రావెల.. అలా ఎలా!
Published Sat, Aug 13 2016 12:02 AM | Last Updated on Wed, Aug 29 2018 7:45 PM
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ(ఏపీఎస్‌డబ్లు్యఆర్‌ఈఐఎస్)లో డిప్యుటేషన్ పేరిట అడ్డగోలు బదిలీలకు తెర లేచింది. గురుకుల విద్యాలయాల్లో పని చేసే ప్రిన్సిపాళ్ళు, జూనియర్ లెక్చరర్లతో పాటు ఉపాధ్యాయులు అధికార పార్టీ నాయకుల సిఫార్సులతోనో.. లేదంటే బదిలీకి రూ.50 వేల నుంచి లక్ష వరకు డబ్బులు కొట్టి.. కోరుకున్న చోటుకు బదలీ చేయించుకుంటున్నారు. ఈ సంస్థ పరిధిలో ఉద్యోగుల సాధారణ బదిలీలకు జూన్ 10వ తేదీన జీవో నెంబర్ 102ను ప్రభుత్వం జారీ చేసింది. ఆ మేరకు జూన్ 19న ఉపాధ్యాయ, ఉపాధ్యాయేతర సిబ్బందికి జోనల్ వారీగా బదిలీలు నిర్వహించారు. జోన్–1(విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం)లో 38 మంది అర్హుల జాబితాను ప్రకటించగా.. జీవోలో నిబంధనలకు అనుగుణంగా అన్ని అర్హతలు ఉన్న 9 మందిని మాత్రమే సంస్థ కార్యదర్శి వి.రాములు బదిలీ చేశారు.
ఇవన్నీ పారదర్శకంగానే జరిగినా.. ఆ తర్వాతే అసలు కథకు తెరలేచింది.
డిప్యుటేషన్ల పేరిట ఇష్టారాజ్యంగా...
సాధారణ బదిలీల్లో అవకాశం రాని వారికి డిఫు్యటేషన్ పేరిట కోరుకున్న చోటకు బదలీ చేసే తతంగానికి పాలకులు శ్రీకారం చుట్టారు. ఈ మేరకు ఏపీఎస్‌డబ్లు్యఆర్‌ఈఐఎస్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్న రాష్ట్ర సాంఘిక, సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు గత వారం ఉత్తర్వులు జారీ చేశారు. అదే అదనుగా విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల పరిధిలోని గురుకుల ఉపాధ్యాయులు కావాల్సిన చోటుకు బదిలీ చేయించుకుంటున్నారు. శుక్రవారం నాటికి జోన్–1 పరిధిలో 18 మందికి బదిలీ కాగా, వాటిలో పది ట్రాన్స్‌ఫర్లు నిబంధనలకు పూర్తి విరుద్ధంగా జరిగాయనే వాదనలు వినిపిస్తున్నాయి.
మచ్చుకు కొన్ని..
∙శ్రీకాకుళం జిల్లా ఉంగరాడమెట్ట గురుకులంలో ఫిజిక్స్ లెక్చరర్‌గా పనిచేస్తున్న రంగారావును విశాఖ జిల్లా సబ్బవరానికి డిఫు్యటేషన్ పేరిట బదిలీ చేశారు. ఉంగరాడ మెట్టలో లెక్చరర్ల కొరత ఉన్నప్పటికీ కేవలం ఓ ప్రజాప్రతినిధి సిఫారసు మేరకు విశాఖకు బదిలీ చేసేశారు.
∙విజయనగరం జిల్లా గరుగుబిల్లి కళాశాల ప్రిన్సిపాల్ మాణిక్యాన్ని విశాఖ జిల్లా యలమంచిలి మండలం కొక్కిరాపల్లి గురుకులానికి బదిలీ చేశారు. వాస్తవానికి ఆయనకు అక్కడ మూడేళ్ల సర్వీసు పూర్తి కాలేదు. అయినా నిబంధనలకు విరుద్ధంగా డిప్యుటేషన్ సాకుతో బదిలీ చేశారు.
∙విజయనగరం జిల్లా బాడంగిలో బోటనీ లెక్చరర్‌గా పనిచేస్తున్న రాణిశ్రీని చీపురుపల్లికి బదిలీ చేశారు. వాస్తవానికి చీపురుపల్లిలో స్వర్ణలత అనే మరో లెక్చరర్ పనిచేస్తున్నారు. ఇక్కడ ఖాళీ లేనప్పటికీ రాణిశ్రీని బదిలీ చేయడం చూస్తుంటే ఈ ప్రక్రియ ఎంత పారదర్శకంగా జరిగిందో అర్ధమవుతుంది.
∙శ్రీకాకుళం జిల్లా మందసలో పనిచేస్తున్న ఇంగ్లిష్ జూనియర్ లెక్చరర్ ఎం.వి.కె శేషాద్రిని అదే జిల్లా తామరాపల్లి బాలికల కళాశాలకు బదిలీ చేశారు. ఇక్కడ కూడా కాంట్రాక్ట్ పద్ధతిలో మహిళా టీచర్ పని చేస్తున్నప్పటికీ నిబంధనలను బేఖాతరు చేస్తూ శేషాద్రిని బదిలీ చేశారు.
∙పదోన్నతులు పొందిన వారిని రెండేళ్ల పాటు పనిచేస్తున్న చోట నుంచి బదలీ చేయకూడదన్న నిబంధనలున్నాయి. కానీ ఐదు నెలల కిందట పదోన్నతి పొందిన శ్రీకాకుళం జిల్లా భామిని ఇంగ్లిష్ లెక్చరర్ శ్రీహరిని విజయనగరం జిల్లా వేపాడకు బదిలీ చేశారు.
∙మందసలోనే పనిచేస్తున్న ఫిజిక్స్ లెక్చరర్ డి.మన్మధరావును ఎచ్చెర్లకు బదిలీ చేశారు.
డబ్బులు వెదజల్లే అర్థబలం, అధికార పార్టీ నేతల పలుకుబడి ఉన్న మాస్టార్లను ఇలా ఇష్టారాజ్యంగా కోరుకున్న చోటకు బదిలీ చేసే ప్రసహనం మునుపెన్నడూ చోటుచేసుకోలేదన్న వాదనలు ఉపాధ్యాయవర్గాల నుంచే వినిపిస్తున్నాయి.
Advertisement