విద్యాశాఖలో బిగుస్తున్న ఉచ్చు!
► ఓపెన్ స్కూల్‌పై గుప్పుమన్న అవినీతి ఆరోపణలు
► ఆర్జేడీ విచారణలో అనేక అంశాలు వెలుగులోకి..
► నాటి డీఈవో సుప్రకాష్ సహా విచారణకు పలువురు
► ప్రాథమిక విచారణతోపాటు రికార్డుల పరిశీలన
► గత డీఈవోల వ్యవహారంపై ప్రత్యేక దృష్టి
► 15 రోజుల్లో కమిషనర్‌కు నివేదిక సమర్పిస్తామన్న ఆర్జేడీ
ఒంగోలు: విద్యాశాఖలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై ఉచ్చు బిగుస్తోంది. ఆశాఖ కమిషనర్ ఆదేశాల మేరకు గుంటూరు ఆర్జేడీ కె.శ్రీనివాసరెడ్డి సోమవారం స్థానిక జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో అవినీతి ఆరోపణలపై విచారణ నిర్వహించారు. ఈ క్రమంలో భాగంగానే ఓపెన్ స్కూల్‌పైనే ఎక్కువగా ఫిర్యాదులు వచ్చినట్లు సమాచారం. ఆర్జేడీ, ఆర్జేడీ కార్యాలయ అధికారులు ఈమేరకు అప్పటి డీఈవో సుప్రకాష్‌తోపాటు ఏపీ ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ చెల్లి ఆనందరావు, వ్యాయామ ఉపాధ్యాయులు, ఎయిడెడ్ పాఠశాల కరస్పాండెంట్, ఎంఈవో, జెడ్పీ పరిషత్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్, ఒక అటెండర్ నుంచి స్టేట్‌మెంట్స్ తీసుకుని, విచారణ చేశారు.
ఆరోపణ ఇదీ...: జిల్లా విద్యాశాఖ అధికారిగా పనిచేసిన డీఈవో సుప్రకాష్ అవినీతికి పాల్పడ్డారంటూ విద్యాశాఖ కమిషనర్ కార్యాలయానికి లేఖ వెళ్లింది. ఇందులో ప్రధానంగా అవినీతి డబ్బులతో అధికారులకు కార్లు కొనిచ్చారంటూ ఫిర్యాదులో పేర్నొన్నారు, అంతే కాకుండా అధికారుల పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడుతూ ఉద్యోగులను భయభ్రాంతులకు గురిచేశారని పలు ఆరోపణలు ఉన్నాయి. దానిపై గుంటూరు ఆర్జేడీని కమిషనర్ విచారణ అధికారిగా నియమించారు.
దీంతో ఆయన గత నెల 22న విచారణకు హాజరుకావాలంటూ డి.వి.సుప్రకాష్‌తోపాటు ఎయిడెడ్ స్కూల్ కరస్పాండెంట్‌ను, ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ చెల్లి ఆనందరావును, సి.ఎస్.పురం హెడ్‌మాస్టర్‌ను, పామూరు ఎంఈవో నాగేంద్రవదన్, పీఈవో సాయిశ్రీధర్, ఒంగోలు ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ రామకృష్ణ, స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి వై.శీనయ్య, మద్దిపాడు ప్రభుత్వ ఉన్నత పాఠశాల రికార్డు అసిస్టెంట్ ఆదిశేషు తదితరులను విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. ఈ మేరకు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సుప్రకాష్‌ను ఆర్జేడీ ప్రత్యేకంగా విచారించారు. ఆయనను అసిస్టెంట్ డైరెక్టర్ ఛాంబరులో విచారించి స్టేట్‌మెంట్ తీసుకున్నారు.
ఉచ్చు ఇలా..: విచారణకు హాజరైన వారిని పరిశీలిస్తే వారిలో ఎక్కువమంది బా«ధ్యతలు ఒకచోట...విధులు మరోచోట నిర్వహిస్తున్నవారే ఉన్నారు. డీఈవోకు అనుకూలంగా వ్యవహరిస్తూ ఆయనకు మామూళ్లు పెద్ద ఎత్తున వసూలుచేసి పెట్టేందుకే పనిచేశారనేది ప్రధానమైన ఆరోపణ. ఈ విషయంపై ‘మీ పోస్టింగ్ ఎక్కడ, మీరు మీ విధులకు గైర్హాజరై డీఈవో కార్యాలయం చుట్టూ ఎందుకు తిరిగారు, విధులకు డుమ్మా కొట్టినా మీకు జీతాలు ఎలా వచ్చాయి, అందుకు ఎవరు సహకరించారు’ అంటూ పలు ప్రశ్నల పరంపర గుప్పించారు. డిప్యుటేషన్ ఆర్డర్‌లు ఏమైనా ఇచ్చారా అంటూ వాటిని చూపించాలని కోరారు.
కోటిరెడ్డి అనే వ్యాయామ ఉపాధ్యాయునికి సంబంధించి సిఎస్‌పురం మండలంలో కోటిరెడ్డి పనిచేసే ప్రధానోపాధ్యాయుడు డేవిడ్ రికార్డులతో హాజరుకావాల్సి వచ్చింది. ఈ సందర్భంగా కోటిరెడ్డికి సంబంధించి 2013 నుంచి ఆయన విధులకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి వై.శీనయ్యకు సంబంధించి ఈతముక్కల హెడ్మాస్టర్‌ను సైతం విచారణకు ఆహ్వానించి రికార్డులను పరిశీలించారు. రెండేళ్లకుపైగా ఎలా ఎస్‌జీఎఫ్ సెక్రటరీగా పనిచేస్తున్నారంటూ ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో కార్లు ఎలా కొనివ్వగలిగారు, కార్ల నెంబర్లు, అవి ప్రస్తుతం ఎవరి వద్ద ఉన్నాయి తదితర అంశాలపై కూడా లోతుగా విచారణ చేశారు.