3న తిరుమలలో రథసప్తమి వేడుకలు
సాక్షి, తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేకంటేశ్వర స్వామివారు కొలువైన తిరుమలలో ఫిబ్రవరి 3వ తేదీన రథసప్తమి మహోత్సవం ఘనంగా నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా తిరుమలలో శుక్రవారం ఉదయం 5.30 గంటలకు స్వామివారి సూర్యప్రభ వాహనాన్ని ప్రయోగాత్మకంగా పరిశీలించారు. జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో వాహన మండపం నుంచి సూర్యప్రభ వాహనాన్ని శ్రీవారి ఆలయం వరకు ఊరేగించి లోటుపాట్లను తెలుసుకున్నారు.
ఏడు వాహన సేవల్లో మలయప్ప దర్శనం: తిరుమలలో మాఘమాసం శుద్ధ సప్తమి సూర్యజయంతి పర్వదినం సందర్భంగా ‘రథ సప్తమి’ వేడుక నిర్వహించనున్నారు. ఆ రోజు మలయప్పస్వామి ఏడు వాహనాలపై తిరుమల మాడ వీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమివ్వనున్నారు. కాగా ఫిబ్రవరి 3వ తేదీన సూర్యోదయం 6.44 గంటలుగా టీటీడీ నిర్దేశించింది.
పలు ఆర్జిత సేవలు రద్దు..: రథసప్తమి సందర్భంగా ఆ రోజు సుప్రభాతం, తోమాల, అర్చన సేవలకు భక్తులను అనుమతించకుండా స్వామివారికి ఏకాం తంగా నిర్వహించనున్నారు. అలాగే నిజపాదర్శనం, కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సం, సహస్ర దీపాలంకార సేవలు కూడా రద్దు చేశారు.