కాంగ్రెస్‌ రైతు గర్జన ఎవరికోసం? | raithu garjana | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ రైతు గర్జన ఎవరికోసం?

Published Tue, Aug 16 2016 11:07 PM | Last Updated on Tue, Oct 30 2018 7:50 PM

కాంగ్రెస్‌ రైతు గర్జన ఎవరికోసం? - Sakshi

కాంగ్రెస్‌ రైతు గర్జన ఎవరికోసం?

  • తెలంగాణ కోటి ఎకరాల మాగాణం సీఎం కేసీఆర్‌ కల
  • ఎవరెన్ని అడ్డంకులు కల్పించినా మల్లన్నసాగర్‌ కట్టి తీరుతాం
  • సింగూరు జలాలు నిజామాబాద్, మెదక్‌ జిల్లాలకే...
  • భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు
  • నిజామాబాద్‌ : కాంగ్రెస్‌ నేతలు అధికారంలో ఉన్నప్పుడు రైతుల గురించి పట్టించుకోకుండా ఇప్పుడు రైతు గర్జన పేరుతో హంగామా చేస్తున్నారని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్నప్పుడు దిగ్విజయ్‌సింగ్‌ తెలంగాణ జిల్లాల్లో తిరిగితే పరిస్థితి తెలిసేదన్నారు. అధికారంలో కుంభకర్ణుడిలా నిద్రపోయి ఇప్పుడు చేసే రైతుగర్జన ఎవరికోసమో అర్థం కావడం లేదన్నారు. మంగళవారం నిజామాబాద్‌ జిల్లా గుత్ప ఎత్తిపోతల పథకం నుంచి అదనంగా 2,642 ఎకరాలకు సాగునీరు అందించేందుకు రూ. 23.80 కోట్ల వ్యయంతో చేపట్టే పనులకు ఆయన మాక్లూర్‌ మండలంలోని గుత్ప, జక్రాన్‌పల్లి మండలంలోని మునిపల్లిల వద్ద శంకుస్థాపన చేశారు.
     
    ఈ సందర్భంగా మునిపల్లిలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. రైతుల కష్టాలు తెలిసిన ముఖ్యమంత్రిగా సీఎం కేసీఆర్‌ ప్రజలకు ఏమి చేస్తున్నారో రైతు గర్జనలో చెప్తారా? లేక మా వల్లే నీటితో కళకళలాడాల్సిన నిజాంసాగర్‌ ప్లేగ్రౌండ్‌లా మారిందని చెప్తారా? అని హరీశ్‌రావు కాంగ్రెస్‌ నేతలను నిలదీశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే కర్ణాటకలో అక్రమ ప్రాజెక్టుల నిర్మాణం జరిగిందన్నారు. ఇప్పుడు కర్ణాటక మునిగిపోయేంత వర్షాలు పడితే తప్ప నిజాంసాగర్‌లోకి నీరు వచ్చే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా మల్లన్నసాగర్‌ నుంచి నిజాంసాగర్‌ ప్రాజెక్టు నింపాలన్న ప్రయత్నాన్ని ఓ వైపు అడ్డుకుంటూ.. మరోవైపు రైతు గర్జన చేయడం ప్రజాద్రోహం అవుతుందని పేర్కొన్నారు. వారిని ప్రజలే తరిమికొడతారన్నారు.
     
    సింగూరు జలాలను గత పాలకులు హైదరాబాద్‌ నగరానికి తాగునీటికోసం తరలించడం వల్ల మెదక్, నిజామాబాద్‌ జిల్లాల రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. హైదరాబాద్‌కు గోదావరి, కృష్ణా జలాలను తరలిస్తున్నందున సింగూరు జలాలను ఈ రెండు జిల్లాల ఆయకట్టుకే కేటాయిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారన్నారు. నిజాంసాగర్‌ ప్రాజెక్టు ఆయకట్టుకు రెండు పంటలకు సరిపడా నీటిని సరఫరా చేసేందుకు గోదావరి జలాలతో నింపాల్సిన ఆవశ్యకత ఉన్నదని హరీశ్‌రావు పేర్కొన్నారు. రీ–ఇంజినీరింగ్‌తో తెలంగాణలోని కోటి ఎకరాల భూమిని సస్యశ్యామలం చేసేందుకు గోదావరి, కృష్ణా జలాలను మళ్లించే భారీ సాగునీటి పథకాలకు ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారన్నారు.
     
    ఇంద్రావతి, పెన్‌గంగ, ప్రాణహిత నదులు 360 రోజులు నిండుగా ప్రవహిస్తాయని, గోదావరిలో భాగంగా లక్షలాది క్యూసెక్కుల నీరు వృథాగా సముద్రంలో కలుస్తున్నాయని పేర్కొన్నారు. రాజకీయలకు అతీతంగా సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి సహకరించాలని ప్రతిపక్షాలను కోరారు. శాశ్వత కరువు నివారణకు చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులకోసం బడ్జెట్‌లో రూ. 25 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. గతానికంటే భిన్నంగా భూనిర్వాసితులకు రెండింతల పరిహారాన్ని అందిస్తున్నామని పేర్కొన్నారు.
     
    మల్లన్నసాగర్‌ను వ్యతిరేకించి నిజామాబాద్‌ జిల్లా రైతులకు ద్రోహం చేయరాదని మంత్రి హరీశ్‌రావు ప్రతిపక్షాలకు సూచించారు. మిషన్‌ కాకతీయ కింద వందలాది చెరువులను పునరుద్ధరించినప్పటికీ వర్షాలు లేనందున వాటిలోకి నీరు చేరలేదని పేర్కొన్నారు. హరితహారం అమలులో జిల్లాను ముందు నిలిపినందుకు జిల్లా కలెక్టర్‌ యోగితారాణాకు రాష్ట్ర స్థాయి ఉత్తమ కలెక్టర్‌ అవార్డు వచ్చిందన్నారు. జిల్లాలో నాటిన ప్రతి మొక్కను కాపాడాలని సూచించార. సమృద్ధిగా చెట్లు ఉన్నప్పుడే వర్షాలు పడి చెరువులు నిండుతాయని పేర్కొన్నారు.
     
    కేసీఆర్‌ నాయకత్వం అవసరం
    తెలంగాణ  రాష్ట్రం ఏర్పాటు ఎంతటి చారిత్రక అవసరంగా నిలిచిందో.. ఈ రాష్ట్రానికి సీఎం కేసీఆర్‌ నాయకత్వం అంతే అవసరం అని రాజ్యసభ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్‌ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు నాయకత్వాన్ని పటిష్ట పరచాలని పిలుపునిచ్చారు. మంజీర నదిపై పొరుగు రాష్ట్రాలలో ప్రాజెక్టులు కడుతున్నప్పటికీ గత పాలకులు పట్టించుకోలేదని నిజామాబాద్‌ ఎంపీ కవిత ఆరోపించారు.
     
    జిల్లా రైతాంగానికి లబ్ధి చేకూర్చే నిజాంసాగర్‌ ప్రాజెక్టును నింపేందుకోసం కాళేశ్వరం ఎత్తిపోతల పతకానికి మహారాష్ట్రతో మనప్రభుత్వం ఒప్పందం చేసుకుందన్నారు. ఒకటిన్నర సంవత్సరాలు సుదీర్ఘంగా అన్ని అంశాలను చర్చించిన తర్వాతే కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి ప్రభుత్వం తుదిరూపు ఇచ్చిందన్నారు. నిజాంసాగర్‌ ప్రాజెక్టుకు పునర్వైభవం తెచ్చేందుకు మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌ అవసరమన్నారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్‌ దఫేదారు రాజు, నిజామాబాద్‌ రూరల్, ఆర్మూర్‌ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, ఆశన్నగారి జీవన్‌రెడ్డి, ఎమ్మెల్సీలు ఆర్‌.భూపతిరెడ్డి, వీజీ గౌడ్, డీసీఎంఎస్‌ మాజీ చైర్మన్‌ మునిపల్లి సాయిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement