రేపటి నుంచి రేడియాలజిస్టుల సమ్మె
రేపటి నుంచి రేడియాలజిస్టుల సమ్మె
Published Tue, Aug 30 2016 11:26 PM | Last Updated on Mon, Sep 4 2017 11:35 AM
కర్నూలు(హాస్పిటల్): పీసీ పీఎన్‌డీటీ యాక్ట్‌లో కొన్ని మార్పులు చేయాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ ఒకటి నుంచి రేడియాలజిస్టులు సమ్మె చేస్తున్నట్లు కర్నూలు రేడియాలజి అసోసియేషన్ కార్యదర్శి డాక్టర్ బీఎస్‌ఎన్ ప్రసాద్ చెప్పారు. మంగళవారం ఆసుపత్రిలోని రేడియాలజి విభాగంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చిన్న చిన్న కారణాలు చూపి స్కానింగ్ సెంటర్లను, రేడియో డయాగ్నోస్టిక్ సెంటర్లను ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు పీసీపీఎన్‌డీటీ యాక్ట్‌లో కొన్ని మార్పులు చేయాలని 8 నెలల క్రితం ప్రభుత్వాన్ని కోరినా ఫలితం లేకుండా పోయిందన్నారు. దీంతో దేశవ్యాప్తంగా సెప్టెంబర్ ఒకటి నుంచి ప్రభుత్వ, ప్రయివేట్, డయాగ్నోస్టిక్ సెంటర్ల రేడియాలజిస్టులు సమ్మెలోకి వెళ్తున్నారని తెలిపారు. 2వ తేదీ నుంచి వారం రోజుల పాటు గర్భిణిలకు స్కానింగ్ చేయడం బంద్ చేస్తామన్నారు. ఆసుపత్రుల్లో అత్యవసర కేసులను మాత్రం సమ్మె నుంచి మినహాయించినట్లు ఆయన పేర్కొన్నారు. సమావేశంలో అసోసియేషన్ ఉపాధ్యక్షుడు డాక్టర్ అన్వర్‌హుసేన్, సభ్యులు డాక్టర్ విజయకుమార్, డాక్టర్ సురేష్, డాక్టర్ రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.
Advertisement