gynecologists
-
నెలసరి సమయంలో విపరీతమైన కడుపునొప్పి.. సిస్ట్స్ ఉంటే?
నాకు 45 ఏళ్లు. నెలసరి రెగ్యులర్‌గానే వస్తోంది. రొటీన్ స్కాన్‌లో కుడివైపు ఓవరీలో 4 సెం.మీ సిస్ట్ ఉందని తేలింది. ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి? – సీహెచ్. కాత్యాయిని, విజయవాడ ఒవేరియన్ సిస్ట్లు అనేవి ప్రీమెనోపాజ్ ఏజ్‌లో సర్వసాధారణం. రక్తపు అవశేషాలు లేకుండా ఫ్లూయిడ్‌తో నిండి ఉన్న సింపుల్ సిస్ట్స్ ఉంటాయి. వీటితో ఎలాంటి ప్రమాదమూ ఉండదు. వీటికి ఎలాంటి చికిత్సా అవసరం ఉందు. అండాశయంలో సాధారణంగా అండాలు రెండు నుంచి మూడు సెం.మీ. ఉంటాయి. సిస్ట్ అంటే 3 సెం.మీ. కన్నా ఎక్కువ సైజులో ఉండడం. కాంప్లెక్స్ సిస్ట్ అంటే బ్లడ్, సాలిడ్ కూడా ఉంటాయి. వీటిని ఎండోమెట్రియోమా, డెర్మోయిడ్ సిస్ట్ అంటారు. నెలసరి క్రమం తప్పడం.. పీరియడ్స్ టైమ్‌లో విపరీతమైన కడుపు నొప్పి, యూరిన్లోనూ నొప్పి ఉంటాయి. ఇలాంటి సిస్ట్స్కి చికిత్స అవసరం. అందుకే మీరు ఒకసారి డీటెయిల్డ్ హై రిజల్యుషన్ అల్ట్రాసౌండ్ లేదా సీటీ పెల్విక్ స్కాన్ చేయించండి. సిస్ట్ నేచర్‌ను బట్టి తర్వాత చికిత్స ఉంటుంది. సింపుల్ సిస్ట్స్కి అయితే ఆరునెలలకు ఒకసారి ఫాలో అప్ స్కాన్స్ చేస్తాం. -డా. భావన కాసు గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్ హైదరాబాద్ -
టిఫా స్కాన్ల నుంచి తప్పించండి
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వాసుపత్రుల్లో ఇటీవల ఏర్పాటు చేసిన టిఫా (టార్గెటెడ్ ఇమేజింగ్ ఫర్ ఫీటల్ అనామలీస్) స్కాన్లను తాము చేయలేమని గైనకాలజిస్టులు చేతులెత్తేస్తున్నారు. ఈ మిషన్లు సమకూర్చిన చోట వెంటనే రేడియాలజిస్టులను నియమించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఒక్కో ఆసుపత్రికి ఇద్దరు రేడియాలజిస్టులను, వారికి సహకరించే సిబ్బందిని నియమించాలని విన్నవిస్తున్నారు. రోగుల రద్దీతో ఇప్పటికే తమకు పని భారం పెరిగిందని, ఈ పరిస్థితుల్లో టిఫా స్కాన్లు అదనపు ఒత్తిడికి దారితీస్తున్నాయని సోమవారం పలువురు గైనకాలజిస్టులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొచ్చారు. గర్భస్త శిశువు ఎదుగుదలలో లోపాలను గుర్తించేందుకు అందుబాటులోకి తెచ్చిన టిఫా స్కానింగ్ గర్భిణులకు ఎంతో మేలు చేస్తుంది. ఇటీవల 44 ప్రభుత్వ ఆసుపత్రుల్లో 56 టిఫా స్కానింగ్ మిషన్లను ప్రభుత్వం సమకూర్చింది. కానీ రేడియాలజిస్టులను మాత్రం నియమించలేదు. మరోవైపు ప్రస్తుతం ప్రభుత్వాసుపత్రులలో పనిచేసే గైనకాలజిస్టులంతా సీనియ ర్లు కావడంతో కొత్త టెక్నాలజీపై వారికి పెద్దగా అవగాహన లేదని అంటున్నారు. దీంతో చాలామంది డాక్టర్లు టిఫా చేసేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ కారణంగానే రేడియాలజిస్టులను నియమించాలని కోరుతున్నారు. ఇప్పటికే నిమిషం తీరిక లేకుండా..!: రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వాసుపత్రుల్లో గైనకాలజిస్టుల సంఖ్య ప్రస్తుతం తక్కువగా ఉంది. ఒక్కో గైనకాలజిస్టు ప్రతిరోజు సరాసరి వంద మందిని పరీక్షిస్తున్నారు. దీంతో గర్భిణుల వైద్య సేవల్లో జాప్యం జరుగుతోంది. మరోవైపు గతంతో పోల్చితే ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే గర్భిణుల సంఖ్య విపరీతంగా పెరిగింది. ఓపీతో పాటు జనరల్, ఏఎన్సీ చెకప్‌లు, సాధారణ స్కానింగ్‌చికిత్సలన్నీ గైనకాలజిస్టు లే చూడాల్సి వస్తోంది. ఇలా నిమిషం ఖాళీ లేని పరిస్థితుల్లో తాము ఉంటున్నామని గైనకాలజిస్టులు వాపోతున్నారు. తాజా టిఫా బాధ్యతలు కూడా అప్పగించడంతో సమర్థవంతంగా వైద్య సేవలు అందించలేక పోతున్నామని చెబుతున్నారు. ఒక్కో స్కాన్‌కు 40 నిమిషాలు: ఒక్కో గర్భినికి టిఫా స్కానింగ్ చేయాలంటే సుమారు 40 నిమిషాలు పడుతుంది. టిఫా స్కా న్ ద్వారా శిశువు గర్భంలో ఏ విధంగా ఉంది? ఉమ్మనీరు స్థితి ఎలా ఉంది? రక్త ప్రసరణ, మెదడు, గుండె నిర్మాణం వంటివి సరిగ్గానే ఉన్నాయా? అనేది సులువుగా కనిపెట్టవచ్చు. మేనరిక వివాహాలు, జన్యు సంబంధలో పాలు, ఆలస్యంగా గర్భం దాల్చడం, కొందరికి గర్భం దాల్చిన ప్పటి నుంచే శారీరక, మానసిక సమస్యలు ఉత్పన్నం కావడం, పోషకాహార లోపం.. ఇలాంటివి శిశువులపై చూపించే ప్రభావాన్ని కూడా గుర్తించవచ్చు. గ్రహణం మొర్రి, గుండెలో రంధ్రం, కాళ్లు, చేతులు వంకరగా ఉండటం, వెన్నుపూస వంటి అవయవాల్లో ఏవైనా లోపాలు ఉన్నా తెలుస్తాయి. కొన్ని సందర్భాల్లో పిల్లలు పుట్టగానే సర్జరీ చేయాల్సి ఉంటుంది. టిఫాలో దీన్ని ముందే గుర్తించగలిగితే ప్రసవ సమయంలో ప్రాణాలు రక్షించగలుగుతారు. 3డీ, 4డీ ఇమేజింగ్ స్కాన్‌లో ఇవన్నీ గుర్తించేందుకు వీలుంటుంది. -
కలవరపెడుతున్న కడుపు ‘కోత’లు
నగరంలో కడుపు‘కోత’లు కలవరపెడుతున్నాయి. సహజ ప్రసవానికి అవకాశం ఉన్నా.. ధన సంపాదనే లక్ష్యంగా పలు ప్రైవేటు గైనకాలజిస్టులు అడ్డగోలుగా సిజేరియన్లు చేస్తున్నారు. మహిళల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. కేవలం ప్రైవేటు ఆస్పత్రుల్లోనే ఎక్కువ శాతం సిజేరియన్లు జరుగుతుండటంపై జాతీయ కుటుంబ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. గర్భం దాల్చిన తర్వాత చెకప్‌లకు వస్తున్న వారి శాతం తొలుత ఆశించిన స్థాయిలోనే ఉన్నప్పటికీ.. ఆ తర్వాత క్రమంగా తగ్గుముఖం పడుతున్నట్లు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో వెల్లడయ్యింది. సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని పలు కార్పొరేట్, ప్రవేటు నర్సింగ్ హోంలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. సంపాదనే లక్ష్యంగా తల్లుల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. సహజ ప్రసవానికి అవకాశం ఉన్నప్పటికీ.. ఉమ్మనీరు తక్కువగా ఉందని, బిడ్డ అడ్డం తిరిగిందని, గుండె వేగంగా కొట్టుకుంటోందని, పురిటి నొప్పుల బాధ భరించలేరని పేర్కొంటూ బాధిత బంధువులను భయపెట్టి అవసరం లేకపోయినా సిజేరియన్లు చేస్తున్నారు. సాధారణ ప్రసవంతో పోలిస్తే.. సిజేరియన్ ప్రసవాలకు పట్టే సమయం కూడా చాలా తక్కువ. సర్జరీ చేయడం వల్ల ఆస్పత్రికి ఆదాయం సమకూరుతుంది. ఈ రెండు అంశాలు గైనకాలజిస్టులకు కలిసి వచ్చే అంశాలు. సిజేరియన్ ప్రసవాలు ఆ తర్వాత తరచూ కడుపు నొప్పి, ఇన్ఫెక్షన్, అధిక బరువు, నెలసరి వంటి సమస్యలకు కారణమవుతున్నట్లు వైద్యులు అభిప్రాయపడుతున్నారు. గ్రేటర్లో 98.3 శాతం ప్రసవాలు ప్రభుత్వ, ప్రవేటు ఆస్పత్రుల్లోనే జరుగుతున్నప్పటికీ మొత్తం ప్రసవాల్లో 59.7 శాతం సిజేరియన్లు ఉండగా.. వీటిలో ఎక్కువ శాతం సిజేరియన్ డెలివరీలు ప్రైవేటులోనే జరుగుతున్నట్లు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో వెల్లడైంది. గర్భం దాల్చిన తర్వాత చెకప్‌లకు వస్తున్న వారి శాతం తొలుత ఆశించిన స్థాయిలోనే ఉన్నప్పటికీ.. ఆ తర్వాత క్రమంగా తగ్గుముఖం పడుతుండటంపై ఆందోళన వ్యక్తం చేసింది. చదవండి: 8,289 ఎకరాలు.. 789 కేసులు సోమ, శుక్రవారాల్లోనే అధికం.. కాన్పు కోతలు ప్రైవేటు ఆసుపత్రుల్లోనే అత్యధికంగా జరుగుతున్నాయి. ఆదాయం పెంచుకోవడానికి ప్రైవేటు ఆస్పత్రులు వీటికే ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఆరోగ్యబీమా ఉన్న వారు ఎక్కువగా ఈ ఆపరేషన్లకే మొగ్గుచూపుతున్నారు. కాన్పుకోతలు సోమ, శుక్రవారాల్లోనే అత్యధికంగా జరుగుతుండటం విశేషం. చాలా మంది ఈ రెండు రోజులను శుభసూచకంగా భావిస్తుంటారు. అంతేకాదు ప్రసవానికి ముందే వార, తిథి, నక్షత్ర బలాలను బట్టి ముహూర్తాలు ఖరారు చేస్తుండటం కూడా ఇందుకు కారణం. ఆదివారం ప్రసవాల సంఖ్య మాత్రమే కాదు సిజేరియన్ల సంఖ్య కూడా చాలా తక్కువగా ఉంటుంది. వైద్యులకు ఆ రోజు సెలవు కావడమే. కారణాలనేకం.. ♦ ప్రసవ సమయం దగ్గర పడే కొద్దీ గర్భిణుల్లో ఆందోళన మొదలవుతుంది. అధిక రక్తపోటు, మధుమేహం వంటి సమస్యలు వెలుగు చూస్తున్నాయి. తొలి ప్రసవం సిజేరియన్ అయితే ఆ తర్వాతి ప్రసవానికీ సర్జరీకే ప్రాధాన్యమిస్తున్నారు. ♦ సంతాన సాఫల్య శాతం తగ్గిపోవడం కూడా మరో కారణంగా కనిపిస్తోంది. మరికొన్ని కేసుల్లో మహిళలు ఆలస్యంగా పెళ్లి చేసుకొని 35 ఏళ్ల వయసులో తొలి సంతానానికి జన్మనిస్తున్నారు. ఇలాంటి కేసులను అరుదుగా పరిగణిస్తున్న వైద్యులు తప్పనిసరిగా చికిత్సలకు వెళుతున్నారు. ♦ కొందరు మహిళలు తొలి కాన్పు సమయంలో ఎదురైన నొప్పులు, ఇతర అనుభవాలకు భయపడి రెండో కాన్పు సిజేరియన్‌కు వెళుతున్నారు. చాలా మంది మహిళలు ఆ నిర్ణయాన్ని వైద్యులకే వదిలేస్తున్నారు. సహజ కాన్పుల సమయంలో పారామెడికల్ సిబ్బంది చేసే వెకిలి వ్యాఖ్యలు, ఇతరత్రా భావోద్వేగ పరిస్థితులను ఎదుర్కొన్న మహిళలు.. సిజేరియన్‌కే వెళ్లడం మంచిదని తోటి మహిళలకు చెబుతుండటం కూడా సిజేరియన్లు పెరగడానికి కారణమవుతోంది. గర్భం దాల్చిన తర్వాత పరీక్షలకు వస్తున్న వారు ఇలా.. శాతాల్లో తొలి యాంటినెంటల్ చెకప్‌కు హాజరువుతున్న వారు 87.9 కనీసం నాలుగు వారాల పాటు చెకప్‌కు వస్తున్నవారు 69.9 మొదటి, రెండో కాన్పుకు మధ్య కనీస వ్యతాసం పాటిస్తున్న వారు 89.6 వంద రోజుల పాటు ఐరెన్ ఫోలిక్ యాసిడ్ మాత్రలు వాడుతున్నవారు 72.2 180 రోజుల పాటు వాడుతున్నవారు 38.4 ఎంసీపీ కార్డు పొందుతున్న వారు 94.4 సిజేరియన్లతో ఆరోగ్య సమస్యలు సిజేరియన్తో పురిటినొప్పుల బాధ నుంచి తాత్కాలికంగా ఉపశమనం పొందినప్పటికీ.. దీర్ఘకాలంలో అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. సిజేరియన్తో అధిక రక్తస్రావంతో పాటు నొప్పి ఎక్కువగా ఉంటుంది. కత్తిగాటు గాయం మానడానికి కనీసం నెల రోజులు పడుతుంది. ఆ తర్వాత నెలసరి సమస్యలు తలెత్తి అధిక బరువు సమస్య ఉత్పన్నమవుతుంది. కోత, కుట్ల వద్ద ఇన్ఫెక్షన్ సమస్య తలెత్తుతుంది. సాధ్యమైనంత వరకు సహజ ప్రసవానికే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం ఉత్తమం. – డాక్టర్ సంగీత, గైనకాలజిస్ట్ -
లక్ష్యం చేరని సురక్ష
- సక్రమంగా అమలు కాని జేఎస్ఎస్కే, జేఎస్వై - జిల్లాలో మిగిలిపోతున్న రెండు పథకాల నిధులు - పేద గర్భిణులకు అవగాహన కల్పించని అధికారులు - ప్రభుత్వాస్పత్రుల్లో అరకొరగా గైనకాలజిస్టులు రామచంద్రపురం : జాతీయ ఆరోగ్య మిషన్‌లో భాగంగా నిరుపేదలైన తల్లీబిడ్డల సంక్షేమం కోసం కేంద్రం ప్రవేశపెట్టిన జననీ శిశు సురక్ష కార్యక్రమాన్ని (జేఎస్ఎస్కే) జిల్లాలో అమలు చేయటంలో అధికారులు విఫలమవుతున్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో సురక్షిత ప్రసవానికి అయ్యే మొత్తం ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందన్న అవగాహనను పేదగర్భిణులకు కల్పించలేకపోవడంతో వారు ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయించి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. పేద మహిళలకు ప్రభుత్వాస్పత్రుల్లో మెరుగైన వైద్యసేవలందించి తల్లీబిడ్డలకు మంచి ఆరోగ్యం ఇవ్వాలనేది జేఎస్ఎస్కే లక్ష్యం. ఈ పథకం కింద గర్భిణులు ఆస్పత్రుల్లో చేరేందుకు అంబులెన్స్ సౌకర్యం కల్పిస్తారు. శస్త్రచికిత్స, రక్త పరీక్షలు, రక్తం ఎక్కించాల్సి వస్తే ఆ ఖర్చును కూడా ప్రభుత్వమే భరిస్తుంది. శిశువుకు అవసరమైన మందులన్నింటినీ ఉచితంగానే ఇచ్చి, బాలింతను ఆస్పత్రి నుంచి ఇంటికి సురక్షితంగా పంపిస్తారు. ఈ పథకానికి నిధులను ప్రభుత్వం సకాలంలో విడుదల చేస్తోంది. జిల్లాలో 11 ప్రభుత్వాస్పత్రులతో పాటు 24 గంటలూ పనిచేసే 33 పీహెచ్సీలలో ఈ పథకం అమలులో ఉంది. రాజమండ్రి జిల్లా ఆస్పత్రి, అమలాపురం, రామచంద్రపురం, తుని, రాజోలు, కొత్తపేట, రంపచోడవరం, పెద్దాపురం, ప్రత్తిపాడు, వై.రామవరం, అనపర్తి ఏరియా ఆస్పత్రులకు గత ఏడాది ఈ పథకం కింద రూ.6.76 కోట్లు విడుదల చేయగా రూ.4.30 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. డబ్బులు గుంజుతున్న సిబ్బంది జేఎస్ఎస్కే సక్రమంగా అమలు జరగాలంటే ప్రభుత్వాస్పత్రుల్లో గైనకాలజిస్టులు ఉండి తీరాలి. కాకినాడ జీజీహెచ్ మినహా 250 పడకలున్న రాజమండ్రి ప్రభుత్వాస్పత్రిలో ఆరుగురు గైనకాలజిస్టులుండాలి. కానీ ప్రస్తుతం ఇద్దరే ఉన్నారు. 100 పడకల రామచంద్రపురం, అమలాపురం, తుని ఏరియా ఆసుపత్రుల్లో నలుగురు చొప్పున ఉండాల్సి ఉండగా ఇద్దరు లేక ఒక్కొక్కరు మాత్రమే ఉన్నారు. పెద్దాపురం, కొత్తపేట ఏరియా ఆస్పత్రుల్లో ఒక్కొక్కరే ఉండగా ప్రత్తిపాడు, వై.రామవరం, రంపచోడవరం, అనపర్తి ఏరియా ఆస్పత్రుల్లో అసలు గైనకాలజిస్టులే లేరు. జేఎస్ఎస్కే ద్వారా ప్రభుత్వాస్పత్రికి ప్రైవేటు డాక్టర ్లను తీసుకువచ్చి సిజేరియన్ చేయించే అవకాశముంది. శస్త్రచికిత్స చేసిన వైద్యునికి రూ.1200 నుంచి రూ.1700, మత్తు వైద్యునికి రూ.1000 నుంచి రూ.1500 వరకు ప్రభుత్వం చెల్లిస్తుంది. అయితే దీన్ని అవకాశంగా మలచుకుని ప్రభుత్వాస్పత్రిలో సిజేరియన్ చేయించుకున్న పేద గర్భిణుల నుంచి సిబ్బంది రూ.2500 నుంచి రూ.3 వేల వరకు గుంజుతున్నారనే ఆరోపణలున్నాయి. నిబంధనలే ప్రతిబంధకం.. పేద మహిళల కోసం కేంద్రమే అమలు చేస్తున్న జననీ సురక్ష యోజన (జేఎస్వై) కూడా ఆశించిన ప్రయోజానానికి ఎడంగానే ఉంది. ఈ పథకం కింద ప్రభుత్వాస్పత్రుల్లో పురుడు పోసుకున్న పేద మహిళలకు ఖర్చులుగా గ్రామీణులకు రూ.800, పట్టణవాసులకు రూ.600 చెల్లిస్తారు. 2013 ఏప్రిల్ నుంచి 2014 మార్చి వరకు ఈ పథకం కింద రూ.కోటీ 53 లక్షలు విడుదల కాగా కేవలం రూ.44 లక్షలు మాత్రమే ఖర్చు చేసినట్టు తెలుస్తోంది. పేదమహిళలకు అవగాహన లేకపోవటం, అర్థం లేని నిబంధనలు, సిబ్బంది నిర్లక్ష్యం వల్ల కూడా పేదమహిళలకు దక్కాల్సిన సాయం దూరమవుతోంది. గర్భిణుల్లో పేదలకు సురక్షితమైన వైద్యంతో పాటు ఒకింత ఆర్థిక ఊతం కూడా అందించే ఈ పథకాల గురించి విస్తృతంగా ప్రచారం చేయాలి.