నోటీసులిస్తే ఏంటీ?
నోటీసులిస్తే ఏంటీ?
Published Mon, Apr 17 2017 11:10 PM | Last Updated on Tue, Sep 5 2017 9:00 AM
కమిషనర్ ఆదేశాలు పాటించని ఆశీలు కాంట్రాక్టర్లు
మరుసటిరోజే రూ. 20 నుంచి రూ.30 వసూలు
నోటీసులు అతిక్రమించిన వారిపై చర్యలు తప్పవా?
సాక్షి, రాజమహేంద్రవరం : ‘సిటీకి ఎంతోమంది కమిషనర్లు వస్తుంటారు.. పోతుంటారు..కానీ చంటిగాడు లోకల్.. ఇక్కడే ఉంటాడు’ ఇది ఓ సినిమాలో ఫేమస్ డైలాగ్, ఇప్పటికీ అక్కడక్కడా ఇది వినపడుతుంటుంది. ఈ డైలాగునే వంట పట్టించుకున్నారేమో రాజమహేంద్రవరంలోని నగరపాలక సంస్థ మార్కెట్ల ఆశీలు కాంట్రాక్టర్లు. నిర్ణయించిన ప్రకారం కాకుండా నిబంధనలకు విరుద్ధంగా మార్కెట్ల వద్ద ఆశీలు వసూలు చేయరాదంటూ కమిషనర్ ఆదివారం కాంట్రాక్టర్లు ఎం.చంద్రరావు, డి.శ్రీనివాస్, జి.సాయిబాబులకు నోటీసులిచ్చారు. మరోసారి ఇలా చేస్తే ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే కాంట్రాక్టులు రద్దు చేస్తామని, క్రిమినల్ కేసులు నమోదు చేయిస్తామని హెచ్చరించారు. సరిహద్దులు దాటి ఆశీలు వసూలు చేసినా చర్యలు తప్పవని హెచ్చరించారు. అయితే కమిషనర్ వి.విజయరామరాజు ఇచ్చిన నోటీసులు, హెచ్చరికలు భేఖాతరు చేస్తూ పైన పేర్కొన్న ముగ్గురు కాంట్రాక్టర్లు సోమవారం ఆయా మార్కెట్ల వద్ద సైకిల్, మోటారు సైకిల్‌పై వ్యాపారాలు చేసుకునే వారి వద్ద రూ.8కి బదులు రూ.20 రూ.25, రూ.30 వసూలు చేశారు. ఆల్కాట్‌తోట కాంట్రాక్టర్ చిరు వ్యాపారులకు మార్కెట్‌లోని దుకాణాలు, కానాలకు ఇచ్చే టోకెన్ (రూ.28)ఇచ్చి రూ. 30 వసూలు చేశారు. మునికుట్ల అచ్యుతరామయ్య మార్కెట్ కాంట్రాక్టర్ తన సరిహద్దు దాటి కోరుకొండ రోడ్డులోని హరిపురం వద్ద రోడ్డుపక్కన తాటిముంజలు, చీపుర్లు విక్రయించే వారి వద్ద రూ.25 తీసుకుని టోకెన్ ఇచ్చారు. జాంపేట మార్కెట్ కాంట్రాక్టర్ డి.శ్రీనివాస్ తన పరిధిలో లేని గణేష్ చౌక్ రైతు బజార్ వద్ద తాటిముంజలు విక్రయించుకునే వారి వద్ద రూ.20 వసూలు చేశారు. ఇలా కమిషనర్ నోటీసులు ఇచ్చిన ముగ్గురు కాంట్రాక్టర్లు వాటిని లెక్కచేయకుండా సరిహద్దులు దాటి మరీ అధికంగా ఆశీలు వసూలు చేయడంతో వారిపై చర్యలు తీసుకునే అవకాశం నగరపాలక సంస్థ అధికారులు వచ్చింది. నోటీసులలో పేర్కొన్నట్టు వారి కాంట్రాక్టులు రద్దు చేయడం, క్రిమినల్ కేసులు పెట్టించడం వంటి చర్యలు తీసుకునే అవకాశం కాంట్రాక్టర్లే అధికారులు ఇచ్చినట్టయ్యింది.
Advertisement
Advertisement