసియేషన్ కార్యదర్శి బి.ఎస్‌ఎన్ ప్రసాద్, ఉపాధ్యక్షుడు అన్వర్‌హుసేన్, సభ్యులు విజయకుమార్, సురేష్, రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.