అనంతపురం ఎడ్యుకేషన్ : వివిధ కారణాల వల్ల పదో తరగతి, ఇంటర్ మధ్యలో మానేసి, చదువుకోలేని వారు ఓపెన్ స్కూల్ (సార్వత్రిక విద్యా పీఠం) ద్వారా మళ్లీ చదువుకోవచ్చని జిల్లా విద్యాశాఖ అధికారి పగడాల లక్ష్మీనారాయణ తెలిపారు. శుక్రవారం స్థానిక ఉపాధ్యాయ భవనంలో స్టడీ సెంటర్ల కోఆర్డినేటర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ అభ్యర్థులు తమ పనులు చేసుకుంటూ సార్వత్రిక విద్యా పీఠం ద్వారా పదో తరగతి, ఇంటర్ పూర్తి చేయొచ్చన్నారు. నిర్ణీత ఫీజులు మాత్రమే వసూలు చేయాలన్నారు. ఇంటర్‌లో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్‌ఈసీ గ్రూపులు అందుబాటులో ఉన్నాయన్నారు.
ఈ ఏడాది ఆగస్టు 31 నాటికి 14 ఏళ్లు నిండిన వారు పదో తరగతికి అర్హులన్నారు. అలాగే 15 ఏళ్లు నిండిన వారు ఇంటర్‌లో చేరేందుకు అర్హులని చెప్పారు. ఈనెల 31 వరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ప్రవేశ ఫీజులు చెల్లించాలని సూచించారు. పదో తరగతికి ఓసీ, జనరల్ పురుషులు రూ. 1500, ఇంటర్‌కు రూ. 1700, స్త్రీలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, వికలాంగ అభ్యర్థులు రూ.1100, ఇంటర్‌కు 1400 చెల్లించాలన్నారు. మీసేవా, ఏపీ ఆన్‌లైన్‌లోనే ప్రవేశ ఫీజులు చెల్లించాలని స్పష్టం చేశారు.
సర్వశిక్ష అభియాన్ ప్రాజెక్ట్ ఆఫీసర్ సుబ్రమణ్యం మాట్లాడుతూ వివిధ కారణాల వల్ల చదువుకోలేక పోయిన వారికి ఓపెన్ స్కూల్ చాలా అనుకూలమన్నారు. అయితే ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేయకుండా ప్రభుత్వం నిర్ణయించిన మేరకే వసూలు చేయాలని సూచించారు. సమావేశంలో ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ గోవింద్‌నాయక్, ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ గంధం శ్రీనివాసులు, హెచ్‌ఎం అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి జయరామిరెడ్డి, ఎస్‌ఎస్‌ఏ అసిస్టెంట్ సీఎంఓ రామగిరి కిష్టప్ప పాల్గొన్నారు.
‘ఓపెన్’ తో మళ్లీ చదువుకోండి
Published Fri, Aug 11 2017 10:19 PM | Last Updated on Wed, Sep 18 2019 2:52 PM
Advertisement