నేరెళ్ల ఘటనలో ఎస్‌ఐ రవీందర్ సస్పెన్షన్
సిరిసిల్ల: నేరెళ్లకు చెందిన ముగ్గురు దళితులు, మరో ఐదుగురిని నిర్బంధించి థర్డ్ డిగ్రీ ప్రయోగించిన ఘటనపై సర్కారు స్పందించింది. సెంట్రల్ క్రైమ్ స్టేషన్(సీసీఎస్) సబ్ ఇన్‌స్పెక్టర్ బి.రవీందర్‌ను సస్పెండ్ చేస్తూ వరంగల్ ఐజీ నాగిరెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లెల్ల వద్ద జూలై 2న ఇసుక లారీలు దహనం చేసిన కేసులో ఎనిమిది మందిని అదుపులోకి తీసుకుని థర్డ్ డిగ్రీ ప్రయోగించిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రతిపక్షాల ఆందోళనతో మంత్రి కేటీఆర్ స్పందించారు. నేరెళ్ల ఘటనపై విచారణ జరుపుతున్నామని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. వేములవాడకు వచ్చి బాధితులను పరామర్శించి వెళ్లిన 3 రోజులకే ఎస్‌ఐ సస్పెన్షన్‌కు గురయ్యా రు. అంతకుముందు నేరెళ్ల ఘటనపై డీఐజీ రవివర్మ విచారణ జరి పారు. ఆయన నివేదిక ఆధారంగా ఎస్‌ఐని సస్పెండ్ చేశారు.
మంత్రి కేటీఆర్ ట్వీట్..
నేరెళ్ల ఘటనలో ఎస్‌ఐ రవీందర్‌ను సస్పెండ్ చేస్తూ ఐజీ నాగిరెడ్డి ఆదేశాలు జారీ చేసిన వెంటనే స్థానిక ఎమ్మెల్యే, మంత్రి కేటీఆర్ ట్వీటర్‌లో స్పందించారు. మాట నిలుపుకున్నానని మేసెజ్ పోస్ట్ చేశారు. నేరెళ్ల ఘటనలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారని మంత్రి ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే.