ప్రమాదకరంగా మూలమలుపులు
Published Sun, Jul 31 2016 11:24 PM | Last Updated on Thu, Aug 30 2018 4:49 PM
రామకృష్ణాపూర్ : క్యాతనపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని రహదారులు వాహనచోదకులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఇరుకైన రోడ్లు, భయంకర మూలమలుపుల కారణంగా తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు పట్టింపు లేకపోవడమే కారణమని క్యాతనపల్లి ప్రజలు ఆరోపిస్తున్నారు.
దీంతో ప్రయాణికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రయాణాలు సాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రధానంగా రామకృష్ణాపూర్ నుండి క్యాతనపల్లి మీదుగా మంచిర్యాల వైపు వెళ్లే మార్గంలో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ మార్గంలో ప్రయాణం సాగించాలంటే నాలుగు మూలమలుపులు దాటాల్సిందే.
మంచిర్యాలకు వెళ్లాలంటే ఇదే ఏకైక మార్గం కావడంతో నిత్యం వందల సంఖ్యలో ప్రజలు రాకపోకలు సాగిస్తూ ఉంటారు. అయితే ఇరుకైన రోడ్లు కావటం, మూలమలుపుల వద్ద రోడ్డుకు ఇరువైపులా ఏపుగా పెరిగిన చెట్ల పొదలు ఉండటంతో ఎదురుగా వచ్చే వాహనాలు దగ్గరికి వచ్చే వరకు కనబడని పరిస్థితి దాపురించింది.
అలాగే విఠల్‌నగర్ నుంచి రైల్వే గేట్ వెళ్లే దారిలో ఉన్న మూలమలుపులు మరీ ప్రమాదకరంగా ఉన్నాయి. స్కూళ్లకు, కాలేజీలకు వెళ్లే బస్సుల సంఖ్య కూడా ఈ మార్గంలో అధికంగానే రాకపోకలు సాగిస్తుంటాయి. ప్రయాదాల నివారణకు స్థానిక ప్రజాప్రతినిధులు, ఆర్‌అండ్‌బీ అధికారులు స్పందించి మూలమలుపుల వద్ద ప్రమాదాలు జరుగకుండా చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
Advertisement
Advertisement