open schools
-
అలాగైతే బడులు తెరవచ్చు!
న్యూఢిల్లీ: కరోనా పాజిటివిటీ రేటు 5 శాతం కన్నా తక్కువ ఉన్న జిల్లాల్లో బడులను తెరవచ్చని కేంద్రం నూతన మార్గదర్శకాలు జారీ చేసింది. అయితే ఈ విషయంలో అంతిమ నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వాలదేనని తెలిపింది. దేశంలో కరోనా పరిస్థితులు మెరుగుపడుతున్నాయని, కొత్త కేసులు స్థిరంగా తగ్గుతున్నాయని నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ చెప్పారు. అందుకే బడులు తెరవడంపై మార్గదర్శకాలు విడుదల చేశామన్నారు. దేశంలో ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అరుణాచల్‌ప్రదేశ్, లక్షద్వీప్, మధ్యప్రదేశ్, సిక్కిం, కర్ణాటక, త్రిపుర, తమిళనాడు, గోవా, మణిపూర్ సహా 11 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో మాత్రమే పాఠశాలలు పూర్తిస్థాయిలో తెరుచుకున్నట్టు కేంద్ర విద్యాశాఖ సంయుక్త కార్యదర్శి స్వీటీ ఛాంగ్సన్ చెప్పారు. అసోం, ఛత్తీస్‌గఢ్, చండీగఢ్, హరియాణా, హిమాచల్‌ప్రదేశ్, మిజోరం, రాజస్తాన్, ఉత్తరాఖండ్, మహారాష్ట్ర, మేఘాలయ, కేరళ, నాగాలాండ్, గుజరాత్, డామన్ డయ్యూ, అండమాన్ నికోబార్ దీవులు, పశ్చిమబెంగాల్ సహా 16 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో పాక్షికంగా తెరుచుకున్నాయని, బిహార్, ఉత్తర్‌ప్రదేశ్, పంజాబ్, పుదుచ్ఛేరి, జార్ఖండ్, లద్దాఖ్, జమ్మూకశ్మీర్, ఒడిశా, దిల్లీ తదితర 9 రాష్ట్రాల్లో ఇంకా పాఠశాలలు పునఃప్రారంభం కాలేదని చెప్పారు. చాలా రాష్ట్రాల్లో స్కూలు సిబ్బంది వ్యాక్సినేషన్ పూర్తికావచ్చిందన్నారు. ప్రస్తుతం దేశంలో 268 జిల్లాల్లో పాజిటివిటీ రేటు 5 శాతం కన్నా తక్కువ ఉందని పాల్ చెప్పారు. కరోనా వల్ల దేశీయ చిన్నారుల విద్యాభ్యాసం తీవ్రంగా దెబ్బతింటోందని అందరిలో ఆందోళన ఉందన్నారు. అందువల్ల సాధ్యమైనంత వరకు బడులు తెరిచేందుకు యత్నించాలన్నారు. పాఠశాలలకు నూతన మార్గదర్శకాలివే.. ► పిల్లల మధ్య 6 అడుగులు దూరం ఉండేలా తరగతుల్లో సీటింగ్ ఏర్పరచాలి. ► పాఠశాలలో పరిశుభ్ర వాతావరణం ఉంచుతూ, ఎప్పటికప్పుడు శానిటైజ్ చేయాలి. ► పాఠశాల బస్సులు/వ్యాన్లను ఎప్పటికప్పుడు శానిటైజ్ చేయాలి. ► విద్యార్థులు, సిబ్బంది అంతా మాస్కులు ధరించాలి. ► పిల్లలను స్కూళ్లకు పంపేందుకు వారి తల్లిదండ్రుల సమ్మతిని తీసుకొనేలా రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు చర్యలు చేపట్టాలి. ► ఒకవేళ తల్లిదండ్రులు ఆన్లైన్ తరగతులవైపే మొగ్గుచూపితే అందుకు అనుమతించాలి. ► ఇల్లులేని, వలస కూలీల పిల్లలు, కోవిడ్ సోకిన పిల్లలపై ప్రత్యేక దృష్టిసారించాలి. -
కశ్మీరంలో సడలుతున్న ఆంక్షలు
జమ్మూ/శ్రీనగర్: కశ్మీర్లో పరిస్థితులు మెరుగుపడుతున్నాయి. జమ్మూ, కశ్మీర్‌లోయలో ప్రజల రాకపోకలపై విధించిన ఆంక్షలను కేంద్రం శనివారం పాక్షికంగా సడలించింది. దీంతో పలువురు కశ్మీరీలు పక్క గ్రామాల్లోని తమ బంధువులు, కుటుంబ సభ్యులను కలుసుకున్నారు. ఆంక్షలను సడలించినా భద్రతాబలగాలు అప్రమత్తంగా ఉన్నాయి. కశ్మీర్‌లోని 35 పోలీస్స్టేషన్ల పరిధిలో ఆంక్షలను అధికారులు సడలించారు. కశ్మీర్ బయట ఉండే కుటుంబ సభ్యులతో ప్రజలు మాట్లాడేందుకు వీలుగా 17 టెలిఫోన్ ఎక్సే్ఛంజీల్లో సేవలను పునరుద్ధరించారు. ఈ విషయమై జమ్మూకశ్మీర్ ప్రభుత్వ అధికార ప్రతినిధి రోహిత్ కన్సాల్ మాట్లాడుతూ..‘కశ్మీర్ లోయలోని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రాథమిక పాఠశాలలు సోమవారం నుంచి ప్రారంభమవుతాయి’ అని తెలిపారు. కాగా, ప్రభుత్వం ఆంక్షలు సవరించినా పలు పెట్రోల్ బంకులు, ఇతర మార్కెట్లు శనివారం కూడా మూతపడ్డాయి. ఇంటర్నెట్, టెలిఫోన్ సేవల పునరుద్ధరణ జమ్మూలో శనివారం 5జిల్లాల్లో మొబైల్, ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరించారు. ఈ విషయమై రాష్ట్ర డీజీపీ మాట్లాడుతూ..‘2జీ ఇంటర్నెట్ సర్వీసులను పునరుద్ధరించాం. ఈ సందర్భంగా ఇంటర్నెట్ సేవలను ఎవరైనా దుర్వినియోగం చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాం’ అని హెచ్చరించారు. ప్రస్తుతానికి త్రీజీ, 4జీ సేవలపై ఆంక్షలను సడలించడం లేదని స్పష్టం చేశారు. మరోవైపు ఉగ్రవాదులు త్వరలోనే దాడిచేసే అవకాశముందని నిఘావర్గాల నుంచి తమకు సమాచారం అందిందని జమ్మూకశ్మీర్ సీఎస్ బీవీఆర్ సుబ్రహ్మణ్యం తెలిపారు. పాక్ కాల్పుల్లో జవాన్ మృతి కశ్మీర్‌లోని రాజౌరీ జిల్లాలో సరిహద్దులోని నియంత్రణ రేఖ(ఎల్వోసీ) వెంట ఉన్న గ్రామాలు, భారత ఆర్మీ పోస్టులు లక్ష్యంగా పాక్ బుల్లెట్ల వర్షం కురిపించింది. ఈ దుర్ఘటనలో డెహ్రాడూన్‌కు చెందిన జవాన్ లాన్స్‌నాయక్ సందీప్ థాపా(35) తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయారు. వెంటనే అప్రమత్తమైన భారత ఆర్మీ పాక్ దుశ్చర్యను దీటుగా తిప్పికొట్టిందని ఆర్మీ అధికార ప్రతినిధి శనివారం మీడియాకు చెప్పారు. -
బడి బలోపేతం
కరీంనగర్‌ఎడ్యుకేషన్: ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది. జిల్లాలో ఈనెల 14 నుంచి 19 వరకు ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని చేపట్టేందుకు జిల్లా విద్యాశాఖ పూర్తి ఏర్పాట్లు చేస్తోంది. రోజుకో కార్యక్రమం ద్వారా విద్యార్థుల సంఖ్యను పెంచడం, హాజరు , ఉత్తీర్ణత పరిశీలించడం, విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించడం, బాలకార్మికుల నమోదు, పాఠశాలల్లో పారిశుధ్య నిర్వహణ, ప్రత్యేక కేంద్రాల్లో చేరికకు విద్యార్థుల ఎంపిక, తదితర వాటిపై దృష్టిపెట్టనున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలను భాగస్వాములను చేయనున్నారు. ఆరు రోజులపాటు సాగనున్న బడిబాటకు కరపత్రాలు, బ్యానర్లతో విసృత ప్రచారం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం జిల్లా విద్యాశాఖ అధికారులను ఇప్పటికే ఆదేశించింది. ఈ కార్యక్రమం ద్వారా జిల్లాలోని అన్ని అవాస ప్రాంతాల్లోని బడిఈడు పిల్లలను గుర్తించి సమీప ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలి. ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్రోల్మెంట్ పెంచి నాణ్యమైన విద్యను అందించడం, ప్రభుత్వ పాఠశాలల్లో సమాన భాగస్వామ్యంతో బలోపేతం చేయడం, అంగన్వాడీ కేంద్రాల్లో ఐదేళ్లు నిండిన బాలబాలికలను సమీపంలో ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించడం, గ్రామ విద్య రిజిస్టర్ అప్లోడ్ చేయడం, ప్రాథమిక పాఠశాలల్లో 5వ తరగతి పూర్తి చేసుకున్న వారిని ప్రాథమికోన్నత పాఠశాలల్లో, ప్రాథమిక పాఠశాలలో 7వ తరగతి పూర్తి చేసిన విద్యార్థులను ఉన్నత పాఠశాలల్లో చేర్పించి నూరుశాతం ఎన్రోల్మెంట్ పూర్తి చేయడం, తక్కువ ఎన్రోల్ ఉన్న పాఠశాలలను గుర్తించి తల్లిదండ్రుల భాగస్వామ్యంతో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు ప్రణాళిక రూపొందించనున్నారు. బాలిక విద్య ప్రాముఖ్యతను తల్లిదండ్రులకు వివరించి బాలికలను పాఠశాలల్లో చేర్పించడం వంటి కార్యక్రమాల ద్వారా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయనుంది. నిధులు మంజూరు... బడిబాట కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలకు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ నుంచి నిధులను మంజూరు చేస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. ప్రచార సామగ్రి, ప్రగతి నివేదికలు, బ్యానర్లు వంటి వాటికి ఒక్కో పాఠశాలకు రూ.1000 చొప్పున డీఈవోల నుంచి ఎంఈవోలకు ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలోని 620 పాఠశాలలకు రూ.6,20,000 మంజూరు చేసింది. ఆంగ్ల మాధ్యమంపై విస్తృత ప్రచారం... ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన చేస్తున్నట్లు విసృతంగా ప్రచారం చేయాలని విద్యా కమిటీలకు ఇప్పటికే జిల్లా విద్యాశాఖ నుంచి ఆదేశాలు అందాయి. ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన విద్యతోపాటు అన్ని రకాల వసతులు ఏర్పాటు చేస్తున్నట్లు విసృతంగా ప్రచారం చేపట్టడంతోపాటు కొత్తగా ఆంగ్ల మాధ్యమ తరగతులను ప్రారంభించే విషయాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేసి ప్రభుత్వ పాఠశాలల్లో బడిబయట ఉన్న పిల్లల నమోదును పెద్ద ఎత్తున పెంచేందుకు విద్యాశాఖ సమాయత్తమవుతుంది. రోజువారీ బడిబాట కార్యక్రమాలు... 14వ తేదీన బడిబాట ప్రాధాన్యతను గుర్తించేలా అవాస పాఠశాలలను అందంగా అలంకరించాలి. గ్రామంలో ర్యాలీ నిర్వహించి కరపత్రాలను పంచాలి. విద్యార్థులతో ‘మన పాఠశాల మన గ్రామం’ నినాదంతో ప్రచారం. పాఠశాల పనితీరుపట్ల తల్లిదండ్రులకు అవగాహన కల్పించడం. 15వ తేదీన పాఠశాలల్లో బాలికలకు బాలిక విద్యపట్ల ప్రత్యేక అవగాహన కల్పించడం. బాలికల జీవనైపుణ్యం పెంపొందించేలా కార్యక్రమాలు. 16న సామూహిక అక్షరాభ్యాసం, పిల్లల తల్లిదండ్రులతో సమావేశం, ఉన్నత పాఠశాలల్లో నూతనంగా చేరిన విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించడం. 17న స్వచ్చ పాఠశాలలో భాగంగా తరగతి గదులను, మరుగుదొడ్లను, పాఠశాల ఆవరణను శుభ్రం చేసుకోవడం, చెట్ల సంరక్షణ, చెట్లకు నీరుపోయడం, చెట్ల బాధ్యతను విద్యార్థులకు అప్పగించడం. 18న బాలకార్మికులకు గుర్తించి పాఠశాలల్లో చేర్పించడం, అవసరమైతే బాల కార్మిక నిర్మూలనాధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానికా«ధికారులను భాగస్వామ్యులు చేయడం. పాఠశాల యాజమాన్య కమిటితో సమావేశం నిర్వహించాలి. 19న ప్రభుత్వ పాఠశాలల ప్రత్యేకతలపై ప్రచారం... మాతృభాష, ఆంగ్ల భాషలో విద్యాబోధన, డిజిటల్ తరగతి గదులు, నాణ్యమైన విద్య, నిరంతర సమగ్ర మూల్యాంకనం, ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫాం, పాఠశాల యాజమాన్య కమిటి ఏర్పాటు. రవాణా భత్యం, స్కాలర్షిప్లు, ఎస్కార్ట్ అలవెన్స్‌లపై అవగాహన కల్పిస్తారు. ప్రత్యేక శ్రద్ధ చూపాలి జిల్లాలో బడిబాట కార్యక్రమాన్ని ఈనెల 14 నుంచి 19 వరకు విజయవంతంగా నిర్వహించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. విద్యాకమిటీల భాగస్వామ్యంతో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, మండలస్థాయి అధికారులను, స్వచ్ఛంద సంస్థలను, మహిళ సంఘాలను, యువతను సమావేశాలకు ఆహ్వానించి విద్యార్థుల సంఖ్యను పెంచేలా కృషి చేయాలి. ఈమేరకు ప్రధానోపాధ్యాయులకు ఆదేశాలు జారీ చేశాం. – వెంకటేశ్వర్లు, డీఈవో, కరీంనగర్ -
‘ఓపెన్’ తో మళ్లీ చదువుకోండి
అనంతపురం ఎడ్యుకేషన్ : వివిధ కారణాల వల్ల పదో తరగతి, ఇంటర్ మధ్యలో మానేసి, చదువుకోలేని వారు ఓపెన్ స్కూల్ (సార్వత్రిక విద్యా పీఠం) ద్వారా మళ్లీ చదువుకోవచ్చని జిల్లా విద్యాశాఖ అధికారి పగడాల లక్ష్మీనారాయణ తెలిపారు. శుక్రవారం స్థానిక ఉపాధ్యాయ భవనంలో స్టడీ సెంటర్ల కోఆర్డినేటర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ అభ్యర్థులు తమ పనులు చేసుకుంటూ సార్వత్రిక విద్యా పీఠం ద్వారా పదో తరగతి, ఇంటర్ పూర్తి చేయొచ్చన్నారు. నిర్ణీత ఫీజులు మాత్రమే వసూలు చేయాలన్నారు. ఇంటర్లో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్ఈసీ గ్రూపులు అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ ఏడాది ఆగస్టు 31 నాటికి 14 ఏళ్లు నిండిన వారు పదో తరగతికి అర్హులన్నారు. అలాగే 15 ఏళ్లు నిండిన వారు ఇంటర్లో చేరేందుకు అర్హులని చెప్పారు. ఈనెల 31 వరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ప్రవేశ ఫీజులు చెల్లించాలని సూచించారు. పదో తరగతికి ఓసీ, జనరల్ పురుషులు రూ. 1500, ఇంటర్‌కు రూ. 1700, స్త్రీలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, వికలాంగ అభ్యర్థులు రూ.1100, ఇంటర్‌కు 1400 చెల్లించాలన్నారు. మీసేవా, ఏపీ ఆన్లైన్లోనే ప్రవేశ ఫీజులు చెల్లించాలని స్పష్టం చేశారు. సర్వశిక్ష అభియాన్ ప్రాజెక్ట్ ఆఫీసర్ సుబ్రమణ్యం మాట్లాడుతూ వివిధ కారణాల వల్ల చదువుకోలేక పోయిన వారికి ఓపెన్ స్కూల్ చాలా అనుకూలమన్నారు. అయితే ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేయకుండా ప్రభుత్వం నిర్ణయించిన మేరకే వసూలు చేయాలని సూచించారు. సమావేశంలో ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ గోవింద్‌నాయక్, ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ గంధం శ్రీనివాసులు, హెచ్ఎం అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి జయరామిరెడ్డి, ఎస్ఎస్ఏ అసిస్టెంట్ సీఎంఓ రామగిరి కిష్టప్ప పాల్గొన్నారు. -
ఒపెన్ స్కూల్ ఫలితాలు విడుదల
– పదిలో 41.67, ఇంటర్లో 54.43 శాతం ఉత్తీర్ణత – గతేడాది కంటే మెరుగైన ఫలితాలు కర్నూలు సిటీ: ఒపెన్ స్కూల్ పరీక్షల ఫలితాలను మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు గురువారం రాత్రి విడుదల చేశారు. ఈ ఏడాది ఏప్రిల్ నెల 12వ తేదీ నుంచి 23వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించారు. పదవ తరగతి పరీక్షలకు 2839 మంది హాజరుకాగా, 1183 మంది ( 41.67 శాతం) ఉత్తీర్ణులయ్యారు. పది ఫలితాల్లో గతేడాది రాష్ట్రంలో12వ స్థానంలో ఉన్న జిల్లా ఈసారి రాష్ట్రంలో 9వ స్థానం దక్కించుకుంది. ఇంటర్లో 3399 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 1850 మంది (54.43 శాతం) ఉత్తీర్ణత సాధించి, 9వ స్థానంలో నిలిచారు. గతేడాది 11వ స్థానంలో ఉన్నట్లు ఒపెన్ స్కూల్ అధికార వర్గాలు తెలిపాయి. రీకౌంటింగ్‌కు అవకాశం! ఒపెన్ స్కూల్స్ పరీక్షల్లో వచ్చిన ఫలితాలపై అనుమానాలు ఉంటే రీకౌంటింగ్‌కు అవకాశం కల్పించారు. పదోతరగతికి సంబంధించి ఒక్కో సబ్జెక్టుకు ఫీజు రూ.100 చొప్పున, ఇంటర్ అయితే రూ.200 చొప్పున చెల్లించాలి. అదే రీవెరిఫికేషన్కైతే ఒక్కో సబ్జెక్టుకు 1000 ప్రకారం ఫీజులు ఏపీ ఆన్లైన్లో చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకు ఈ నెల 5 నుంచి 15 వరకు విద్యాశాఖ గడువు ఇచ్చింది. -
విద్యాశాఖలో బిగుస్తున్న ఉచ్చు!
► ఓపెన్ స్కూల్‌పై గుప్పుమన్న అవినీతి ఆరోపణలు ► ఆర్జేడీ విచారణలో అనేక అంశాలు వెలుగులోకి.. ► నాటి డీఈవో సుప్రకాష్ సహా విచారణకు పలువురు ► ప్రాథమిక విచారణతోపాటు రికార్డుల పరిశీలన ► గత డీఈవోల వ్యవహారంపై ప్రత్యేక దృష్టి ► 15 రోజుల్లో కమిషనర్‌కు నివేదిక సమర్పిస్తామన్న ఆర్జేడీ ఒంగోలు: విద్యాశాఖలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై ఉచ్చు బిగుస్తోంది. ఆశాఖ కమిషనర్ ఆదేశాల మేరకు గుంటూరు ఆర్జేడీ కె.శ్రీనివాసరెడ్డి సోమవారం స్థానిక జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో అవినీతి ఆరోపణలపై విచారణ నిర్వహించారు. ఈ క్రమంలో భాగంగానే ఓపెన్ స్కూల్‌పైనే ఎక్కువగా ఫిర్యాదులు వచ్చినట్లు సమాచారం. ఆర్జేడీ, ఆర్జేడీ కార్యాలయ అధికారులు ఈమేరకు అప్పటి డీఈవో సుప్రకాష్తోపాటు ఏపీ ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ చెల్లి ఆనందరావు, వ్యాయామ ఉపాధ్యాయులు, ఎయిడెడ్ పాఠశాల కరస్పాండెంట్, ఎంఈవో, జెడ్పీ పరిషత్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్, ఒక అటెండర్ నుంచి స్టేట్మెంట్స్ తీసుకుని, విచారణ చేశారు. ఆరోపణ ఇదీ...: జిల్లా విద్యాశాఖ అధికారిగా పనిచేసిన డీఈవో సుప్రకాష్ అవినీతికి పాల్పడ్డారంటూ విద్యాశాఖ కమిషనర్ కార్యాలయానికి లేఖ వెళ్లింది. ఇందులో ప్రధానంగా అవినీతి డబ్బులతో అధికారులకు కార్లు కొనిచ్చారంటూ ఫిర్యాదులో పేర్నొన్నారు, అంతే కాకుండా అధికారుల పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడుతూ ఉద్యోగులను భయభ్రాంతులకు గురిచేశారని పలు ఆరోపణలు ఉన్నాయి. దానిపై గుంటూరు ఆర్జేడీని కమిషనర్ విచారణ అధికారిగా నియమించారు. దీంతో ఆయన గత నెల 22న విచారణకు హాజరుకావాలంటూ డి.వి.సుప్రకాష్తోపాటు ఎయిడెడ్ స్కూల్ కరస్పాండెంట్‌ను, ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ చెల్లి ఆనందరావును, సి.ఎస్.పురం హెడ్మాస్టర్ను, పామూరు ఎంఈవో నాగేంద్రవదన్, పీఈవో సాయిశ్రీధర్, ఒంగోలు ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ రామకృష్ణ, స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి వై.శీనయ్య, మద్దిపాడు ప్రభుత్వ ఉన్నత పాఠశాల రికార్డు అసిస్టెంట్ ఆదిశేషు తదితరులను విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. ఈ మేరకు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సుప్రకాష్‌ను ఆర్జేడీ ప్రత్యేకంగా విచారించారు. ఆయనను అసిస్టెంట్ డైరెక్టర్ ఛాంబరులో విచారించి స్టేట్మెంట్ తీసుకున్నారు. ఉచ్చు ఇలా..: విచారణకు హాజరైన వారిని పరిశీలిస్తే వారిలో ఎక్కువమంది బా«ధ్యతలు ఒకచోట...విధులు మరోచోట నిర్వహిస్తున్నవారే ఉన్నారు. డీఈవోకు అనుకూలంగా వ్యవహరిస్తూ ఆయనకు మామూళ్లు పెద్ద ఎత్తున వసూలుచేసి పెట్టేందుకే పనిచేశారనేది ప్రధానమైన ఆరోపణ. ఈ విషయంపై ‘మీ పోస్టింగ్ ఎక్కడ, మీరు మీ విధులకు గైర్హాజరై డీఈవో కార్యాలయం చుట్టూ ఎందుకు తిరిగారు, విధులకు డుమ్మా కొట్టినా మీకు జీతాలు ఎలా వచ్చాయి, అందుకు ఎవరు సహకరించారు’ అంటూ పలు ప్రశ్నల పరంపర గుప్పించారు. డిప్యుటేషన్ ఆర్డర్లు ఏమైనా ఇచ్చారా అంటూ వాటిని చూపించాలని కోరారు. కోటిరెడ్డి అనే వ్యాయామ ఉపాధ్యాయునికి సంబంధించి సిఎస్పురం మండలంలో కోటిరెడ్డి పనిచేసే ప్రధానోపాధ్యాయుడు డేవిడ్ రికార్డులతో హాజరుకావాల్సి వచ్చింది. ఈ సందర్భంగా కోటిరెడ్డికి సంబంధించి 2013 నుంచి ఆయన విధులకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి వై.శీనయ్యకు సంబంధించి ఈతముక్కల హెడ్మాస్టర్ను సైతం విచారణకు ఆహ్వానించి రికార్డులను పరిశీలించారు. రెండేళ్లకుపైగా ఎలా ఎస్జీఎఫ్ సెక్రటరీగా పనిచేస్తున్నారంటూ ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో కార్లు ఎలా కొనివ్వగలిగారు, కార్ల నెంబర్లు, అవి ప్రస్తుతం ఎవరి వద్ద ఉన్నాయి తదితర అంశాలపై కూడా లోతుగా విచారణ చేశారు. -
ప్రైవేటు ‘పది’కి స్వస్తి..!
సీసీఈలో ఇంటర్నల్ మార్కుల కేటాయింపు ఫలితం ఇకపై ఓపెన్ స్కూల్ విధానమొక్కటే మార్గం ఈ నెల 30 వరకు దరఖాస్తుల స్వీకరణ శ్రీకాకుళం : పాఠశాలకు వెళ్లకుండా ప్రైవేటుగా పదో తరగతి పరీక్షలకు హాజరుకావడం ఇక కుదరదు. గతంలో పరీక్ష ఫీజు చెల్లించి నేరుగా పదో తరగతి పబ్లిక్ పరీక్షలు రాసేవారు. ఇకపై ఆ విధానానికి ప్రభుత్వం స్వస్తి పలికింది. నిరంతర సమగ్ర మూల్యాంకనం (కాంప్రహెన్సివ్ కంటిన్యూవస్ ఎవాల్యూషన్ (సీసీఈ) ఫలితంగా పదో తరగతిలో ప్రైవేటు స్టడీ ఫుల్స్టాప్ పడింది. వచ్చే ఏడాది మార్చిలో జరిగే పదో తరగతి పబ్లిక్ పరీక్షల నుంచే నూతన విధానం అమల్లోకి రానుంది. ఈ మేరకు ప్రభుత్వం ఇటీవలే ఆదేశాలను జారీ చేసిందని విద్యాశాఖాధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రైవేట్ స్టడీ చేద్దామనుకున్న విద్యార్థులకు ఇకపై ఓపెన్ స్కూల్ విధానం ఒక్కటే మార్గం. సీసీఈ ఎఫెక్ట్.. ఈ ఏడాది నుంచి రాష్ట్ర ప్రభుత్వం 6 నుంచి 10వ తరగతి వరకు నిర్వహించే పరీక్షల్లో సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా నిరంతర సమగ్ర మూల్యాంకన విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ఇందులో అంతర్గత, బహిర్గత మూల్యాంకనాలున్నాయి. బహిర్గత మూల్యాంకనంలో ప్రతి సబ్జెక్టులో 80 మార్కులకు రాత పరీక్ష నిర్వహిస్తారు. అంతర్గత మూల్యాంకనానికి 20 మార్కులుంటాయి. విద్యార్థికి ఏడాది పొడవునా నిర్వహించే ఫార్మేటీవ్, సమ్మేటీవ్ పరీక్షలు, రికార్డులు, ప్రాజెక్టులు, ఇతర బోధనాంశాల నుంచి అంతర్గత మూల్యాంకనంలో 20 మార్కులు కేటాయిస్తారు. అయితే ప్రైవేట్ స్టడీ అభ్యర్థులకు ఇంటర్నల్ మార్కులు వేసేందుకు వీలు పడదు. వీరు ఏకంగా పబ్లిక్ పరీక్షలకు హాజరవుతుండడంతో ఇబ్బందులు నెలకొంటున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వం ఏకంగా పదో తరగతిలో ప్రైవేట్ స్టడీ విధానాన్ని రద్దు చేసింది. ఓపెన్ స్కూలే దిక్కు.. జిల్లాలో ఏటా 3500 నుంచి 4500 మంది విద్యార్థులు ప్రైవేట్ స్టడీ విధానంలో పదో తరగతి పరీక్షలకు హాజరవుతున్నారు. ప్రస్తుతం ఈ విధానాన్ని ప్రభుత్వం రద్దు చేయడంతో ఇలాంటి విద్యార్థులకు ఓపెన్ స్కూల్ ఒక్కటే దిక్కుగా మారింది. లేదంటే రెగ్యులర్‌గా చదవాల్సిన పరిస్థితి. ఈ ఏడాదికి సంబంధించి ఓపెన్ స్కూల్ ద్వారా పదో తరగతిని చదివేందుకు ఈ నెల 30 వరకు దరఖాస్తులకు అవకాశం ఉంది. మరిన్ని వివరాలకు సమీప అధ్యయన కేంద్రాలు, డీఈఓ కార్యాలయంలో సంప్రదించవచ్చు. -
ఓపెన్ స్కూల్ అడ్మిషన్ల గడువు పొడిగింపు
అనంతపురం ఎడ్యుకేషన్ : సార్వత్రిక విద్యా పీఠం (ఓపెన్ స్కూల్) ద్వారా 2016–17 సంవత్సరంలో పదోతరగతి, ఇంటర్మీడియట్ కోర్సుల ప్రవేశానికి అపరాధ రుసుం లేకుండా ఫీజు చెల్లించేందుకు ఈ నెల 10 వరకు గడువు పెంచినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి అంజయ్య, ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ గంధం శ్రీనివాసులు ఓ ప్రకటనలో తెలిపారు. -
ఓపెన్ స్కూల్స్‌కు గడువు పెంపు
అమలాపురం టౌన్ : పదో తరగతి, ఇంటర్మీడియట్ ప్రవేశాలకు అపరాధ రుసుం లేకుండా ఈ నెల 30 వరకూ గడువు పెంచినట్లు ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం (ఓపెన్ స్కూలు) జిల్లా కో ఆర్డినేటర్ జనార్దనరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ అవకాశాన్ని జిల్లాలోని సెంటర్ల కో ఆర్డినేటర్లు, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వివరాలకు అమలాపురం రవీంద్ర మహర్షి విద్యాసంస్థల అధినేత గిడుగు నాగేశ్వరరావును సంప్రదించాలని పేర్కొన్నారు. ప్రవేశాల కోసం 9640335777, 9347357755 ఫోన్ నంబర్లను సంప్రదించాలని జనార్దనరావు సూచించారు.