nerella incident
-
రాబంధుల్లాగా దోచుకుంటున్నారు
హైదరాబాద్ : నెరేళ్ల సంఘటన జరిగిన ఏడాది కావస్తున్న సందర్భంలో బాధితులతో కలిసి తెలంగాణ పీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గాంధీ భవన్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..‘ పోయిన ఏడాది జూలైలో సిరిసిల్లలో ఇసుక లారీ కింద పడి గిరిజనుడు చనిపోతే..నిరసన తెలియజేయడానికి వచ్చిన దళితులను పోలీసులు థర్డ్ డిగ్రీతో వేధించారు. ఎంత మంది చనిపోయినా కూడా మా అక్రమ సంపాదన మాదే అన్నట్లు కల్వకుంట్ల కుటుంబం తయారైంది. కేసీఆర్ కుటుంబం, టీఆర్ఎస్ నేతలు రాబంధుల్లాగా రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు. పోయిన జూలై తర్వాత మరలా అనేక మంది ఇసుక లారీల కింద పడి చనిపోయారు. ఎంత మంది చచ్చినా మాకు అక్కర్లేదు అన్నట్లు కేసీఆర్ కుటుంబం ప్రవర్తిస్తున్నది. ఇంత జరిగినా బుద్ధి తెచ్చుకోగపోగా..బాధితులపై ఒత్తిడి తేవడం, వారికే లంచాలు ఇవ్వడం లాంటివి ప్రభుత్వం చేస్తుంది’ అని ఆరోపించారు. ‘కేసీఆర్ కుమారుడు స్థానిక ఎమ్మెల్యే అయ్యి ఉండి కూడా కేటీఆర్ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. ఈ విషయంలో బాగా ప్రమేయం ఉన్న ఎస్పీకి ప్రమోషన్ ఇచ్చారు. ఇప్పటి వరకు ఛార్జ్‌షీట్ వెయ్యలేదు. కేసు డ్రాప్ కూడా చెయ్యలేదు. మీ కాలం దగ్గర పడ్డది కాబట్టే.. మీ చేష్టలు ఇలా ఉన్నాయి. నేరేళ్ల బాధిత కుటుంబాలను కాంగ్రెస్ ఆదుకుంటుంది. హైకోర్టులో కూడా వీళ్లపై కేసు పెండింగ్‌లో ఉంది. అక్కడ కూడా వీరికి న్యాయం జరగడం లేదు. ఏడాది తర్వాత కూడా న్యాయం జరగలేదు అని చెప్పడానికి మా ప్రయత్నం చేస్తున్నామని’ ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు. నేరేళ్ల బాధితులు మాకు కాంగ్రెస్ వల్ల కొంచెం న్యాయం జరుగుతుందని ఆశ పడుతున్నాం. అక్కడ తిరుగుతున్న లారీలన్నీ కేసీఆర్ కుటుంబానికి చెందినవే. ఎంత మంది చచ్చిపోయినా కనీసం లారీ డ్రైవర్లు, ఓనర్ల మీద కేసు పెట్టడం లేదు. షాక్ ఇచ్చి చిత్రహింసలకు గురిచేశారు. ఆ సమయంలో బెటాలియన్ మొత్తం అక్కడే ఉంది. ఎస్పీ, పశువులాగా ప్రవర్తించాడు. ఇదంతా చేయించింది కేటీఆరే. బానయ్య, మాజీ సర్పంచ్ పోలీసు శాఖలోకి వెళ్దామనుకున్నా..పోలీసుల తీరు చూసి సిగ్గేస్తోంది. దేనికీ పనికి రాకుండా కొట్టారు. మేము టెర్రరిస్టులం కాదు. ఏడాది గడిచినా కూడా మాకు న్యాయం జరగలేదు. - హరీష్ -
‘నేరెళ్ల’ గాయానికి ఏడాది
సిరిసిల్ల : జాతీయస్థాయిలో రాజకీయంగా రగిలిన నేరెళ్ల ఘటన ఇంకా సలుపుతూనే ఉంది. రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు దళితులపై ‘థర్డ్‌డిగ్రీ’ ప్రయోగించిన ఘటన మానని గాయమైంది. సరిగ్గా నేటికి ఏడాది కిందట జూలై 2న తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల వద్ద ఇసుక లారీ ఢీకొని దళితుడు భూమయ్య మరణించిన ఘటన వివాదాస్పదమైంది. ఏడాదిగా బాధితులు న్యాయపోరాటం చేస్తూనే ఉన్నారు. అసలేం జరిగింది..! మధ్యమానేరు జలాశయంలో ముంపునకు గురయ్యే ప్రాంతంలోని ఇసుకను తొలగించేందుకు మైనింగ్‌శాఖ టెండర్లు నిర్వహించింది. చీర్లవంచ, కొదురుపాక ప్రాంతాల నుంచి నిత్యం వందలాది లారీల్లో ఇసుక తరలిపోతుంది. ఇసుక లారీలతో ఏడాదిలో 42 ప్రమాదాలు జరిగాయి. అప్పటికే నలుగురు మృత్యువాత పడ్డారు. జూలై 2న నేరెళ్లకు చెందిన భూమయ్య ఇసుక లారీ ఢీకొ ని మరణించాడు. దీంతో స్థానికులు ఆగ్రహానికి గురై ఐదు ఇసుక లారీలను తగులబెట్టారు. అడ్డుకున్న పోలీసులపైనా దాడి చేశారు. తంగళ్లపల్లి ఎస్సై సైదారావు, కొందరు పోలీసులు గాయపడ్డారు. లారీ దహనం, పోలీసులపై దాడి చేసిన ఘ టనలో 13మందిపై పోలీసులు కేసు నమోదు చేశా రు. జూలై 4న రాత్రి 11.30 గంటలకు నేరెళ్లకు చెం దిన పెంట బాణయ్య, కోల హరీష్, చెప్పాల బాల రాజు, పసుల ఈశ్వర్‌కుమార్, గంధం గోపాల్, రామచంద్రాపూర్‌కు చెందిన బత్తుల మహేశ్, జిల్లెల్లకు చెందిన కోరుగంటి గణేశ్, చీకోటి శ్రీనివాస్నుపోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిరాకరించిన జైలర్ పోలీసులు అరెస్ట్ చేసిన వారిని జూలై 8న రిమాండ్‌కు తరలించారు. కరీంనగర్ జైలర్ నిందితులపై గాయాలు చూసి జైలులోకి తీసుకునేందుకు నిరాకరించారు. పోలీసులు పెయిన్‌కిల్లర్స్ ఇచ్చి వారంతా ఆరోగ్యంగానే ఉన్నారని డాక్టర్ సర్టిఫికెట్తో జూలై 10న జైలుకు పంపించారు.వీరిలో నలుగురు తీవ్రఅస్వస్థతకు గురికాగా.. కరీంనగర్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. జైలర్ నిందితుల ఆరోగ్యంగా లేరని నిరాకరించడంతో పోలీసుల థర్డ్ డిగ్రీ ఘటన వెలుగులోకి వచ్చింది. థర్డ్ డిగ్రీ ప్రయోగంపై నిరసన.. జైలు ములాఖాత్‌లో తమ వారిని కలిసిన కుటుంబ సభ్యులు పోలీసుల దెబ్బలను చూసి చలించిపోయారు. పోలీసులు వ్యవహరించిన తీరుపై నిరసన వ్యక్తం చేశారు. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బండి సంజయ్ తొలుత నిందితులను కలిసి పోలీసుల తీరును తప్పుబట్టారు. అంతకు ముందు టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ వారితో మాట్లాడారు. జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యులు కె.రాములు నేరెళ్లకు వచ్చి బాధితుల గోడు విన్నాడు. లోక్‌సభ మాజీ స్పీకర్ మీరాకుమార్ కరీంనగర్, నేరెళ్ల, జిల్లెల్లకు వచ్చి బాధితులను పరామార్శించారు. సీపీఐ నేత నారాయణ, సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం, అప్పటి టీడీపీ నేత రేవంత్‌రెడ్డి, టఫ్ ప్రతినిధులు, టీమాస్ ఫోరమ్ ప్రతినిధులు విమలక్క, రిటైర్డు జడ్జి చంద్రకుమార్, దళిత బహుజన సంఘాల నేతలు నేరెళ్ల బాధితుల పక్షాన నిలిచారు. కాంగ్రెస్ నేత వి.హన్మంతరావు ఇప్పటికీ బాధితులకు అండగా ఉంటూ.. న్యాయపోరాటానికి మద్ధతు ఇస్తున్నారు. బాధితులు మానవహక్కుల సంఘాన్ని, రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. వివాదాస్పదమైన పోలీసుల తీరు.. నేరెళ్ల ఘటనతో సిరిసిల్ల పోలీసులు ఆత్మరక్షణలో పడ్డారు. అప్పటి జిల్లా ఎస్పీ విశ్వజిత్ కంపాటి ఇంటరాగేషన్‌లో స్వయంగా పాల్గొన్నారని బాధితులు ఆరోపించారు. ఈ ఘటనలో అప్పటి సీసీఎస్ ఎస్సై రవీందర్‌ను సస్పెండ్ చేశారు. ఎస్పీ విశ్వజిత్ కాంపాటి హైదరాబాద్‌కు బదిలీ అయ్యారు. సిరిసిల్ల ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి కేటీఆర్ సైతం బాధితులను వేములవాడలో పరామర్శించి ఆదుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో నలుగురు బాధితులు మంత్రి కేటీఆర్ మాటకు విలువిచ్చి సరెండర్ అయ్యారు. మిగితా నలుగురు ఇంకా న్యాయపోరాటం చేస్తున్నారు. ఇటీవల దేశరాజధాని ఢిల్లీ వరకు వెళ్లి టీఆర్ఎస్ సర్కారు తీరుపై నిరసన తెలిపారు. -
ఆ ఘటనపై కేసీఆర్ ఏం చెబుతారు?: రచనా రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికే ‘తెలంగాణ జన సమితి’ ఆవిర్భవించిందని అడ్వకేట్ రచనా రెడ్డి తెలిపారు. ఆమె బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. సామాజిక న్యాయమే జన సమితి లక్ష్యమని స్పష్టం చేశారు. మరో వైపు.. దేశంలో దళితులపై జరుగుతున్న దాడులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఖండించడం విడ్డూరంగా ఉందన్నారు. ఎస్సీ, ఎస్టీ చట్టంపై మాట్లాడిన కేసీఆర్.. నేరెళ్ల దళితులపై ఇసుక మాఫియా లారీలు ఎక్కించి చంపిన ఘటనపై ఏం సమధానం చెబుతారని ప్రశ్నించారు. ఆయన మాటలకు, చేతలకు పొంతన ఉండదని ఆమె ఎద్దేవా చేశారు. కాగా, సిరిసిల్ల జిల్లా నేరెళ్ల, రామచంద్రాపురం గ్రామాలకు చెందిన 8 మంది దళితులు ఇసుక మాఫియాపై ప్రశ్నించినందుకు పోలీసులు అమానుషంగా వారిపై దాడి చేసిన అంశం రాష్ట్రంలో వివాదస్పదమైన విషయం తెలిసిందే. ఈ ఘటనకు బాధ్యులైన వారిని జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి కేటీఆర్ రక్షిస్తున్నారని అప్పట్లో తీవ్ర విమర్శలు కూడా వచ్చాయి. -
నేరెళ్ల ఘటనలో న్యాయం జరగలేదు
సాక్షి, హైదరాబాద్: నేరెళ్ల ఘటనపై అఖిలపక్షం ఆధ్వర్యంలో రాష్ట్రపతిని కలిసినా ఎలాంటి ఫలితం లేకుండా పోయిందని టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా బాధితులకు న్యాయం జరగలేదని, అక్రమ కేసులు, బెదిరింపులతో కేసులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. బుధవారం హైదరాబాద్‌లోని మఖ్దూమ్ భవన్లో నేరెళ్ల బాధితులతో సీపీఐ, న్యూ డెమోక్రసీ, తెలంగాణ ప్రజాఫ్రంట్ తదితర సంఘాల నేతలు ముఖాముఖి చర్చించారు. అన్ని పార్టీలు ఏకతాటి పైకి వచ్చి మరోసారి నేరెళ్లను సందర్శించాలని సూచించారు. రాష్ట్రంలో సహజ సంపదను పోలీసుల రక్షణ మధ్య అధికారపార్టీ నేతలు యథేచ్ఛగా దోచుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఉన్న అనేక రకాల మాఫియాలను అంతా కలసి ఐక్యంగా ఎదుర్కోవాలని కోదండరాం కోరారు. బాధితులకు అన్ని రాజకీయ పార్టీలు పూర్తి మద్దతు ప్రకటించేలా చర్చిస్తామని సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి పేర్కొన్నారు. సంఘటన జరిగి నెలలు గడుస్తున్నా బాధితులు దళితులు అనే చిన్న చూపుతో న్యాయం చేయట్లేదని ఆరోపించారు. ఇసుక వీరుడు కేటీఆర్ తన సొంత నియోజకవర్గంలో ఇంత జరుగుతున్నా స్పందించక పోవడం బాధాకరమని సీపీఐ ఎంఎల్ న్యూడెమొక్రసీ నేత గోవర్ధన్ వ్యాఖ్యానించారు. నేరెళ్ల బాధితులపై నిరంకుశంగా వ్యవహరించిన ఎస్పీ విశ్వజిత్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. తనపై పోలీసులు అక్రమంగా కేసులు బనాయించారని బాధితుడు బానయ్య ఆవేదన వ్యక్తం చేశారు. -
గత వ్యాధులతోనే అనారోగ్యం
సాక్షి, హైదరాబాద్: నేరేళ్ల ఘటన విచారణ సమయంలో పోలీసులు నిందితులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించలేదని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి పేర్కొన్నారు. బాధితులకు గతంలో ఉన్న వ్యాధులతోనే అనారోగ్యం పాలయ్యారని వెల్లడించారు. వారిపై ఉన్న కేసులను మాఫీ చేయించుకునే ఎత్తుగడతో, భయంతో పోలీసులు కొడితే గాయాలయ్యాయని, ఎముకలు విరిగాయని పోలీసులపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని వివరించారు. విచారణ సమయంలో మితిమీరి ప్రవర్తించినట్లు ఆరోపణలు వచ్చిన ఎస్ఐ రవీందర్‌ను సస్పెండ్ చేశామని, క్రిమినల్ కేసు నమోదు చేసి విచారణ జరిపిస్తున్నామన్నారు. సోమవారం శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సందర్భంగా దళితులు, గిరిజనులపై జరుగుతున్న దురాగతాలు, అత్యాచారాలు, పోలీసు కేసులపై మండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి అడిగిన ప్రశ్నలకు నాయిని సమాధానం ఇచ్చారు. నేరెళ్ల ఘటన, లారీలను తగులబెట్టిన సమయంలో అదుపు చేసేందుకు ప్రయత్నించిన పోలీసులను వారే గాయపరిచారని పేర్కొన్నారు. కేసులో 8 మంది ప్రమేయం ఉన్నట్లు తేలిందని, ఆ కేసుల భయంతో ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. షబ్బీర్ కల్పించుకొని మాట్లాడుతూ అసలు దాడులే జరగలేదని హోం మంత్రి మొదట చెప్పి సభను తప్పుదోవ పట్టించారని చెప్పారు. ఇందుకు నిరసనగా సభ నుంచి వాకౌట్ చేశారు. ఖమ్మం జిల్లాలో 20 వేల ఎకరాలకు సాగునీరు: హరీశ్‌రావు ఖమ్మం జిల్లాలోని పాలేరు పాత కాల్వ ఆధునీకరణ ద్వారా 20 వేల ఎకరాలకు సాగునీరు ఇవ్వనున్నట్లు నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. పాలేరు కాల్వ ఆధునీకరణపై ఎమ్మెల్సీ పొంగులేటి అడిగిన ప్రశ్నకు హరీశ్‌రావు సమాధానం ఇచ్చారు. ఆ కాల్వ కింద 14,447 ఎకరాలకు సాగు నీరు అందాల్సి ఉండగా, గత ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా 8 వేల ఎకరాలకు పరిమితమైందన్నారు. తాము ఆధునీకరణ చేపట్టడం వల్ల మరో 6 వేల ఎకరాలకు అదనంగా నీరందించేలా చేయగలిగామన్నారు. ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ అడిగిన ప్రశ్నలకు మంత్రి లక్ష్మారెడ్డి సమాధానం ఇస్తూ.. నల్లగొండ, సూర్యాపేటలో 150 సీట్లతో రెండు మెడికల్ కాలేజీల ఏర్పాటు చేస్తామన్నారు. 26 లక్షల గొర్రెల పంపిణీ: తలసాని గొర్రెల పథకంలో భాగంగా ఇప్పటి వరకు 26 లక్షల గొర్రెలు ఇచ్చామని, గొర్రెలు చనిపోయినా ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి మళ్లీ ఇస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. లబ్ధిదారులకు నష్టం వాటిల్లదన్నారు. పెద్ద పథకం కాబట్టి కొంతమంది దొంగలు చొరబడ్డారని, వారిపై 85 కేసులు నమోదు చేశామన్నారు. -
నేరేళ్ల ఘటనపై సీఐడీ విచారణ వేగవంతం
-
'నన్ను సస్పెండ్ చేయలేదు'
సాక్షి, రాజన్న సిరిసిల్ల జిల్లా: తనపై ఎవరు ఎలాంటి చర్యలు తీసుకోలేదని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ విశ్వజిత్ కంపాటి స్పష్టం చేశారు. ఈ రోజు ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. అధికారికంగానే తాను లడఖ్ సరిహద్దుకు వెళ్తున్నట్లు తెలిపారు. 15 రోజుల పాటు అక్కడ తెలంగాణ రాష్ట్రం తరుపున పాల్గొంటున్నానని వివరించారు. లడఖ్‌లో జరిగే నివాళి కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రం నుంచి తాను ఎంపిక అయినట్లు తెలిపారు. తనపై వస్తున్న ఆరోపణల్లో నిజం లేదన్నారు. కాగా, దళితులపై దాడి ఘటనలో సిరిసిల్ల సీసీఎస్ ఎస్ఐ రవీందర్‌ను డీఐజీ సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. నేరెళ్ల ఘటనలో ఎస్ఐ రవీందర్ అతిగా ప్రవర్తించినట్టు తేలడంతో సస్పెండ్ చేసినట్టు మంత్రి కేటీఆర్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. ఎస్పీ విశ్వజిత్ తెర వెనుక ఉండి నేరేళ్ల దారుణానికి తెర తీశారని బాధితులు ఆరోపించారు. ఆయనను సస్పెండ్ చేయాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలో ఎస్పీ విశ్వజిత్‌ను సస్పెండ్ చేసినట్టు సోమవారం కొన్ని టీవీ చానళ్లు ప్రసారం చేశాయి. ఈ వార్తలను ఆయన తోసిపుచ్చారు. -
నేరెళ్ల ఘటనలో ఎస్ఐ రవీందర్ సస్పెన్షన్
సిరిసిల్ల: నేరెళ్లకు చెందిన ముగ్గురు దళితులు, మరో ఐదుగురిని నిర్బంధించి థర్డ్ డిగ్రీ ప్రయోగించిన ఘటనపై సర్కారు స్పందించింది. సెంట్రల్ క్రైమ్ స్టేషన్(సీసీఎస్) సబ్ ఇన్స్పెక్టర్ బి.రవీందర్‌ను సస్పెండ్ చేస్తూ వరంగల్ ఐజీ నాగిరెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లెల్ల వద్ద జూలై 2న ఇసుక లారీలు దహనం చేసిన కేసులో ఎనిమిది మందిని అదుపులోకి తీసుకుని థర్డ్ డిగ్రీ ప్రయోగించిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రతిపక్షాల ఆందోళనతో మంత్రి కేటీఆర్ స్పందించారు. నేరెళ్ల ఘటనపై విచారణ జరుపుతున్నామని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. వేములవాడకు వచ్చి బాధితులను పరామర్శించి వెళ్లిన 3 రోజులకే ఎస్ఐ సస్పెన్షన్‌కు గురయ్యా రు. అంతకుముందు నేరెళ్ల ఘటనపై డీఐజీ రవివర్మ విచారణ జరి పారు. ఆయన నివేదిక ఆధారంగా ఎస్ఐని సస్పెండ్ చేశారు. మంత్రి కేటీఆర్ ట్వీట్.. నేరెళ్ల ఘటనలో ఎస్ఐ రవీందర్‌ను సస్పెండ్ చేస్తూ ఐజీ నాగిరెడ్డి ఆదేశాలు జారీ చేసిన వెంటనే స్థానిక ఎమ్మెల్యే, మంత్రి కేటీఆర్ ట్వీటర్లో స్పందించారు. మాట నిలుపుకున్నానని మేసెజ్ పోస్ట్ చేశారు. నేరెళ్ల ఘటనలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారని మంత్రి ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. -
రేవంత్‌రెడ్డి వార్నింగ్
సిరిసిల్ల: ప్రాణంలేని లారీకి ఉన్న విలువ మనుషుల ప్రాణాలకు లేదా అని టీడీపీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. హీరోయిన్లను పరామర్శించే మంత్రి కేటీఆర్‌కు నేరెళ్ల బాధితుల వద్దకు వచ్చే సమయం లేదా అని నిలదీశారు. శుక్రవారం ఆయన నేరెళ్ల బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎస్పీకి చితక్కొట్టే అధికారం ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. ఈనెల 15లోగా బాధితులపై అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. చనిపోయిన కుటుంబానికి రూ. 10 లక్షలు, గాయపడివారికి రూ. 5 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, మూడెకరాల భూమి, ఇంటికో ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇసుకతో రూ.వెయ్యి కోట్లు వస్తే బాధిత కుటుంబాలకు ఎందుకు సాయం చేయడం లేదని నిలదీశారు. వందల కోట్లు కొల్లగొట్టేందుకు కేసీఆర్ తన బంధువులకే ఇసుక కాంట్రాక్టులు కట్టబెట్టారని ఆరోపించారు. తాను చేసిన ఆరోపణలు అబద్ధమైతే తనపై కేసులు పెట్టాలన్నారు. 15లోగా నెరెళ్ల బాధితులకు న్యాయం చేయకుంటే అన్ని రాజకీయ పక్షాలను కలుపుకుని కేసీఆర్ సంగతి చూస్తామని హెచ్చరించారు. నేరెళ్ల ఘటనలో పోలీసులు ఎందుకు థర్డ్ డిగ్రీ ప్రయోగించాల్సి వచ్చిందని మరో టీడీపీ నేత ఇ. పెద్దిరెడ్డి ప్రశ్నించారు. పోలీసులు రజాకార్ల కంటే ఘోరంగా వ్యవహరించారని మండిపడ్డారు. నేరెళ్ల ఘటనపై సీఎం కేసీఆర్ సంజాయిషీ చెప్పుకోవాల్సింది పోయి మీడియా సమావేశంలో అహంభావంతో మాట్లాడారని దుయ్యబట్టారు.