చేతివేళ్ల ముద్రలకూ ర్యాం‘కింగ్’
చేతివేళ్ల ముద్రలకూ ర్యాం‘కింగ్’
Published Wed, Jul 27 2016 12:30 AM | Last Updated on Fri, Oct 5 2018 6:29 PM
రేషన్‌కార్డుదారుల కుటుంబ సభ్యుల పది వేళ్ల ముద్రల సేకరణ
బాగా ముద్ర పడే వేలుకు మొదటి ర్యాంక్
ఆ వేలితోనే బయోమెట్రిక్ ద్వారా సరుకుల పంపిణీ
వేలిముద్రల సేకరణలో డీలర్లు బిజీ
అమలాపురం టౌన్:
చేతివేళ్ల ముద్రలకు ర్యాంకింగ్... ఇదేమిటా? అనే సందేహం కలుగుతోంది కదూ... చేతి వేలిముద్రలు అరిగిపోయి ఒక్కోసారి బయోమెట్రిక్ మిషన్లకు అనుసంధానం కాదు. సమస్య పరిష్కారానికి పౌరసరఫరాల శాఖ రేషన్ కార్డుదారుల కుటుంబంలోని అందరి చేతుల పదివేళ్ల ముద్రలను సేకరిస్తారు. అందులో వేలిముద్ర బాగా ఉన్న వేలును బయో మెట్రిక్‌కు ఉపయోగించుకుంటారు. ప్రస్తుతం నిత్యావసర వస్తువులను ఇ–పాస్ విధానంతో బయోమెట్రిక్ ఆధారంగా రేషన్ సరుకులు బట్వాడా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే పింఛన్లు, రేషన్ బట్వాడా సమయంలో ఎక్కువlమంది లబ్ధిదారుల చేతి వేలిముద్రలు బయో మెట్రిక్ మిషన్లతో సరిపోలక సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో రేషన్ పంపిణీకి అంతరాయం ఏర్పడుతోంది. దీంతో బెస్ట్ ఫింగర్ డిటెక్షన్ (బీఎఫ్‌డీ) పేరుతో రేషన్‌కార్డు కలిగిన కుటుంబంలోని ప్రతి ఒక్కరి చేతుల పదివేళ్ల వేలిముద్రలు విడివిడిగా సేకరిస్తోంది. ఇందులో భాగంగా జిల్లాలోని దాదాపు 2400 రేషన్ డిపోల్లో ప్రస్తుతం బీఎఫ్‌డీ ప్రక్రియ సాగుతోంది. గురువారం నాటికి ఈ ప్రక్రియను పూర్తిచేయాలని కూడా నిరే్ధశించారు. జిల్లాలో దాదాపు 15 లక్షల కుటుంబాలకు చెందిన 54 లక్షల జనాభా ఉన్నారు. అంటే 54 లక్షల మంది నుంచి ప్రతి ఒక్కరి పది వేళ్ల ముద్రలను సంబంధిత డీలర్లు బయోమెట్రిక్ మిషన్ ద్వారా సేకరించాల్సి ఉంది.
అక్కడికక్కడే బెస్ట్ ఫింగర్‌కు ర్యాంకింగ్
ఈనెల సరుకుల కోసం కార్డుదారులను కుటుంబ సమేతంగా రమ్మని డీలర్లు కోరుతున్నారు. లేదా డీలర్లే బయోమెట్రిక్ మిషన్లతో కార్డుదారుల ఇళ్లకుSవెళ్లి కుటుంబంలోని సభ్యులందరి పది వేళ్ల ముద్రలనూ సేకరిస్తున్నారు. పది వేళ్లలో ఏ వేలిముద్రలు బాగా ఉన్నాయో... దాని తర్వాత ఏ వేలి ముద్ర బాగుందో... ఇలా వేళ్ల వారీగా పది వేళ్లకు ర్యాంకులు నిర్ధారిస్తూ ప్రింటింగ్ పత్రాని అందిస్తోంది. మిషన్ బెస్ట్ ఫింగర్ డిటెక్షన్ చేసిన వేలును ఇకనుంచి బయో మెట్రిక్‌కు ఉపయోగించేలా ఆధార్ కార్డు నంబరుతో అనుసంధానం చేస్తారు. ఇక నుంచి డీలరు బీఎఫ్‌డీ ప్రకారం కార్డుదారుడు వచ్చినప్పుడు ఈ వేలునే బయోమెట్రిక్‌కు ఉపయోగించడం ద్వారా వేలిముద్రల సమస్యకు సరికొత్త పరిష్కారాన్ని కనుగొంటున్నారు.
ఒక్కో వేలుకు ఒక్కో నిమిషం
డీలర్లకు పదివేళ్ల ముద్రల సేకరణ ఓ ప్రసవంగా మారింది. ఇ–పాస్ సర్వర్ సరిగా పనిచేస్తే ఒక్కో వేలుకు కనీసం నిమిషం సమయం పడుతుంది. అంటే పదివేళ్లకు పది నిమిషాలు పడుతోంది. ఇక కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికీ పదేళ్లకూ వేలిముద్రల సేకరణ అంటే ఎంత సమయం పడుతుందో అంచనా వేయవచ్చు. ఒక్కో చౌక డిపో పదిధిలో 2,000 నుంచి 2,500 వరకూ కార్డులు ఉంటాయి. ఇప్పటి వరకూ జిల్లాలో ప్రతి డిపో పరిధిలో 600 నుంచి 1000 వరకూ కార్డులు మాత్రమే మాత్రమే పూర్తయ్యాయి. గడువు మరో నెల రోజులు పెంచితేనే బీఎఫ్‌డీ పూర్తవుతుందని డీలర్లు అంటున్నారు.
Advertisement
Advertisement