మళ్లీ దగా పడిన రైతన్న | Raitanna dishonesty fall again | Sakshi
Sakshi News home page

మళ్లీ దగా పడిన రైతన్న

Published Tue, Dec 27 2016 2:14 AM | Last Updated on Mon, Oct 1 2018 2:44 PM

మళ్లీ దగా పడిన రైతన్న - Sakshi

మళ్లీ దగా పడిన రైతన్న

పునరావృతమైన  నకిలీ మిర్చి విత్తనాల సమస్య
ఏపుగా పెరిగినా  కాయలు  రాలేదంటూ  చెన్నారావుపేట    రైతుల గగ్గోలు
గత సీజన్‌లో  నష్టపోయిన రైతులకు  ఇప్పటికీ  అందని పరిహారం


హన్మకొండ : రైతన్నలు దగా పడడం.. రైతులను దగాకు గురిచేసిన వారు తప్పించుకోవడం ఏటేటా పునరావృతమవుతోంది. నకిలీ విత్తనాల బారిన పడి నష్టపోయిన రైతులను ఆదుకునే విషయంలో ప్రభుత్వం ఏ మాత్రం పట్టనట్లు వ్యవహరిస్తుండడంతో ఈ పరిస్థితి ఎదురవుతోంది. బాధ్యులపై పీడీ యాక్ట్‌ నమోదు చేస్తామని, నకిలీ విత్తనాల సమస్య రాకుండా ప్రత్యేక చట్టం  రూపొందిస్తామంటూ చెబుతున్న పాలకులు అమలులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడం.. మోసం చేయాలనుకునే వారికి అంది వచ్చిన అవకాశంగా మారుతోంది.

నాలుగు నెలల క్రితమే..
గత నాలుగు నెలల కిందట జిల్లాలోని పరకాల, ఆత్మకూరు, నర్సంపేట, నల్లబెల్లి, నెక్కొండ, దుగ్గొండి మండలాలకు చెందిన సుమారు 900మంది రైతులు నకిలీ మిర్చి విత్తనాలు కొనుగోలు చేసి లక్షలాది రూపాయలు పెట్టుబడితో సాగు చేశారు. అయితే, మొక్కలు ఏపుగా పెరిగినా పూత, కాత లేకపోవడంతో వారు ఆందోళన చెందారు. అప్పటి నుంచి ఇప్పటివరకు రైతన్నలు అనేక ఆందోళనలు చేసినప్పటికీ, రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం కన్నెత్తి చూడలేదు. పరిహారం మాట పక్కన పెడితే అధికార పార్టీ నుంచి పరామర్శించే వారు లేకపోవడంతో రైతులు ఏం చేయాలో తోచక ఊరుకుండిపోయారు. అదే సమయంలో నకిలీ విత్తనాల బాధ్యులపై పీడీ చట్టం కింద కేసులు నమోదు చేస్తామని.. నకిలీ విత్తనాల నియంత్రణ చట్టం రూపొందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో ఏది కూడా అమలుకు నోచుకోలేదు.

ప్రభుత్వ అలసత్వం..
గత సీజన్‌లో నకిలీ మిర్చి విత్తనాల కారణంగా నష్టపోయిన రైతులు పరిహారం అందించకపోగా.. బాధ్యులైన కంపెనీలు, వ్యాపారులపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీనిని అవకాశంగా తీసుకున్న వ్యాపారులు మళ్లీ విజృంభించారు. తాజాగా జిల్లాలోని చెన్నారావుపేట మండలంలోని కోనాపురం, జల్లి, ఎల్లాయగూడెం గ్రామానికి చెందిన జీవా మిర్చి విత్తనాలు సాగుచేయగా అవి ఏపుగా పెరిగినప్పటికీ కాయలు కాయకపోవడంతో గగ్గోలు పెడుతున్నారు. చివరకు తాము మోసపోయామని గ్రహించి నర్సంపేటలోని షాపు ఎదుట సుమారు 300మంది రైతులు శనివారం ఆందోళన నిర్వహించారు. అయినా ప్రభుత్వంలో ఏమాత్రం చలనం లేకపోవడం గమనార్హం.

అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్‌
వరంగల్‌ రూరల్‌ జిల్లాలో పండించే మిర్చి పంటకు ఇప్పటివరకు అంతర్జాతీయంగా మంచి డిమాండ్‌ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఖానాపురం మండలంలోని అశోక్‌నగర్‌ వద్ద మిర్చి పరిశోధన కేంద్ర కోసం 90ఎకరాలు సేకరించారు. ఇందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి ఇంత ప్రాచుర్యం తీసుకొచ్చిన మిర్చి రైతుల విషయంలో ప్రభుత్వం ఎందుకు పట్టనట్లు వ్యవహరిస్తోందో అంతుబట్టడం లేదు. రైతులు ఒకవైపు ప్రకృతి ప్రకోపానికి దెబ్బ తింటుండగా, మరోవైపు ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు తగిన గిట్టుబాటు ధర లభించక అవస్థలు పడుతున్నారు. దీనికి తోడు నకిలీల దెబ్బకు వారు కోలుకోలేని స్థితిలోకి నెట్టబడుతున్నారు. రైతుల సంక్షేమంపై కోటలు దాటేలా మాటలు చెప్పే ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు వారిని ఆదుకునే విషయంలో ఎందుకు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారో అర్థం కాకుండా ఉంది. ఇలా ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా రైతులు మళ్లీ మళ్లీ దగా పడుతూనే ఉన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement