deo pagadala laxminarayana
-
‘ఓపెన్’ తో మళ్లీ చదువుకోండి
అనంతపురం ఎడ్యుకేషన్ : వివిధ కారణాల వల్ల పదో తరగతి, ఇంటర్ మధ్యలో మానేసి, చదువుకోలేని వారు ఓపెన్ స్కూల్ (సార్వత్రిక విద్యా పీఠం) ద్వారా మళ్లీ చదువుకోవచ్చని జిల్లా విద్యాశాఖ అధికారి పగడాల లక్ష్మీనారాయణ తెలిపారు. శుక్రవారం స్థానిక ఉపాధ్యాయ భవనంలో స్టడీ సెంటర్ల కోఆర్డినేటర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ అభ్యర్థులు తమ పనులు చేసుకుంటూ సార్వత్రిక విద్యా పీఠం ద్వారా పదో తరగతి, ఇంటర్ పూర్తి చేయొచ్చన్నారు. నిర్ణీత ఫీజులు మాత్రమే వసూలు చేయాలన్నారు. ఇంటర్లో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్ఈసీ గ్రూపులు అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ ఏడాది ఆగస్టు 31 నాటికి 14 ఏళ్లు నిండిన వారు పదో తరగతికి అర్హులన్నారు. అలాగే 15 ఏళ్లు నిండిన వారు ఇంటర్లో చేరేందుకు అర్హులని చెప్పారు. ఈనెల 31 వరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ప్రవేశ ఫీజులు చెల్లించాలని సూచించారు. పదో తరగతికి ఓసీ, జనరల్ పురుషులు రూ. 1500, ఇంటర్‌కు రూ. 1700, స్త్రీలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, వికలాంగ అభ్యర్థులు రూ.1100, ఇంటర్‌కు 1400 చెల్లించాలన్నారు. మీసేవా, ఏపీ ఆన్లైన్లోనే ప్రవేశ ఫీజులు చెల్లించాలని స్పష్టం చేశారు. సర్వశిక్ష అభియాన్ ప్రాజెక్ట్ ఆఫీసర్ సుబ్రమణ్యం మాట్లాడుతూ వివిధ కారణాల వల్ల చదువుకోలేక పోయిన వారికి ఓపెన్ స్కూల్ చాలా అనుకూలమన్నారు. అయితే ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేయకుండా ప్రభుత్వం నిర్ణయించిన మేరకే వసూలు చేయాలని సూచించారు. సమావేశంలో ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ గోవింద్‌నాయక్, ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ గంధం శ్రీనివాసులు, హెచ్ఎం అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి జయరామిరెడ్డి, ఎస్ఎస్ఏ అసిస్టెంట్ సీఎంఓ రామగిరి కిష్టప్ప పాల్గొన్నారు. -
చూసుకో..రాసుకో..
జిల్లాలో ఈ నెల 12 నుంచి ప్రారంభమైన ఓపెన్ స్కూల్ పరీక్షల్లో అక్రమాలు చోటుచేసుకుంటున్నాయి. ‘రాసుకున్నోళ్లకు రాసుకున్నంత’ అన్న రీతిలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. మాస్ కాపీయింగ్‌ను యథేచ్ఛగా ప్రోత్సహిస్తున్నారు. కొన్ని చోట్ల ఒకరికి బదులు మరొకరు పరీక్ష రాస్తున్నారు. ఇదంతా ఇన్విజిలేటర్ల పర్యవేక్షణలోనే సిట్టింగ్, ఫ్లయింగ్ స్క్వాడ్లు ఉండగానే జరుగుతోందంటే ఆశ్చర్యం కలగకమానదు. - ఓపెన్ స్కూల్ పరీక్షల్లో జోరుగా మాస్‌కాపీయింగ్ - కొన్నిచోట్ల ఇన్విజిలేటర్లే ప్రోత్సహిస్తున్న వైనం అనంతపురం ఎడ్యుకేషన్ : ఓపెన్ స్కూల్ పరీక్షల్లో చూచిరాతలకు అధికారులు ఈసారీ అడ్డుకట్ట వేయలేకపోయారు. ఈనెల 12 నుంచి జిల్లాలో ప్రారంభమైన సార్వత్రిక విద్యాపీఠం(ఓపెన్ స్కూల్) ఇంటర్ పరీక్షల్లో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. జిల్లాలో అనంతపురం, తాడిపత్రి, గుత్తి, ధర్మవరం, కదిరి, పెనుకొండ, కళ్యాణదుర్గంలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. చాలా కేంద్రాల్లో చూచిరాతలు, మాస్ కాపీయింగ్ జరుగుతోంది. తమకు అనుకూలమైన వారిని చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారులు, ఇన్విజిలేటర్లుగా నియమించుకుని మాస్ కాపీయింగ్‌కు పాల్పడుతున్నారు. కొందరు కో-ఆర్డినేటర్లు ఆయా సెంటర్లలో తిష్టవేస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా కొందరు ఇన్విజిలేటర్లు ఏకంగా బోర్డుపైనే సమాధానాలు రాయిస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. కొన్ని కేంద్రాల్లో గేట్లకు తాళాలు వేసి, మరికొన్ని కేంద్రాల్లో గేటు వద్ద ఒకరిద్దరిని కాపాలాగా ఉంచి స్కా్వడ్ వస్తే అన్నీ సర్దేసుకుంటున్నారు. ఇన్విజిలేటర్ల పర్యవేక్షణలోనే చూచిరాతలు కదిరి : కదిరి జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాల, బాలికల జూనియర్ కళాశాలలో ఓపెన్ స్కూల్ ఇంటర్ పరీక్షల్లో అక్రమాలు జరుగుతున్నాయి. ఓపెన్ స్కూల్ పరీక్షా కేంద్రాల నిర్వాహకుల అనుచరులు కొందరు వాచ్‌మన్, క్లర్క్, వాటర్‌మ్యాన్ అవతారమెత్తి పరీక్ష ప్రారంభం కాగానే అన్ని గదులకు తిరుగుతూ జవాబులతో కూడిన స్లిప్‌లు అందిస్తున్నారు. ఈ విషయం తెలిసి విలేకరులు అక్కడికి వెళ్తే ‘మీడియా వాళ్లకు పరీక్షా కేంద్రాల్లోకి అనుమతి లేదు’ అని అక్కడున్న ఇన్విజిలేటర్లతోపాటు సిట్టింగ్ స్క్వాడ్ పేరుతో వచ్చిన అధికారులు అడ్డు చెబుతున్నారు. ఒకరి బదులు మరొకరు పరీక్ష రాస్తున్నారని, అలాంటి వారిపై చర్యలు తీసుకుని పరీక్షలు సజావుగా నిర్వహించాలని చెబితే ‘పరీక్ష ఎలా నిర్వహించాలో మాకు తెలుసు.. మీకు అనుమతి లేదు.. పోలీస్ ఈ మీడియా వాళ్లను బయటకు పంపేయండి’ అని పోలీసులను ఆదేశిస్తున్నారు. ఒక్కొక్కరు రూ.10 వేలు ఇచ్చారట! ‘మిమ్మల్ని పాస్ చేయించే బాధ్యత మాది.. మీకు చూసి రాయడం వస్తే చాలు.. పాస్ గ్యారంటీ. పోలీసోళ్లను, మీడియా వాళ్లను మ్యానేజ్ చేయాలి.. అనుకూలమైన ఇన్విజిలేటర్లను వేయించుకోవాలి.. సిట్టింగ్ స్క్వాడ్, ఫ్లైయింగ్ స్క్వాడ్లను మ్యానేజ్ చేయాలి.. ఎంత రిస్క్ ఉంటుందో మీకేం తెలుసు..’ అంటూ ఒక్కొక్కరి దగ్గర నిర్వాహకులు రూ.10 వేలు తీసుకున్నారని అభ్యర్థులు పరీక్షా కేంద్రం నుంచి బయటకు వస్తూ ఓపెన్‌గానే చెప్పారు. చిట్టీలు దొరికితే సెంటరు రద్దు చేస్తాం ఓపెన్ స్కూల్ పరీక్షలను చాలా సీరియస్‌గా తీసుకుంటున్నాం. అన్ని కేంద్రాల్లోనూ సిట్టింగ్ స్క్వాడ్ ఏర్పాటు చేశాం. మాస్‌కాపీయింగ్‌ను ప్రోత్సహిస్తే సంబంధిత సిబ్బందిపై కఠిన చర్యలు ఉంటాయి. అభ్యర్థుల వద్ద ఎలాంటి చిట్టీలు దొరికినా వారు ఏ సెంటర్ నుంచి దరఖాస్తు చేసుకున్నారో ఆ కేంద్రం గుర్తింపు రద్దు చేస్తాం. చిట్టీలు దొరికితే ఆయా సెంటర్ల కో-ఆర్డినేటర్లదే బాధ్యత. - డీఈఓ -
‘ఓపెన్’ అక్రమాలకు చెక్ పడేనా?
– 12 నుంచి ఓపెన్ స్కూల్ పరీక్షలు – ఇప్పటికే పూర్తయిన చీఫ్, డీఓల నియామకం – ‘నాట్ విల్లింగ్’ వారి స్థానాల్లో అనుకూలమైన వారిని నియమించుకునేందుకు ఒత్తిళ్లు అనంతపురం ఎడ్యుకేషన్ : ఓపెన్ స్కూల్ (సార్వత్రిక విద్యా పీఠం) పరీక్షలు ఈ నెల 12 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇంటర్మీడియట్ పరీక్షలు 12 నుంచి, పదో తరగతి పరీక్షలు 18 నుంచి ప్రారంభమై ఈ నెల 22న ముగుస్తాయి. పదో తరగతి పరీక్షలు 3,950 మంది, ఇంటర్ పరీక్షలు 6,896 మంది విద్యార్థులు రాయనున్నారు. పదో తరగతికి 14 కేంద్రాలు, ఇంటర్‌కు 25 కేంద్రాలు ఏర్పాటు చేశారు. రోజూ పరీక్ష ఉదయం 9.30 గంటల నుంచి 12.30 గంటల వరకు జరుగుతాయి. జిల్లాలో అనంతపురం, తాడిపత్రి, గుత్తి, ధర్మవరం, కదిరి, పెనుకొండ, కళ్యాణదుర్గంలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. గతంలో చూచిరాతలు, ఒకరికి బదులు మరొకరు, మాస్ కాపీయింగ్ చేయించిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఈ ఏడాది కూడా పరీక్షల్లో అక్రమాలకు కొందరు చక్రం తిప్పుతున్నారు. నిర్వహణలో ప్రధాన భూమిక పోషించే చీఫ్ సూపరింటెండెంట్లు (సీఎస్), డిపార్ట్మెంటల్ అధికారుల (డీఓ)ను అనుకూలమమైన వారిని నియమించుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. అయిన వారి కోసం పావులు సీఎస్, డీఓలను అనుకూలమైన వారిని వేయించుకునేందుకు పావులు కదుపుతున్నారు.వాస్తవానికి గతేడాది వరకు ఏటా నియమించేవారినే సీఎస్, డీఓలుగా నియమిస్తూ వచ్చారు. ఏఐ సెంటర్ల కోఆర్డినేటర్లతో చేసుకున్న ‘ఒప్పందం’తో వారు చూసీ చూడనట్లు వెళ్తూ అక్రమాలకు సహకరించారనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. ఈసారి డీఈఓ లక్ష్మీనారాయణ పరీక్షల నిర్వహణలో కాస్త కఠినంగా వ్యవహరిస్తారనే పేరున్న వారినే ఎక్కువగా నియమించారు. ఈ క్రమంలో 39 సీఎస్‌లు, 39 మంది డీఓలను నియమించారు. వీరిలో మహిళలు ఎక్కువగా ఉన్నారు. ఇందులో సుమారు 30 మంది దాకా తమను విధుల నుంచి తప్పించాలంటూ డీఈఓకు దరఖాస్తు చేసుకున్నారు. వారి స్థానాల్లో తమకు అనుకూలమైన వారిని నియమించుకునేందుకు కొందరు వ్యూహం రచించారు. ఏఐ సెంటర్ల కోఆర్డినేటర్లు..పరీక్షల విధుల్లో పాల్గొనే చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ ఆఫీసర్లను మచ్చిక చేసుకునే పనిలో పడ్డారు. వారికి తాయిలాల ఎరచూపుతూ చూచిరాత, మాస్ కాపీయింగ్, జవాబులు చెప్పించేలా మాట్లాడుకున్నట్లు తెలిసింది. గట్టి నిఘా పెడతాం ఓపెన్ స్కూల్ పరీక్షల నిర్వహణపై గట్టి నిఘా పెడతాం. ఎలాంటి అక్రమాలకు అవకాశమివ్వం. ఇందులో భాగంగానే చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారుల నియామకాల్లో చాలా మార్పులు చేశా. ఇన్విజిలేటర్ల విషయంలోనూ ఇదే పరిస్థితి. విధులకు నియమించిన వారు ఖచ్చితంగా వెళ్లాల్సిందే. తీవ్ర అనారోగ్య పరిస్థితులుంటే వారి విషయంలో ఆలోచిస్తాం. పరీక్షల సమయంలో ఏ స్థాయి ఉద్యోగి అక్రమాలకు పాల్పడినా కఠిన చర్యలుంటాయి. – లక్ష్మీనారాయణ, డీఈఓ -
3 నుంచి ‘పది’ మూల్యాంకనం
– ‘స్పాట్’ విధుల నుంచి మినహాయింపు ఉండదు! – అందరూ విధిగా హాజరుకావాల్సిందే – జిల్లా విద్యాశాఖ అధికారి లక్ష్మీనారాయణ అనంతపురం ఎడ్యుకేషన్ : ఏప్రిల్ మూడో తేదీ నుంచి పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభమవుతుందని జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ) పగడాల లక్ష్మీనారాయణ తెలిపారు. ఈ మేరకు సోమవారం ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ గోవిందునాయక్‌తో కలిసి డీఈఓ విలేకరులతో మాట్లాడారు. ఏప్రిల్ 3 నుంచి 16వ తేదీ వరకు మూల్యాంకనం ఉంటుందన్నారు. వివిధ జిల్లాల నుంచి ఇప్పటిదాకా జిల్లాకు 2.80 లక్షల జవాబుపత్రాలు వచ్చాయన్నారు. ఎగ్జామినర్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ విధుల నుంచి మినహాయింపు ఉండదన్నారు. ఇప్పటికే ఎంపిక చేసి వారి వివరాలను ఆన్లైన్లో ఉంచామన్నారు. ఎవరైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే సంబంధిత సర్టిఫికెట్లు తీసుకుని మూడో తేదీన వస్తే అలాంటి వారిని మినహాయిస్తామన్నారు. అంతేకానీ ఒకరి ఆర్డరు మరో టీచరు తీసుకుని వస్తే మాత్రం ఇద్దరిపైనా చర్యలుంటాయని హెచ్చరించారు. ఆర్జేడీ కూడా ఉంటారన్నారు. ఆగస్టు లోగా ఉద్యోగ విరమణ పొందే ఉపాధ్యాయులకు స్పాట్ నుంచి మినహాయింపు ఉంటుందన్నారు. కనీసం మూడేళ్లు పదో తరగతి బోధించిన వారు అర్హులన్నారు. ఎవరైనా విధులకు హాజరుకావాలనుకునే వారు ఆరోజు నేరుగా రావచ్చన్నారు. తెలుగు సబ్జెక్టుకు 170 మంది, హిందీకి 115 మంది, ఇంగ్లిష్‌కు 250 మంది, గణితానికి 200 మంది, సైన్స్‌కు 240 మంది, సోషియల్కు 170 మంది, సంస్కృతంకు 30 మందిని ఎగ్జామినర్లను నియమించామన్నారు. అవసరాన్ని బట్టి ఇంకా తీసుకుంటామన్నారు. రిలీవ్ చేయాలంటూ డీఈఓ సెల్‌కు మెసేజ్ ఎగ్జామినర్ల విధుల నుంచి కారణం లేనిదే ఏ ఒక్కరినీ రిలీవ్ చేయబోమని డీఈఓ పదేపదే చెబుతుంటే మరోవైపు హిందూపురం సేవా మందిరం పాఠశాలకు చెందిన సోషియల్ టీచరు నాగరాజు డీఈఓ మొబైల్‌కు మెసేజ్ పంపడం విశేషం. తనను ఎగ్జామినర్ విధుల నుంచి తప్పించాలంటూ అందులో పేర్కొన్నాడు. దీన్ని సీరియస్‌గా పరిగణించిన డీఈఓ సదరు టీచర్‌కు మెమో జారీ చేయాలంటూ సిబ్బందిని ఆదేశించారు.