సాక్షి, హైదరాబాద్: రోగ నిర్ధారణలో రేడియాలజిస్టుల పాత్ర కీలకమని పలువురు వైద్య నిపుణులు పేర్కొన్నారు. ఐఆర్‌ఐఏ తెలంగాణ స్టేట్ చాప్టర్ ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్ బేగంపేటలోని హోటల్ మానస సరోవర్‌లో ‘ఇండో–యూఎస్ ఇమేజింగ్ అప్‌డేట్ సదస్సు’జరిగింది. తెలంగాణ కాళోజీ హెల్త్ యూనివర్సిటీ వైఎస్ చాన్స్‌లర్ కరుణాకర్‌రెడ్డి, నిమ్స్ డైరెక్టర్ మనోహర్, ఫ్యాకల్టీ డాక్టర్ వెంకట్రామ్‌రెడ్డి, డాక్టర్ ప్రభాకర్‌రెడ్డి, డాక్టర్ అమర్‌నాథ్, డాక్టర్ సికిందర్, డాక్టర్ రాజేశ్, డాక్టర్ టీఎల్‌ఎన్ ప్రసాద్, డాక్టర్ జాఫర్ హసన్, డాక్టర్ ఖదీర్ చింతపల్లి, డాక్టర్ జగన్మోహన్‌రెడ్డి, డాక్టర్ శ్రీనివాస్‌ప్రసాద్‌లతో పాటు దేశవిదేశాలకు చెందిన సుమారు 350 మంది ప్రతినిధులు సదస్సుకు హాజరయ్యారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... కాలేయం, మూత్రపిండాలు, ప్రాంకీయాస్, చిన్న, పెద్దపేగుల్లో తలెత్తే సమస్యలను ఎంఆర్‌ఐ, సీటీ, అల్ట్రాసౌండ్‌ల ద్వారా సులభంగా గుర్తించవచ్చన్నారు. రేడియాలజిస్టులకు తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తుందని, రోగ నిర్ధారణ పరీక్షల కోసం ప్రభుత్వం రూ.160 కోట్ల మంజూరు కూడా చేసిందని కరుణాకర్‌రెడ్డి తెలిపారు. రేడియాలజీ కోర్సులను అభ్యసిస్తున్న వారికి ఈ రంగంలో మంచి భవిష్యత్తు ఉందన్నారు.
నాన్ ఆల్కాహాలిక్ కేసులు పెరిగాయి
అతిగా మద్యం సేవించడంతో కాలేయం దెబ్బతింటున్న విషయం అందరికీ తెలిసిందే. కానీ నాన్ ఆల్కాహాలిక్(మద్యం అలవాటు లేని) కేసులు కూడా ఎక్కువగా నమోదవుతున్నాయి. రాత్రిపొద్దుపోయిన తర్వాత తినడం వల్ల చాలా మంది ఫ్యాటీ లివర్ సమస్యను ఎదుర్కొంటున్నారు. వందలో 50 శాతం మంది ఇదే సమస్యతో బాధపడుతున్నారు. కానీ చాలా మందికి ఈ విషయం తెలియదు. – డాక్టర్ కేథర్ చింతపల్లి, ప్రముఖ రేడియాలజిస్టు
టెక్నాలజీలో అనేక మార్పులు
వైద్యరంగంలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఒకప్పుడు ప్రతిదానికీ బయాప్సీ అవసరం ఉండేది. ప్రస్తుతం ఆ అవసరం లేదు. అత్యాధునిక ఎంఆర్‌ఐ, సీటీ, అల్ట్రాసౌండ్ వంటి వైద్యపరికరాలు అందుబాటులోకి వచ్చాయి. వీటి ద్వారా బాడీలో ఏ భాగం దెబ్బతిన్నదో ఇట్టే తెలిసిపోతుంది. – డాక్టర్ విజయభాస్కర్ నూరి, డైరెక్టర్, విస్టా ఇమేజింగ్ అండ్ మెడికల్ సెంటర్
Comments
Please login to add a commentAdd a comment