
రాజయ్య కుటుంబాన్ని ఉరి తీయాలి
సారిక తల్లి డిమాండ్.. కుమార్తె అస్తికల సేకరణ
పోచమ్మమైదాన్: మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య కోడలు సారిక, ముగ్గురు మనవళ్ల అస్తికలను సారిక కుటుంబసభ్యులు ఆదివారం తీసుకెళ్లారు. వాటిని బాసర వద్ద గోదావరి నదిలో నిమజ్జనం చేస్తామని సారిక తల్లి లలిత తెలిపారు. సారిక మృతి చెంది ఆదివారానికి ఐదురోజులు కావడంతో కర్మకాండలు చేశారు. అనంతరం అస్తికలను తీసుకెళ్లారు. ఆమె కుమారులు అభినవ్, శ్రీయోన్, అయోన్‌లను ఖననం చేసిన ప్రదేశంలోని మట్టిని సైతం తీసుకెళ్లారు. ఈ సందర్భంగా లలిత మాట్లాడుతూ.. తన కూతురు, మనువళ్లను రాజయ్య కుటుంబసభ్యులే హత్య చేశారని ఆరోపించారు. వారిని ఉరి తీయాలని కోరారు.
పోస్ట్‌మార్టం నివేదిక రాకముందే ఆత్మహత్య అని పోలీసులు ఎలా నిర్ధారిస్తారని ఆమె ప్రశ్నించారు. రాజకీయ ప్రోద్బలంతో కేసును నీరు గార్చే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఆమె వెంట సారిక సోదరి అర్చన, విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు సొల్లేటి క్రిష్ణమాచారి, గజ్జెల వీరన్న, మహిళా సంఘం నాయకురాలు ఇందిర, పద్మావతి ఉన్నారు.
గుర్తుతెలియని వ్యక్తుల సందర్శన..!
సారిక కుమారులను ఖననం చేసిన ప్రదేశానికి ఆదివారం ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చినట్లు తెలిసింది. మళ్లీ పోస్ట్‌మార్టం నిర్వహించే అవసరం ఏర్పడుతుందేమోననే అనుమానంతో ఖననం చేసిన మృతదేహాలను అక్కడి నుంచి తరలించేందుకు వారు ప్రయత్నించినట్లు సమాచారం.