radiologists
-
టిఫా స్కాన్ల నుంచి తప్పించండి
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వాసుపత్రుల్లో ఇటీవల ఏర్పాటు చేసిన టిఫా (టార్గెటెడ్ ఇమేజింగ్ ఫర్ ఫీటల్ అనామలీస్) స్కాన్లను తాము చేయలేమని గైనకాలజిస్టులు చేతులెత్తేస్తున్నారు. ఈ మిషన్లు సమకూర్చిన చోట వెంటనే రేడియాలజిస్టులను నియమించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఒక్కో ఆసుపత్రికి ఇద్దరు రేడియాలజిస్టులను, వారికి సహకరించే సిబ్బందిని నియమించాలని విన్నవిస్తున్నారు. రోగుల రద్దీతో ఇప్పటికే తమకు పని భారం పెరిగిందని, ఈ పరిస్థితుల్లో టిఫా స్కాన్లు అదనపు ఒత్తిడికి దారితీస్తున్నాయని సోమవారం పలువురు గైనకాలజిస్టులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొచ్చారు. గర్భస్త శిశువు ఎదుగుదలలో లోపాలను గుర్తించేందుకు అందుబాటులోకి తెచ్చిన టిఫా స్కానింగ్ గర్భిణులకు ఎంతో మేలు చేస్తుంది. ఇటీవల 44 ప్రభుత్వ ఆసుపత్రుల్లో 56 టిఫా స్కానింగ్ మిషన్లను ప్రభుత్వం సమకూర్చింది. కానీ రేడియాలజిస్టులను మాత్రం నియమించలేదు. మరోవైపు ప్రస్తుతం ప్రభుత్వాసుపత్రులలో పనిచేసే గైనకాలజిస్టులంతా సీనియ ర్లు కావడంతో కొత్త టెక్నాలజీపై వారికి పెద్దగా అవగాహన లేదని అంటున్నారు. దీంతో చాలామంది డాక్టర్లు టిఫా చేసేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ కారణంగానే రేడియాలజిస్టులను నియమించాలని కోరుతున్నారు. ఇప్పటికే నిమిషం తీరిక లేకుండా..!: రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వాసుపత్రుల్లో గైనకాలజిస్టుల సంఖ్య ప్రస్తుతం తక్కువగా ఉంది. ఒక్కో గైనకాలజిస్టు ప్రతిరోజు సరాసరి వంద మందిని పరీక్షిస్తున్నారు. దీంతో గర్భిణుల వైద్య సేవల్లో జాప్యం జరుగుతోంది. మరోవైపు గతంతో పోల్చితే ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే గర్భిణుల సంఖ్య విపరీతంగా పెరిగింది. ఓపీతో పాటు జనరల్, ఏఎన్సీ చెకప్‌లు, సాధారణ స్కానింగ్‌చికిత్సలన్నీ గైనకాలజిస్టు లే చూడాల్సి వస్తోంది. ఇలా నిమిషం ఖాళీ లేని పరిస్థితుల్లో తాము ఉంటున్నామని గైనకాలజిస్టులు వాపోతున్నారు. తాజా టిఫా బాధ్యతలు కూడా అప్పగించడంతో సమర్థవంతంగా వైద్య సేవలు అందించలేక పోతున్నామని చెబుతున్నారు. ఒక్కో స్కాన్‌కు 40 నిమిషాలు: ఒక్కో గర్భినికి టిఫా స్కానింగ్ చేయాలంటే సుమారు 40 నిమిషాలు పడుతుంది. టిఫా స్కా న్ ద్వారా శిశువు గర్భంలో ఏ విధంగా ఉంది? ఉమ్మనీరు స్థితి ఎలా ఉంది? రక్త ప్రసరణ, మెదడు, గుండె నిర్మాణం వంటివి సరిగ్గానే ఉన్నాయా? అనేది సులువుగా కనిపెట్టవచ్చు. మేనరిక వివాహాలు, జన్యు సంబంధలో పాలు, ఆలస్యంగా గర్భం దాల్చడం, కొందరికి గర్భం దాల్చిన ప్పటి నుంచే శారీరక, మానసిక సమస్యలు ఉత్పన్నం కావడం, పోషకాహార లోపం.. ఇలాంటివి శిశువులపై చూపించే ప్రభావాన్ని కూడా గుర్తించవచ్చు. గ్రహణం మొర్రి, గుండెలో రంధ్రం, కాళ్లు, చేతులు వంకరగా ఉండటం, వెన్నుపూస వంటి అవయవాల్లో ఏవైనా లోపాలు ఉన్నా తెలుస్తాయి. కొన్ని సందర్భాల్లో పిల్లలు పుట్టగానే సర్జరీ చేయాల్సి ఉంటుంది. టిఫాలో దీన్ని ముందే గుర్తించగలిగితే ప్రసవ సమయంలో ప్రాణాలు రక్షించగలుగుతారు. 3డీ, 4డీ ఇమేజింగ్ స్కాన్‌లో ఇవన్నీ గుర్తించేందుకు వీలుంటుంది. -
సీటీ స్కాన్: ఎయిమ్స్ డైరెక్టర్ వాదనలను ఖండించిన ఐఆర్‌ఐఏ
సాక్షి, న్యూఢిల్లీ : కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ లేదా సీటీ స్కాన్లు చాలా హానికరం అన్న ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణ్‌దీప్ గులేరియా వ్యాఖ్యలపై ఇండియన్ రేడియోలాజికల్ అండ్ ఇమేజింగ్ అసోసియేషన్ స్పందించింది. ఒక్క సీటీ స్కాన్ 300-400ఎక్స్-రేలకు సమానమని, క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందన్న వాదనలు చాలా ఔట్ డేటెడ్ సిద్ధాంతమని అసోసియేషన్ కొట్టి పారేసింది. ఈ వాదన 30-40 సంవత్సరాల క్రితం నాటిదని ఐఆర్‌ఐఏ పేర్కొంది 5-10 ఎక్స్-కిరణాలతో పోల్చదగిన రేడియేషన్‌ను విడుదల చేసే అత్యాధునిక స్కానర్లు ఇపుడు అందుబాటులోకి వచ్చాయంటూ గులేరియా వ్యాఖ్యలను అసోసియేషన్ ఖండించింది. గులేరియా వ్యాఖ్యలు అశాస్త్రీయమైనవి, బాధ్యతా రహితమైనంటూ అసోసియన్ అధ్యక్షుడు ప్రొఫెసర్ సి. అమర్నాథ్ సంతకంతో ఒక ప్రకటన విడుదల చేసింది. సిటీ ఛాతీ స్కాన్ క్యాన్సర్‌కు కారణమవుతుందనే ప్రకటన ఆందోళనకరంగా ఉందని వ్యాఖ్యానించింది. ప్రపంచవ్యాప్తంగా రేడియాలజిస్టులు అలారా (ఏఎల్‌ఏఆర్‌ఏ: సహేతుకంగా సాధించగలిగినంత తక్కువ) సూత్రాన్ని ఉపయోగిస్తున్నారన్నారు. దీన్నుంచి వచ్చే రేడియేషన్ ఒక వ్యక్తి ఒక సంవత్సరానికి గురయ్యే రేడియేషన్‌కు సమానమని కూడా తెలిపింది. (అలర్ట్: సీటీ స్కాన్‌తో క్యాన్సర్ వచ్చే అవకాశం..) కోవిడ్ సోకిన వారు వివిధ రకాల లక్షణాలతో బాధపడుతున్నారనీ, తక్కువ వైరల్ లోడ్ కారణంగా, ఆర్టీ పీసీఆర్ నెగిటివ్ వచ్చినా, ఊపిరితిత్తులు కొందరిలో పాడైపోతున్నాయని, ఇలాంటి సమయంలో సిటీ స్కాన్ అవసరం చాలా ఉందని పేర్కొంది. అంతేకాదు ప్రారంభ దశలో ఊపిరితిత్తుల పనితీరును గుర్తించే పల్స్ ఆక్సీమీటర్ కంటే సీటీ స్కాన్లు అత్యంత సున్నితమైనవి ఐఆర్ఐఎ తెలిపింది. ముఖ్యంగా కరోనా సెకండ్‌వేవ్‌లో యువకులు హ్యాపీ హైపోక్సియా (ఎటువంటి వ్యాధి లక్షణాలు కనిపించకుండా, ఆక్సిజన్ స్థాయి పడిపోవడం) తోబాధపడుతున్నారని ఈక్రమంలో ఎంత త్వరగా చికిత్స ప్రారంభిస్తే, రోగిని కాపాడటం అంత సులభమని వెల్లడించింది. తద్వారా వ్యాధి తీవ్రతను ముందస్తుగా గుర్తించడంతోపాటు, తొందరగా చికిత్సను ప్రారంభించడానికి సహాయపడుతుందని తెలిపింది.అలాగే వారు సూపర్-స్ప్రెడర్లు కాకుండా నిరోధించగల. సిటీ స్కాన్ ద్వారా బాధితులు ఆసుపత్రిలో చేరాలా, లేదా ఇంట్లో ఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందితే సరిపోతుందా అనేది తెలుసుకోవచ్చు. వైరస్ తీవ్రతను, అతి విస్తరిస్తున్న తీరును పర్యవేక్షించవచ్చు, ముఖ్యంగా తీవ్ర లక్షణాలున్నవారిలో సిటీ స్కాన్ పాత్ర అనూహ్యం. సరైన సమయంలో స్టెరాయిడ్లను ప్రారంభించడం ద్వారా ప్రాణ నష్టాన్ని నివారించవచ్చని తెలిపింది. అలాగే ఆసుపత్రులలో బెడ్స్ కొరత, ఆక్సిజన్ కొరత లాంటి సంక్షోభంనుంచి బయటపడవచ్చని స్పష్టం చేసింది. (కరోనా మరణ మృదంగం: సంచలన అంచనాలు) కాగా ఒక్క సీటీ స్కాన్ 300-400 ఎక్స్‌రేలతో సమానమని, దానితో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణ్‌దీప్ గులేరియా ఇటీవల వ్యాఖ్యానించారు. అవసరమైతే తప్ప సీటీ స్కాన్ల జోలికి వెళ్లొద్దని సూచించిన సంగతి తెలిసిందే. -
రోగ నిర్ధారణలో రేడియాలజిస్టులే కీలకం
సాక్షి, హైదరాబాద్: రోగ నిర్ధారణలో రేడియాలజిస్టుల పాత్ర కీలకమని పలువురు వైద్య నిపుణులు పేర్కొన్నారు. ఐఆర్‌ఐఏ తెలంగాణ స్టేట్ చాప్టర్ ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్ బేగంపేటలోని హోటల్ మానస సరోవర్‌లో ‘ఇండో–యూఎస్ ఇమేజింగ్ అప్డేట్ సదస్సు’జరిగింది. తెలంగాణ కాళోజీ హెల్త్ యూనివర్సిటీ వైఎస్ చాన్స్‌లర్ కరుణాకర్‌రెడ్డి, నిమ్స్ డైరెక్టర్ మనోహర్, ఫ్యాకల్టీ డాక్టర్ వెంకట్రామ్రెడ్డి, డాక్టర్ ప్రభాకర్‌రెడ్డి, డాక్టర్ అమర్నాథ్, డాక్టర్ సికిందర్, డాక్టర్ రాజేశ్, డాక్టర్ టీఎల్ఎన్ ప్రసాద్, డాక్టర్ జాఫర్ హసన్, డాక్టర్ ఖదీర్ చింతపల్లి, డాక్టర్ జగన్మోహన్రెడ్డి, డాక్టర్ శ్రీనివాస్ప్రసాద్లతో పాటు దేశవిదేశాలకు చెందిన సుమారు 350 మంది ప్రతినిధులు సదస్సుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... కాలేయం, మూత్రపిండాలు, ప్రాంకీయాస్, చిన్న, పెద్దపేగుల్లో తలెత్తే సమస్యలను ఎంఆర్ఐ, సీటీ, అల్ట్రాసౌండ్ల ద్వారా సులభంగా గుర్తించవచ్చన్నారు. రేడియాలజిస్టులకు తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తుందని, రోగ నిర్ధారణ పరీక్షల కోసం ప్రభుత్వం రూ.160 కోట్ల మంజూరు కూడా చేసిందని కరుణాకర్‌రెడ్డి తెలిపారు. రేడియాలజీ కోర్సులను అభ్యసిస్తున్న వారికి ఈ రంగంలో మంచి భవిష్యత్తు ఉందన్నారు. నాన్ ఆల్కాహాలిక్ కేసులు పెరిగాయి అతిగా మద్యం సేవించడంతో కాలేయం దెబ్బతింటున్న విషయం అందరికీ తెలిసిందే. కానీ నాన్ ఆల్కాహాలిక్(మద్యం అలవాటు లేని) కేసులు కూడా ఎక్కువగా నమోదవుతున్నాయి. రాత్రిపొద్దుపోయిన తర్వాత తినడం వల్ల చాలా మంది ఫ్యాటీ లివర్ సమస్యను ఎదుర్కొంటున్నారు. వందలో 50 శాతం మంది ఇదే సమస్యతో బాధపడుతున్నారు. కానీ చాలా మందికి ఈ విషయం తెలియదు. – డాక్టర్ కేథర్ చింతపల్లి, ప్రముఖ రేడియాలజిస్టు టెక్నాలజీలో అనేక మార్పులు వైద్యరంగంలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఒకప్పుడు ప్రతిదానికీ బయాప్సీ అవసరం ఉండేది. ప్రస్తుతం ఆ అవసరం లేదు. అత్యాధునిక ఎంఆర్ఐ, సీటీ, అల్ట్రాసౌండ్ వంటి వైద్యపరికరాలు అందుబాటులోకి వచ్చాయి. వీటి ద్వారా బాడీలో ఏ భాగం దెబ్బతిన్నదో ఇట్టే తెలిసిపోతుంది. – డాక్టర్ విజయభాస్కర్ నూరి, డైరెక్టర్, విస్టా ఇమేజింగ్ అండ్ మెడికల్ సెంటర్ -
నేటి నుంచి రేడియాలజిస్టుల దేశవ్యాప్త సమ్మె
న్యూఢిల్లీ: తమ సమస్యలపై కేంద్ర ప్రభుత్వం నుంచి సరైన హామీ రాకపోవడంతో రేడియాలజిస్టులు నేటి నుంచి నిరవధిక సమ్మె చేయనున్నారు. దీంతో రేడియాలజీ , అల్ట్రాసోనోగ్రఫీ, ఇతర స్కానింగ్ సేవలు తీవ్రంగా ప్రభావితం కానున్నాయి. సెప్టెంబర్ 1 నుంచే సమ్మె చేయాలని నిర్ణయించినా... కేంద్ర ప్రభుత్వంతో చర్చల అనంతరం ఇండియన్ రేడియోలాజిక్ అండ్ ఇమేజింగ్ అసోసియేషన్ తన నిర్ణయంపై పునరాలోచన చేసింది. రెండు నెలల వ్యవధిలో డిమాండ్లు పరిష్కరిస్తామని కేంద్రం చెప్పినా... సరైన హామీనివ్వకపోవడంతో నేటి నుంచి సమ్మె చేయాలని నిర్ణయించారు. -
నిలిచిన రేడియాలజీ సేవలు
కర్నూలు(హాస్పిటల్): రేడియాలజిస్టులు సమ్మె చేయడంతో జిల్లా వ్యాప్తంగా గురువారం సేవలు ఆగిపోయాయి. ప్రభుత్వ, ప్రై వేటు ఆస్పత్రులు, డయాగ్నోస్టిక్ సెంటర్లలో ఎక్స్‌రేలు, సిటీ స్కాన్లు, ఎంఆర్ఐ స్కాన్లు, ఆల్ట్రాసౌండ్ స్కానింగ్‌ల రిపోర్టులను చేయకుండా నిలిపివేశారు. అయితే అత్యవసర సేవలకు సమ్మెలో మినహాయింపు ఇచ్చి సేవలు అందించారు. సాధారణ సేవలు నిలిపివేయడంతో సూదూర ప్రాంతాల నుంచి ఆస్పత్రులకు వచ్చిన రోగులు వైద్య పరీక్షల రిపోర్టులు అందక ఇబ్బంది పడ్డారు. సమ్మెను పురస్కరించుకొని గురువారం కర్నూలు మెడికల్ కళాశాలలోని లైబ్రరీ వద్ద రేడియాలజిస్టులు ధర్నా నిర్వహించారు. అనంతరం ర్యాలీగా బయలుదేరి డీఎంఅండ్‌హెచ్‌ఓ కార్యాలయం చేరుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ డా.యు.స్వరాజ్యలక్ష్మికి వారు వినతిపత్రం సమర్పించారు. అనంతరం రేడియాలజీ వైద్యుల అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ పీసీపీన్‌డీటీ యాక్ట్‌ను సవరించాలని ఎనిమిది నెలల క్రితం కేంద్ర ప్రభుత్వానికి వినతిపత్రం సమర్పించినా స్పందన లేదన్నారు. యాక్ట్‌లోని చిన్న చిన్న లోపాలను ఎత్తిచూపుతూ రేడియాలజిస్టులను, స్కానింగ్ సెంటర్లను ఇబ్బందులకు గురి చేయడం సరికాదన్నారు. స్కానింగ్ సెంటర్ల అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నా నెలలు తరబడి అధికారులు స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.కార్యక్రమంలో అసోసియేషన్ కార్యదర్శి బి.ఎస్ఎన్ ప్రసాద్, ఉపాధ్యక్షుడు అన్వర్‌హుసేన్, సభ్యులు విజయకుమార్, సురేష్, రవీంద్ర తదితరులు పాల్గొన్నారు. -
రేపటి నుంచి రేడియాలజిస్టుల సమ్మె
కర్నూలు(హాస్పిటల్): పీసీ పీఎన్డీటీ యాక్ట్‌లో కొన్ని మార్పులు చేయాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ ఒకటి నుంచి రేడియాలజిస్టులు సమ్మె చేస్తున్నట్లు కర్నూలు రేడియాలజి అసోసియేషన్ కార్యదర్శి డాక్టర్ బీఎస్ఎన్ ప్రసాద్ చెప్పారు. మంగళవారం ఆసుపత్రిలోని రేడియాలజి విభాగంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చిన్న చిన్న కారణాలు చూపి స్కానింగ్ సెంటర్లను, రేడియో డయాగ్నోస్టిక్ సెంటర్లను ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు పీసీపీఎన్డీటీ యాక్ట్‌లో కొన్ని మార్పులు చేయాలని 8 నెలల క్రితం ప్రభుత్వాన్ని కోరినా ఫలితం లేకుండా పోయిందన్నారు. దీంతో దేశవ్యాప్తంగా సెప్టెంబర్ ఒకటి నుంచి ప్రభుత్వ, ప్రయివేట్, డయాగ్నోస్టిక్ సెంటర్ల రేడియాలజిస్టులు సమ్మెలోకి వెళ్తున్నారని తెలిపారు. 2వ తేదీ నుంచి వారం రోజుల పాటు గర్భిణిలకు స్కానింగ్ చేయడం బంద్ చేస్తామన్నారు. ఆసుపత్రుల్లో అత్యవసర కేసులను మాత్రం సమ్మె నుంచి మినహాయించినట్లు ఆయన పేర్కొన్నారు. సమావేశంలో అసోసియేషన్ ఉపాధ్యక్షుడు డాక్టర్ అన్వర్‌హుసేన్, సభ్యులు డాక్టర్ విజయకుమార్, డాక్టర్ సురేష్, డాక్టర్ రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.