'నన్ను సస్పెండ్ చేయలేదు'
సాక్షి, రాజన్న సిరిసిల్ల జిల్లా: తనపై ఎవరు ఎలాంటి చర్యలు తీసుకోలేదని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ విశ్వజిత్ కంపాటి స్పష్టం చేశారు. ఈ రోజు ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. అధికారికంగానే తాను లడఖ్ సరిహద్దుకు వెళ్తున్నట్లు తెలిపారు. 15 రోజుల పాటు అక్కడ తెలంగాణ రాష్ట్రం తరుపున పాల్గొంటున్నానని వివరించారు. లడఖ్‌లో జరిగే నివాళి కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రం నుంచి తాను ఎంపిక అయినట్లు తెలిపారు. తనపై వస్తున్న ఆరోపణల్లో నిజం లేదన్నారు.
కాగా, దళితులపై దాడి ఘటనలో సిరిసిల్ల సీసీఎస్ ఎస్ఐ రవీందర్‌ను డీఐజీ సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. నేరెళ్ల ఘటనలో ఎస్‌ఐ రవీందర్ అతిగా ప్రవర్తించినట్టు తేలడంతో సస్పెండ్ చేసినట్టు మంత్రి కేటీఆర్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. ఎస్పీ విశ్వజిత్ తెర వెనుక ఉండి నేరేళ్ల దారుణానికి తెర తీశారని బాధితులు ఆరోపించారు. ఆయనను సస్పెండ్ చేయాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలో ఎస్పీ విశ్వజిత్‌ను సస్పెండ్ చేసినట్టు సోమవారం కొన్ని టీవీ చానళ్లు ప్రసారం చేశాయి. ఈ వార్తలను ఆయన తోసిపుచ్చారు.