సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వాసుపత్రుల్లో ఇటీవల ఏర్పాటు చేసిన టిఫా (టార్గెటెడ్ ఇమేజింగ్ ఫర్ ఫీటల్ అనామలీస్) స్కాన్లను తాము చేయలేమని గైనకాలజిస్టులు చేతులెత్తేస్తున్నారు. ఈ మిషన్లు సమకూర్చిన చోట వెంటనే రేడియాలజిస్టులను నియమించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఒక్కో ఆసుపత్రికి ఇద్దరు రేడియాలజిస్టులను, వారికి సహకరించే సిబ్బందిని నియమించాలని విన్నవిస్తున్నారు.
రోగుల రద్దీతో ఇప్పటికే తమకు పని భారం పెరిగిందని, ఈ పరిస్థితుల్లో టిఫా స్కాన్లు అదనపు ఒత్తిడికి దారితీస్తున్నాయని సోమవారం పలువురు గైనకాలజిస్టులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొచ్చారు. గర్భస్త శిశువు ఎదుగుదలలో లోపాలను గుర్తించేందుకు అందుబాటులోకి తెచ్చిన టిఫా స్కానింగ్ గర్భిణులకు ఎంతో మేలు చేస్తుంది.
ఇటీవల 44 ప్రభుత్వ ఆసుపత్రుల్లో 56 టిఫా స్కానింగ్ మిషన్లను ప్రభుత్వం సమకూర్చింది. కానీ రేడియాలజిస్టులను మాత్రం నియమించలేదు. మరోవైపు ప్రస్తుతం ప్రభుత్వాసుపత్రులలో పనిచేసే గైనకాలజిస్టులంతా సీనియ ర్లు కావడంతో కొత్త టెక్నాలజీపై వారికి పెద్దగా అవగాహన లేదని అంటున్నారు. దీంతో చాలామంది డాక్టర్లు టిఫా చేసేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ కారణంగానే రేడియాలజిస్టులను నియమించాలని కోరుతున్నారు.
ఇప్పటికే నిమిషం తీరిక లేకుండా..!: రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వాసుపత్రుల్లో గైనకాలజిస్టుల సంఖ్య ప్రస్తుతం తక్కువగా ఉంది. ఒక్కో గైనకాలజిస్టు ప్రతిరోజు సరాసరి వంద మందిని పరీక్షిస్తున్నారు. దీంతో గర్భిణుల వైద్య సేవల్లో జాప్యం జరుగుతోంది. మరోవైపు గతంతో పోల్చితే ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే గర్భిణుల సంఖ్య విపరీతంగా పెరిగింది. ఓపీతో పాటు జనరల్, ఏఎన్‌సీ చెకప్‌లు, సాధారణ స్కానింగ్‌చికిత్సలన్నీ గైనకాలజిస్టు లే చూడాల్సి వస్తోంది. ఇలా నిమిషం ఖాళీ లేని పరిస్థితుల్లో తాము ఉంటున్నామని గైనకాలజిస్టులు వాపోతున్నారు. తాజా టిఫా బాధ్యతలు కూడా అప్పగించడంతో సమర్థవంతంగా వైద్య సేవలు అందించలేక పోతున్నామని చెబుతున్నారు.
ఒక్కో స్కాన్‌కు 40 నిమిషాలు: ఒక్కో గర్భినికి టిఫా స్కానింగ్ చేయాలంటే సుమారు 40 నిమిషాలు పడుతుంది. టిఫా స్కా న్ ద్వారా శిశువు గర్భంలో ఏ విధంగా ఉంది? ఉమ్మనీరు స్థితి ఎలా ఉంది? రక్త ప్రసరణ, మెదడు, గుండె నిర్మాణం వంటివి సరిగ్గానే ఉన్నాయా? అనేది సులువుగా కనిపెట్టవచ్చు. మేనరిక వివాహాలు, జన్యు సంబంధలో పాలు, ఆలస్యంగా గర్భం దాల్చడం, కొందరికి గర్భం దాల్చిన ప్పటి నుంచే శారీరక, మానసిక సమస్యలు ఉత్పన్నం కావడం, పోషకాహార లోపం.. ఇలాంటివి శిశువులపై చూపించే ప్రభావాన్ని కూడా గుర్తించవచ్చు.
గ్రహణం మొర్రి, గుండెలో రంధ్రం, కాళ్లు, చేతులు వంకరగా ఉండటం, వెన్నుపూస వంటి అవయవాల్లో ఏవైనా లోపాలు ఉన్నా తెలుస్తాయి. కొన్ని సందర్భాల్లో పిల్లలు పుట్టగానే సర్జరీ చేయాల్సి ఉంటుంది. టిఫాలో దీన్ని ముందే గుర్తించగలిగితే ప్రసవ సమయంలో ప్రాణాలు రక్షించగలుగుతారు. 3డీ, 4డీ ఇమేజింగ్ స్కాన్‌లో ఇవన్నీ గుర్తించేందుకు వీలుంటుంది.
Comments
Please login to add a commentAdd a comment