శ్రీనగర్‌లో ఫోన్ మాట్లాడుతున్న స్థానికులు
జమ్మూ/శ్రీనగర్: కశ్మీర్‌లో పరిస్థితులు మెరుగుపడుతున్నాయి. జమ్మూ, కశ్మీర్‌లోయలో ప్రజల రాకపోకలపై విధించిన ఆంక్షలను కేంద్రం శనివారం పాక్షికంగా సడలించింది. దీంతో పలువురు కశ్మీరీలు పక్క గ్రామాల్లోని తమ బంధువులు, కుటుంబ సభ్యులను కలుసుకున్నారు. ఆంక్షలను సడలించినా భద్రతాబలగాలు అప్రమత్తంగా ఉన్నాయి. కశ్మీర్‌లోని 35 పోలీస్‌స్టేషన్ల పరిధిలో ఆంక్షలను అధికారులు సడలించారు. కశ్మీర్ బయట ఉండే కుటుంబ సభ్యులతో ప్రజలు మాట్లాడేందుకు వీలుగా 17 టెలిఫోన్ ఎక్సే్ఛంజీల్లో సేవలను పునరుద్ధరించారు. ఈ విషయమై జమ్మూకశ్మీర్ ప్రభుత్వ అధికార ప్రతినిధి రోహిత్ కన్సాల్ మాట్లాడుతూ..‘కశ్మీర్ లోయలోని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రాథమిక పాఠశాలలు సోమవారం నుంచి ప్రారంభమవుతాయి’ అని తెలిపారు. కాగా, ప్రభుత్వం ఆంక్షలు సవరించినా పలు పెట్రోల్ బంకులు, ఇతర మార్కెట్లు శనివారం కూడా మూతపడ్డాయి.
ఇంటర్నెట్, టెలిఫోన్ సేవల పునరుద్ధరణ
జమ్మూలో శనివారం 5జిల్లాల్లో మొబైల్, ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరించారు. ఈ విషయమై రాష్ట్ర డీజీపీ మాట్లాడుతూ..‘2జీ ఇంటర్నెట్ సర్వీసులను పునరుద్ధరించాం. ఈ సందర్భంగా ఇంటర్నెట్ సేవలను ఎవరైనా దుర్వినియోగం చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాం’ అని హెచ్చరించారు. ప్రస్తుతానికి త్రీజీ, 4జీ సేవలపై ఆంక్షలను సడలించడం లేదని స్పష్టం చేశారు. మరోవైపు ఉగ్రవాదులు త్వరలోనే దాడిచేసే అవకాశముందని నిఘావర్గాల నుంచి తమకు సమాచారం అందిందని జమ్మూకశ్మీర్ సీఎస్ బీవీఆర్ సుబ్రహ్మణ్యం తెలిపారు.
పాక్ కాల్పుల్లో జవాన్ మృతి
కశ్మీర్‌లోని రాజౌరీ జిల్లాలో సరిహద్దులోని నియంత్రణ రేఖ(ఎల్వోసీ) వెంట ఉన్న గ్రామాలు, భారత ఆర్మీ పోస్టులు లక్ష్యంగా పాక్ బుల్లెట్ల వర్షం కురిపించింది. ఈ దుర్ఘటనలో డెహ్రాడూన్‌కు చెందిన జవాన్ లాన్స్‌నాయక్ సందీప్ థాపా(35) తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయారు. వెంటనే అప్రమత్తమైన భారత ఆర్మీ పాక్ దుశ్చర్యను దీటుగా తిప్పికొట్టిందని ఆర్మీ అధికార ప్రతినిధి శనివారం మీడియాకు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment