సాక్షి, హైదరాబాద్: నేరెళ్ల ఘటనపై అఖిలపక్షం ఆధ్వర్యంలో రాష్ట్రపతిని కలిసినా ఎలాంటి ఫలితం లేకుండా పోయిందని టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా బాధితులకు న్యాయం జరగలేదని, అక్రమ కేసులు, బెదిరింపులతో కేసులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. బుధవారం హైదరాబాద్‌లోని మఖ్దూమ్ భవన్‌లో నేరెళ్ల బాధితులతో సీపీఐ, న్యూ డెమోక్రసీ, తెలంగాణ ప్రజాఫ్రంట్ తదితర సంఘాల నేతలు ముఖాముఖి చర్చించారు.
అన్ని పార్టీలు ఏకతాటి పైకి వచ్చి మరోసారి నేరెళ్లను సందర్శించాలని సూచించారు. రాష్ట్రంలో సహజ సంపదను పోలీసుల రక్షణ మధ్య అధికారపార్టీ నేతలు యథేచ్ఛగా దోచుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఉన్న అనేక రకాల మాఫియాలను అంతా కలసి ఐక్యంగా ఎదుర్కోవాలని కోదండరాం కోరారు. బాధితులకు అన్ని రాజకీయ పార్టీలు పూర్తి మద్దతు ప్రకటించేలా చర్చిస్తామని సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి పేర్కొన్నారు. సంఘటన జరిగి నెలలు గడుస్తున్నా బాధితులు దళితులు అనే చిన్న చూపుతో న్యాయం చేయట్లేదని ఆరోపించారు.
ఇసుక వీరుడు కేటీఆర్ తన సొంత నియోజకవర్గంలో ఇంత జరుగుతున్నా స్పందించక పోవడం బాధాకరమని సీపీఐ ఎంఎల్ న్యూడెమొక్రసీ నేత గోవర్ధన్ వ్యాఖ్యానించారు. నేరెళ్ల బాధితులపై నిరంకుశంగా వ్యవహరించిన ఎస్పీ విశ్వజిత్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. తనపై పోలీసులు అక్రమంగా కేసులు బనాయించారని బాధితుడు బానయ్య ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment