బాలికల నిష్పత్తి పెరగాలి
కడప సెవెన్‌రోడ్స్:
జిల్లాలో బాలికల నిష్పత్తి పెరిగేందుకు కృషి చేయడం అందరి బాధ్యత అని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యుడు మురళీధర్‌రెడ్డి అన్నారు. శనివారం కలెక్టరేట్ సభా భవనంలో వివిధ శాఖల అధికారులతో బేటీ బచావో–బేటీ పడావో కార్యక్రమ అమలు గురించి ఆయన సమీక్షించారు. ఆడ శిశువుల జననాల సంఖ్యను పెంచి మహిళా సాధికారతను సాధించాలన్న ఉద్దేశ్యంతోనే కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. జిల్లాలో ప్రతి వెయ్యి మంది మగ పిల్లలకుగాను 918 మంది మాత్రమే బాలికలు ఉన్నారని పేర్కొన్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వం జిల్లాను ఈ కార్యక్రమం కింద ఎంపిక చేసిందని చెప్పారు. కార్యక్రమ అమలు బాధ్యతను కమిషన్‌కు అప్పగించిందన్నారు. బాల్య వివాహాలు జరగకుండా చూడాలన్నారు. బాల్య వివాహాలను నివారించేందుకు ప్రజల్లో అవగవాహన తీసుకు రావాలని చెప్పారు. స్త్రీ శిశు సంక్షేమశాఖ ద్వారా ఆరోగ్యకరమైన శిశువు జననాల కోసం గర్బవతులకు పౌష్ఠికాహారం అందించాలన్నారు. బాలల హక్కుల పరిరక్షణ కోసం రూపొందించిన చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలన్నారు. బాల్య వివాహాల పట్ల పాఠశాల స్థాయి నుంచే పిల్లలకు అవగాహన కల్పించాలన్నారు. గుర్తింపు లేని ప్రైవేటు పాఠశాలలను మూసి వేయాలని, ప్రైవేటు పాఠశాలల్లో పిల్లలకు అన్ని మౌళిక వసతులు కల్పించాలన్నారు. జాయింట్ కలెక్టర్ శ్వేత తెవతీయ మాట్లాడుతూ బాలికల సంఖ్య పెంచే కార్యక్రమంలో భాగంగా జాతీయ బాలికా దినోత్సవం బేటీ బచావో కార్యక్రమాల్లో భాగంగా ర్యాలీలు, అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో జేసీ–2 నాగేశ్వరరావు, రాజంపేట ఆర్డీఓ ప్రభాకర్‌పిళ్లై, జిల్లా లీగల్ సర్వీస్‌సెక్రటరీ ప్రసాద్, డీఎస్పీ అశోక్‌కుమార్, ఐసీడీఎస్ పీడీ రాఘవరావు, చైల్డ్ వెల్ఫేర్ అసోసియేషన్ చైర్మన్ శారద తదితరులు పాల్గొన్నారు.