- ఇళ్లకు వెళ్లిపోతున్న జేఎన్‌టీయూ విద్యార్థినులు
జేఎన్‌టీయూ : జేఎన్‌టీయూ అనంతపురం ఇంజినీరింగ్ కళాశాలలో ర్యాగింగ్ దుమారం రేపుతోంది. మూడు రోజుల నుంచి నిత్యం హాస్టళ్లలో ఉన్నతాధికారులు పర్యవేక్షణ చేస్తుండటంతో విసిగిపోతున్న విద్యార్థినులు ఇళ్లకు వెళ్లిపోతున్నారు. బీటెక్ కంప్యూటర్ సైన్సెస్ విభాగంలోని సీనియర్ విద్యార్థిని.. జూనియర్ విద్యార్థినికి అసైన్‌మెంట్‌లు రాసివ్వమని కోరింది. దీంతో తనను ఎప్పుడూ పనులు చేయాలని పురమాయిస్తున్నారంటూ సదరు విద్యార్థిని తన తండ్రికి తెలిపింది. దీంతో ఆయన నేరుగా జేఎన్‌టీయూ వీసీ , రిజిస్ట్రార్, ఉన్నత విద్యామండలి చైర్మన్, ప్రిన్సిపల్ సెక్రటరీలకు మెయిల్ ద్వారా లేఖలు పంపారు. ఫలానా అడ్రెస్ నుంచి రాసినట్లు పేర్కొనకుండా.. అనధికార మెయిల్ నుంచి పంపించారు.
ర్యాగింగ్ జరుగుతోందని, చర్యలు తీసుకోవాలని అందులో కోరారు. దీంతో అప్రమత్తమైన జేఎన్‌టీయూ ఉన్నతాధికారులు ర్యాగింగ్ ఘటనపై ఆరా తీశారు. అదే రోజు అప్రమత్తమయ్యారు. కానీ అదే రకమైన పనులకు పురమాయిస్తున్నారంటూ తిరిగి రెండు రోజులకు మళ్లీ మెయిల్ పంపించారు. దీంతో జేఎన్‌టీయూ ఇన్‌చార్జ్ వీసీ ఆచార్య కె.రాజగోపాల్, రిజిస్ట్రార్ ఆచార్య ఎస్ కృష్ణయ్య హాస్టళ్లకు వెళ్లి విద్యార్థులతో నేరుగా ఆరా తీశారు. తమతో చెప్పడానికి ఏమైనా ఇబ్బందులుంటే.. ఫిర్యాదు పెట్టెలో ఏ అడ్రెస్ లేకుండా, ర్యాగింగ్ అంశాలను మాత్రమే రాసి వేయాలని సూచించారు. అయినా ఎవరూ స్పందించలేదు. మరోవైపు ఉన్నత విద్యామండలి ఈ అంశంపై వివరణ కోరింది. మూడు రోజుల నుంచి విద్యార్థులతో ఆరా తీసిన అంశాలు, అందుకు సంబంధించిన ఫొటోలు, విచారణ నివేదికను వర్సిటీ అధికారులు ఉన్నత విద్యాశాఖకు పంపారు. జేఎన్‌టీయూలో ఎలాంటి ర్యాగింగ్ జరగలేదని, మెయిల్ ద్వారా తప్పుడు సమాచారం పంపారని అందులో పేర్కొన్నారు. అలాగే ఉన్నతాధికారులు నిత్యం తనిఖీలు చేస్తుండటంతో విద్యార్థినులు ఆందోళనకు గురై ఇంటిబాట పడుతున్నారు.
ర్యాగింగ్ దుమారం
Published Thu, Mar 23 2017 11:52 PM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM
Advertisement
Advertisement