శంకర నేత్రాలయంలో అరుదైన శస్త్ర చికిత్స
శంకర నేత్రాలయంలో అరుదైన శస్త్ర చికిత్స
Published Wed, Nov 9 2016 12:18 AM | Last Updated on Mon, Sep 4 2017 7:33 PM
ఏలూరు (మెట్రో) : స్థానిక ఆర్‌ఆర్‌పేటలోని శంకర నేత్రాలయంలోని అరుదైన శస్త్రచికిత్సను నిర్వహించి ఇద్దరికి చూపును ప్రసాదించారు వైద్యులు. మెట్రో నగరాల్లోనూ లభించని అధునాతన నల్లగుడ్డు మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేసి చూపును అందించినట్లు శంకర నేత్రాలయ వైద్యుడు నాదెండ్ల విష్ణువర్దన్ తెలిపారు. మంగళవారం నేత్రాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముంబై, హైదరాబాద్, చెన్నై వంటి పట్టణాల్లో అందుబాటులో ఈ శస్త్ర చికిత్స ఉన్నప్పటికీ భారీ ఖర్చుతో కూడుకున్నదని తెలిపారు. ఈ నల్లగుడ్డు మార్పిడి శస్త్ర చికిత్సను ఏలూరులో అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఆయన తెలిపారు. పూర్తి ఆధునిక పద్ధతులతో, అన్ని వసతులు ఏర్పాటు చేసినందునే ఇద్దరికి నల్లగుడ్డు మార్పిడి చికిత్సను విజయవంతంగా పూర్తిచేశామన్నారు. శస్త్రచికిత్స చేసిన వైద్యురాలు హేమలత మాట్లాడుతూ నల్లగుడ్డు మార్పిడితో పాటు కంటిలో ఉండే పొరలనూ మార్చే అధునాతన చికిత్స ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు, క్లాసిక్ శస్త్రచికిత్సద్వారా చూపు మందగించిన వారికి పూర్తిస్థాయిలో చూపును అందించే ఏర్పాట్లు చేసినట్లు ఆమె తెలిపారు. సమావేశంలో వైద్యులు ఎన్. రవికిరణ్, ఆర్.పద్మ పాల్గొన్నారు.
Advertisement