రేవంత్‌రెడ్డి వార్నింగ్
సిరిసిల్ల: ప్రాణంలేని లారీకి ఉన్న విలువ మనుషుల ప్రాణాలకు లేదా అని టీడీపీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. హీరోయిన్‌లను పరామర్శించే మంత్రి కేటీఆర్‌కు నేరెళ్ల బాధితుల వద్దకు వచ్చే సమయం లేదా అని నిలదీశారు. శుక్రవారం ఆయన నేరెళ్ల బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎస్పీకి చితక్కొట్టే అధికారం ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు.
ఈనెల 15లోగా బాధితులపై అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. చనిపోయిన కుటుంబానికి రూ. 10 లక్షలు, గాయపడివారికి రూ. 5 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలన్నారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు, మూడెకరాల భూమి, ఇంటికో ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇసుకతో రూ.వెయ్యి కోట్లు వస్తే బాధిత కుటుంబాలకు ఎందుకు సాయం చేయడం లేదని నిలదీశారు. వందల కోట్లు కొల్లగొట్టేందుకు కేసీఆర్ తన బంధువులకే ఇసుక కాంట్రాక్టులు కట్టబెట్టారని ఆరోపించారు. తాను చేసిన ఆరోపణలు అబద్ధమైతే తనపై కేసులు పెట్టాలన్నారు. 15లోగా నెరెళ్ల బాధితులకు న్యాయం చేయకుంటే అన్ని రాజకీయ పక్షాలను కలుపుకుని కేసీఆర్ సంగతి చూస్తామని హెచ్చరించారు.
నేరెళ్ల ఘటనలో పోలీసులు ఎందుకు థర్డ్ డిగ్రీ ప్రయోగించాల్సి వచ్చిందని మరో టీడీపీ నేత ఇ. పెద్దిరెడ్డి ప్రశ్నించారు. పోలీసులు రజాకార్ల కంటే ఘోరంగా వ్యవహరించారని మండిపడ్డారు. నేరెళ్ల ఘటనపై సీఎం కేసీఆర్ సంజాయిషీ చెప్పుకోవాల్సింది పోయి మీడియా సమావేశంలో అహంభావంతో మాట్లాడారని దుయ్యబట్టారు.