సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే 100 శాతం ప్రసవాలు నిర్వహించాలని.. ఈ లక్ష్య సాధన కోసం పక్కా కార్యాచరణతో పనిచేయాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఆదేశించారు. అనవసర సిజేరియన్లను తగ్గించడంతోపాటు ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవాల శాతాన్ని మరింతగా పెంచే బాధ్యత వైద్యాధికారులదేనని స్పష్టం చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఓపీ విభాగం సమర్థంగా పనిచేయాలని సూచించారు.
శనివారం పీహెచ్‌సీ వైద్యులు, ఆశ వర్కర్లు, ఏఎన్‌ఎంలతో ఆయన రాష్ట్రస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆస్పత్రులవారీగా పురోగతిని సమీక్షించారు. పీహెచ్‌సీల పరిధిలో గర్భిణుల ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలని స్పష్టం చేశారు. ప్రతి గర్భిణికి తొలి మూడు నెలల్లోనే నాలుగుసార్లు తప్పకుండా ఏఎన్‌సీ (యాంటె నేటల్ కేర్) పరీక్షలు నిర్వహించి ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేయాలని హరీశ్‌రావు ఆదేశించారు. రక్తహీనతతో బాధపడే గర్భిణుల పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలన్నారు.
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వాస్పత్రుల్లో సాధారణ ప్రసవాలను మరింతగా ప్రోత్సహించేందుకు నర్సు నుంచి డాక్టర్ వరకు ప్రోత్సాహకాలను అందిస్తున్నామన్నారు. గర్భిణులను ఆసుపత్రికి తీసుకొచ్చే ఆశ వర్కర్, ఏఎన్‌ఎంల కోసం సీహెచ్‌సీ, ఏరియా, జిల్లా, మెడికల్ కాలేజీ ఆస్పత్రుల్లో ప్రత్యేక వసతులు ఏర్పాటు చేసినట్లు హరీశ్‌రావు చెప్పారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు నాటికి 33 శాతం ప్రసవాలు మాత్రమే ప్రభుత్వాస్పత్రుల్లో జరిగేవని, ఇప్పుడు అవి 66 శాతానికి పెరిగాయన్నారు.
రూ. 67 కోట్లతో కొత్త భవనాలు..
రాష్ట్రవ్యాప్తంగా 43 పీహెచ్‌సీలకు కొత్త భవనాలను మంజూరు చేశామని, రూ.67 కోట్లతో నిర్మా ణ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. 372 పీహెచ్‌సీల మరమ్మతులను రూ.43.18కోట్లు చేస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 4,745 సబ్ సెంటర్లు ఉండగా, 1,239 సబ్ సెంటర్లకు కొత్త భవనాలు మంజూరు చేశామని, ఒక్కో దానికి రూ.20 లక్షలు ఇచ్చామన్నారు. మొత్తంగా రూ.247.80 కోట్లు ఖర్చు చేశామన్నారు.
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు 720 పీహెచ్‌సీల్లో ఇంటర్నెట్ సదుపాయంతోపాటు సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి చెప్పారు. ఇంటిగ్రేటెడ్ హెల్త్ ఇన్ఫర్మేషన్ ప్లాట్‌ఫాంలో ఎప్పటికప్పుడు వివరాలను నమోదు చేయాలని, ఈ ప్రక్రియ పూర్తి చేయడంలో తీవ్ర నిర్లక్ష్యం కనిపిస్తోందని హరీశ్‌రావు మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment