రైల్వే జీఎం ‘రాచరిక’ పర్యటన
రైల్వే జీఎం ‘రాచరిక’ పర్యటన
Published Fri, Mar 3 2017 11:40 PM | Last Updated on Tue, Sep 5 2017 5:06 AM
– కర్నూలు సిటీ స్టేషన్‌ను తనిఖీ చేసిన వినోద్ కుమార్ యాదవ్
– రాచరిక పాలన తరహాలో గొడుగులు పట్టిన అధికారులు
– పోలీసుల అత్యుత్సాం.. ఫొటోగ్రాఫర్ల తోసివేత
కర్నూలు (రాజ్‌విహార్): దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజరు వినోద్ కుమార్ యాదవ్ కర్నూలు పర్యటన రాచరిక పాలనను తలపించింది. అధికారులు, పోలీసులు ఆయనకు దాసోహమై తమ భక్తిని చాటుకున్నారు. శుక్రవారం కర్నూలు సిటీ రైల్వే స్టేషన్‌ను తనిఖీ చేసేందుకు ఉదయం ఉదయం 10:05 గంటలకు ప్రత్యేక రైలులో ఇక్కడికి చేరుకున్నారు. వచ్చినప్పటి నుంచి తిరిగి ఆయన వెళ్లే వరకు స్థానిక అధికారులు, ఆర్‌పీఎఫ్ పోలీసులు ఆద్యంతం హడావిడి చేశారు.
ఆయన రైలు దిగిన వెంటనే రోప్ పార్టీ పోలీసులు తాడుతో చుట్టూ వలయం వేశారు. అక్కడి నుంచి ఇంజినీరింగ్ విభాగ ఎగ్జిబిషన్‌ను తిలకించి ఉద్యోగుల కోసం కొత్తగా రూ.15లక్షలతో నిర్మించిన ఆర్‌ఓ వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించేందుకు వెళ్తున్న ఆయనకు పెద్ద పెద్ద గొడుగులు పట్టారు. దేశ ప్రధానమంత్రే ఎండలకు రోడ్లపై తిరుగుతుంటే జీఎంకు యువరాజులాగా గొడుగులు పట్టడం పట్ల ప్రయాణికులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. జిల్లాలో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. దీని ప్రకారం ఎలాంటి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయకూడదు. అయినప్పటికీ ఆర్‌ఓ వాటర్ ప్లాంట్‌తోపాటు పవర్ జనరేటర్, సీనియన్ సెక్షన్ ఇంజనీర్ (సిగ్నల్) కార్యాలయాన్ని, టైప్–4 స్టాఫ్ క్వార్టర్స్‌ను, పార్క్‌ను ప్రారంభించారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందికి వస్తుందని మేధావులు, ప్రభుత్వ అధికారులు అంటున్నారు.
మీడియాకు అవమానం
కర్నూలు రైల్వే జీఎం వినోద్ కుమార్ యాదవ్ పర్యటనలో మీడియాకు అవమానం జరిగింది. స్థానిక రైల్వే, జిల్లా సమాచార శాఖ అధికారులు ఆహ్వానం మేరకు ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా ప్రతినిధులు, కెమెరామెన్లు, ఫోటో గ్రాఫర్లు జీఎం పర్యటన కార్యక్రమాలను కవరేజీ చేసేందుకు అక్కడికి వెళ్లారు. అయితే ఆర్‌పీఎఫ్ పోలీసులు, రోప్ పార్టీ అడుగడుగునా అడ్డుకున్నారు. ఫోటోలు, విజువల్స్ తీసుకునేందుకు యత్నించే ప్రతినిధులు పక్కకు జరుపుకుంటూ వెళ్లారు.
చివరకు కార్యక్రమం పూర్తయ్యాక మీడియాతో మాట్లాడుతానని జీఎం చెప్పడంతో స్టేషన్‌లోని వీఐపీ లాంజ్‌లో నిరీక్షించారు. అయితే ముందుగా అక్కడికి వచ్చిన అధికార పార్టీ ప్రజా ప్రతినిధులతో మాట్లాడాక మీడియాతో మాట్లాడుతానని జీఎం చెప్పడంతో వీఐపీ లాంజ్ నుంచి బయటకు పంపారు. అక్కడ జీఎంను కలిసిన ప్రజా ప్రతినిధుల ఫొటోలు తీసేందుకు యత్నించిన ఫోటో గ్రాఫర్లును ఆర్‌పీఎఫ్ పోలీసులు పక్కకు తోసేశారు. కిందపడబోయిన వారిని ఇతరులు పట్టుకున్నారు. దీంతో ఆగ్రహించిన పాత్రికేయులు తమను పిలిచి అవమానిస్తారా అంటూ నిలదీశారు. దీనిపై డీఆర్‌ఎం అరుణా సింగ్ సమాధానం ఇవ్వకపోవడంతో కార్యక్రమాన్ని బహిష్కరించి జీఎంతో మాట్లాడకుండానే వెనుదిరిగారు. ఇదిలా ఉండగా.. కర్నూలు రైల్వే స్టేషన్‌కు రూ.9వేలు, రైల్వే ఆస్పత్రికి రూ.5వేలు నగదు నజరానాను జీఎం ప్రకటించారు.
Advertisement
Advertisement