‘ఓపెన్’ అక్రమాలకు చెక్ పడేనా?
– 12 నుంచి ఓపెన్ స్కూల్ పరీక్షలు
– ఇప్పటికే పూర్తయిన చీఫ్, డీఓల నియామకం
– ‘నాట్ విల్లింగ్’ వారి స్థానాల్లో అనుకూలమైన వారిని నియమించుకునేందుకు ఒత్తిళ్లు
అనంతపురం ఎడ్యుకేషన్ : ఓపెన్ స్కూల్ (సార్వత్రిక విద్యా పీఠం) పరీక్షలు ఈ నెల 12 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇంటర్మీడియట్ పరీక్షలు 12 నుంచి, పదో తరగతి పరీక్షలు 18 నుంచి ప్రారంభమై ఈ నెల 22న ముగుస్తాయి. పదో తరగతి పరీక్షలు 3,950 మంది, ఇంటర్ పరీక్షలు 6,896 మంది విద్యార్థులు రాయనున్నారు. పదో తరగతికి 14 కేంద్రాలు, ఇంటర్‌కు 25 కేంద్రాలు ఏర్పాటు చేశారు. రోజూ పరీక్ష ఉదయం 9.30 గంటల నుంచి 12.30 గంటల వరకు జరుగుతాయి. జిల్లాలో అనంతపురం, తాడిపత్రి, గుత్తి, ధర్మవరం, కదిరి, పెనుకొండ, కళ్యాణదుర్గంలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. గతంలో చూచిరాతలు, ఒకరికి బదులు మరొకరు, మాస్ కాపీయింగ్ చేయించిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఈ ఏడాది కూడా పరీక్షల్లో అక్రమాలకు కొందరు చక్రం తిప్పుతున్నారు. నిర్వహణలో ప్రధాన భూమిక పోషించే చీఫ్ సూపరింటెండెంట్లు (సీఎస్), డిపార్ట్‌మెంటల్ అధికారుల (డీఓ)ను అనుకూలమమైన వారిని నియమించుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు.
అయిన వారి కోసం పావులు
సీఎస్, డీఓలను అనుకూలమైన వారిని వేయించుకునేందుకు పావులు కదుపుతున్నారు.వాస్తవానికి గతేడాది వరకు ఏటా నియమించేవారినే సీఎస్, డీఓలుగా నియమిస్తూ వచ్చారు. ఏఐ సెంటర్ల కోఆర్డినేటర్లతో చేసుకున్న ‘ఒప్పందం’తో వారు చూసీ చూడనట్లు వెళ్తూ అక్రమాలకు సహకరించారనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. ఈసారి డీఈఓ లక్ష్మీనారాయణ పరీక్షల నిర్వహణలో కాస్త కఠినంగా వ్యవహరిస్తారనే పేరున్న వారినే ఎక్కువగా నియమించారు. ఈ క్రమంలో 39 సీఎస్‌లు, 39 మంది డీఓలను నియమించారు. వీరిలో మహిళలు ఎక్కువగా ఉన్నారు. ఇందులో సుమారు 30 మంది దాకా తమను విధుల నుంచి తప్పించాలంటూ డీఈఓకు దరఖాస్తు చేసుకున్నారు. వారి స్థానాల్లో తమకు అనుకూలమైన వారిని నియమించుకునేందుకు కొందరు వ్యూహం రచించారు. ఏఐ సెంటర్ల కోఆర్డినేటర్లు..పరీక్షల విధుల్లో పాల్గొనే చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్లను మచ్చిక చేసుకునే పనిలో పడ్డారు. వారికి తాయిలాల ఎరచూపుతూ చూచిరాత, మాస్ కాపీయింగ్, జవాబులు చెప్పించేలా మాట్లాడుకున్నట్లు తెలిసింది.
గట్టి నిఘా పెడతాం
ఓపెన్ స్కూల్ పరీక్షల నిర్వహణపై గట్టి నిఘా పెడతాం. ఎలాంటి అక్రమాలకు అవకాశమివ్వం. ఇందులో భాగంగానే చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంటల్ అధికారుల నియామకాల్లో చాలా మార్పులు చేశా. ఇన్విజిలేటర్ల విషయంలోనూ ఇదే పరిస్థితి. విధులకు నియమించిన వారు ఖచ్చితంగా వెళ్లాల్సిందే. తీవ్ర అనారోగ్య పరిస్థితులుంటే వారి విషయంలో ఆలోచిస్తాం. పరీక్షల సమయంలో ఏ స్థాయి ఉద్యోగి అక్రమాలకు పాల్పడినా కఠిన చర్యలుంటాయి.
– లక్ష్మీనారాయణ, డీఈఓ