open school exams
-
పదిలో ఆరు.. ఇంటర్లో ఏడు
సాక్షి,శ్రీకాకుళం న్యూకాలనీ: ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం (ఓపెన్ స్కూల్ సొసైటీ) ఆధ్వర్యంలో అభ్యసిస్తున్న పది, ఇంటర్మీడియెట్ విద్యార్థుల ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఫలితాల్లో సిక్కోలు విద్యార్థులు రాష్ట్రస్థాయిలో మెరుగైన ఉత్తీర్ణతను సాధించారు. శ్రీకాకుళం ఉమ్మడి జిల్లాను టెన్త్‌లో ఆరోస్థానం, ఇంటర్లో ఏడో స్థానంలో నిలిపారు. జిల్లా ఫలితాలను శుక్రవారం జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో డీఈఓ గార పగడాలమ్మ, ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ డి.సూరపునాయుడు విడుదల చేశారు. పదో తరగతిలో శ్రీకాకుళం జిల్లా విద్యార్థులు 41.82 శాతం ఉత్తీర్ణతను సాధించి రాష్ట్రంలో ఆరోస్థానంలో నిలిచారు. అలాగే ఇంటర్మీడియెట్ విద్యార్థులు 56.37 శాతం ఉత్తీర్ణతను సాధించి ఏడో స్థానంలో నిలి,చారు. జిల్లా నుంచి ఓపెన్ స్కూల్ ద్వారా పదో తరగతి పరీక్షలకు 1277 మంది విద్యార్థులు హాజరుకాగా 534 మంది ఉత్తీర్ణులయ్యారు. అలాగే ఇంటర్ పరీక్షలకు 1350 మంది హాజరుకాగా 761 మంది ఉత్తీర్ణత పొందారు. చదవండి: Maharashtra Crisis: జాతీయ కార్యవర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు -
మే 2 నుంచి ఓపెన్ స్కూల్ పరీక్షలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యా పీఠం(ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పదో తరగతి, ఇంటర్ కోర్సులకు మే 2 నుంచి పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు విద్యా శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ సోమవారం షెడ్యూల్ విడుదల చేశారు. ఈ పరీక్షలు మే 11వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఇంటర్ జనరల్, వృత్తి విద్యా కోర్సులకు సంబంధించిన ప్రాక్టికల్ పరీక్షలు మే 13 నుంచి 17 వరకు ఆదివారంతో సహా జరుగుతాయని మంత్రి వెల్లడించారు. హాల్‌టికెట్‌లో నిర్దేశించిన సబ్జెక్టులకు సరైన ప్రశ్నపత్రం తీసుకోవాలని, అలాకాకుండా వేరొక ప్రశ్నపత్రం తీసుకొని పరీక్ష రాస్తే ఫలితాన్ని రద్దు చేస్తామని, దీనికి సంబంధిత విద్యార్థులే బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పారు. విద్యార్థులు తమకు నిర్దేశించిన కేంద్రంలోనే పరీక్షకు హాజరవ్వాలని ఓపెన్ స్కూల్ సొసైటీ సంచాలకుడు కె.వి.శ్రీనివాసులురెడ్డి స్పష్టం చేశారు. -
నీ ఇష్టం.. ఎలాగైనా పరీక్ష రాసుకో
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: వివిధ కారణాలతో పదో తరగతి, ఇంటర్మీడియెట్లను అర్ధాంతరంగా ఆపేసిన విద్యార్థులకు ఒకే సిట్టింగ్‌లో ఆయా పరీక్షలు రాసే అవకాశం కల్పిస్తోంది.. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ (ఎన్ఐవోఎస్). కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ పరిధిలోని సంస్థ కావడంతో ఎన్ఐవోఎస్ నిర్వహించే పరీక్షలకు విద్యార్థులు పోటెత్తుతున్నారు. ఇదే అదనుగా ఎన్‌ఐవోఎస్‌లో పనిచేసే కొందరు అక్రమాలకు తెరలేపారు. పరీక్ష కేంద్రాల నిర్వాహకులతో కుమ్మక్కై ఇష్టారాజ్యంగా పరీక్షలను నిర్వహిస్తూ అందినకాడికి దోచుకుంటున్నారు. బుధవారం నుంచి విశాఖలోని ఆరు కేంద్రాల్లో ఎన్ఐవోఎస్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. సాక్షి ప్రతినిధి.. ద్వారకానగర్ సమీపంలోని శ్రీ కాశ్యప్ కళాశాలకు వెళ్లగా పరీక్షలు ఇష్టారాజ్యంగా జరుగుతున్న సంగతి వెలుగుచూసింది. ప్రైవేటు కళాశాలల్లో పరీక్షలు వాస్తవానికి.. ఎన్ఐవోఎస్ పరీక్షలను కేంద్రీయ విద్యాలయాలు, జవహర్ నవోదయ విద్యాలయాల్లో నిర్వహించాలి. కానీ విశాఖ ఎన్ఐవోఎస్ కేంద్రం నిర్వాహకులు మూడు ప్రైవేటు విద్యా సంస్థల్లో పరీక్షల నిర్వహణకు అనుమతిచ్చారు. ఈ ఏడాది విశాఖ ద్వారకానగర్ సమీపంలోని శ్రీ కాశ్యప్ జూనియర్ కళాశాల, ఫోర్త్ టౌన్ పోలీస్‌స్టేషన్ సమీపంలోని మినర్వా స్కూల్, సబ్బవరం బీఎంకే కాలేజీల్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. అక్కడంతా గప్‌చుప్ ఈ నెల 4 నుంచి సీనియర్ సెకండరీ విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం ఫిజిక్స్, హిస్టరీ పరీక్షలు నిర్వహించారు. వాస్తవానికి పరీక్షా సమయం మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు. అయితే శ్రీ కాశ్యప్ కాలేజీలో ఉదయం పదిన్నర గంటల నుంచే ‘మూకుమ్మడి’ పరీక్షలు నిర్వహించేశారు. మూడంతస్తుల చిన్న బిల్డింగ్‌లో కళాశాల నిర్వహిస్తున్న నిర్వాహకులు.. ఇతరులెవరూ లోనికి రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. సమాచారం సేకరించేందుకు వెళ్లిన సాక్షి ప్రతినిధిని కనీసం కళాశాలలోకి కూడా ప్రవేశించకుండా అడ్డుకున్నారు. ఎలాగోలా లోనికి వెళ్లి కళాశాల డైరెక్టర్ నారాయణమూర్తిని కలసి పరీక్షల తీరును ప్రస్తావించగా.. స్క్వాడ్ రాకుంటే విద్యార్థుల ఇష్టమే.. తనిఖీలకు ఎవరూ రాకుండా ఉంటే మనం ఏదైనా చేయొచ్చు అని చెప్పుకొచ్చారు. అప్పటికే అక్కడికి చేరుకున్న విద్యార్థులతో మాట్లాడగా.. ‘పరీక్ష ఏముందండి.. ఎన్ఐవోఎస్ అడ్మిషన్ ఫీజు రూ.2500, పరీక్ష ఫీజు రూ.3500.. ఈ సెంటర్లో ఎగ్జామ్ రాసేందుకు రూ.30 వేలు నుంచి రూ.40 వేలు ఇస్తే ఇంటర్మీడియేట్ సర్టిఫికెట్ వచ్చేస్తుంది’ అని చెప్పడం గమనార్హం. -
‘ఓపెన్’ అక్రమాలకు చెక్ పడేనా?
– 12 నుంచి ఓపెన్ స్కూల్ పరీక్షలు – ఇప్పటికే పూర్తయిన చీఫ్, డీఓల నియామకం – ‘నాట్ విల్లింగ్’ వారి స్థానాల్లో అనుకూలమైన వారిని నియమించుకునేందుకు ఒత్తిళ్లు అనంతపురం ఎడ్యుకేషన్ : ఓపెన్ స్కూల్ (సార్వత్రిక విద్యా పీఠం) పరీక్షలు ఈ నెల 12 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇంటర్మీడియట్ పరీక్షలు 12 నుంచి, పదో తరగతి పరీక్షలు 18 నుంచి ప్రారంభమై ఈ నెల 22న ముగుస్తాయి. పదో తరగతి పరీక్షలు 3,950 మంది, ఇంటర్ పరీక్షలు 6,896 మంది విద్యార్థులు రాయనున్నారు. పదో తరగతికి 14 కేంద్రాలు, ఇంటర్‌కు 25 కేంద్రాలు ఏర్పాటు చేశారు. రోజూ పరీక్ష ఉదయం 9.30 గంటల నుంచి 12.30 గంటల వరకు జరుగుతాయి. జిల్లాలో అనంతపురం, తాడిపత్రి, గుత్తి, ధర్మవరం, కదిరి, పెనుకొండ, కళ్యాణదుర్గంలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. గతంలో చూచిరాతలు, ఒకరికి బదులు మరొకరు, మాస్ కాపీయింగ్ చేయించిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఈ ఏడాది కూడా పరీక్షల్లో అక్రమాలకు కొందరు చక్రం తిప్పుతున్నారు. నిర్వహణలో ప్రధాన భూమిక పోషించే చీఫ్ సూపరింటెండెంట్లు (సీఎస్), డిపార్ట్మెంటల్ అధికారుల (డీఓ)ను అనుకూలమమైన వారిని నియమించుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. అయిన వారి కోసం పావులు సీఎస్, డీఓలను అనుకూలమైన వారిని వేయించుకునేందుకు పావులు కదుపుతున్నారు.వాస్తవానికి గతేడాది వరకు ఏటా నియమించేవారినే సీఎస్, డీఓలుగా నియమిస్తూ వచ్చారు. ఏఐ సెంటర్ల కోఆర్డినేటర్లతో చేసుకున్న ‘ఒప్పందం’తో వారు చూసీ చూడనట్లు వెళ్తూ అక్రమాలకు సహకరించారనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. ఈసారి డీఈఓ లక్ష్మీనారాయణ పరీక్షల నిర్వహణలో కాస్త కఠినంగా వ్యవహరిస్తారనే పేరున్న వారినే ఎక్కువగా నియమించారు. ఈ క్రమంలో 39 సీఎస్‌లు, 39 మంది డీఓలను నియమించారు. వీరిలో మహిళలు ఎక్కువగా ఉన్నారు. ఇందులో సుమారు 30 మంది దాకా తమను విధుల నుంచి తప్పించాలంటూ డీఈఓకు దరఖాస్తు చేసుకున్నారు. వారి స్థానాల్లో తమకు అనుకూలమైన వారిని నియమించుకునేందుకు కొందరు వ్యూహం రచించారు. ఏఐ సెంటర్ల కోఆర్డినేటర్లు..పరీక్షల విధుల్లో పాల్గొనే చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ ఆఫీసర్లను మచ్చిక చేసుకునే పనిలో పడ్డారు. వారికి తాయిలాల ఎరచూపుతూ చూచిరాత, మాస్ కాపీయింగ్, జవాబులు చెప్పించేలా మాట్లాడుకున్నట్లు తెలిసింది. గట్టి నిఘా పెడతాం ఓపెన్ స్కూల్ పరీక్షల నిర్వహణపై గట్టి నిఘా పెడతాం. ఎలాంటి అక్రమాలకు అవకాశమివ్వం. ఇందులో భాగంగానే చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారుల నియామకాల్లో చాలా మార్పులు చేశా. ఇన్విజిలేటర్ల విషయంలోనూ ఇదే పరిస్థితి. విధులకు నియమించిన వారు ఖచ్చితంగా వెళ్లాల్సిందే. తీవ్ర అనారోగ్య పరిస్థితులుంటే వారి విషయంలో ఆలోచిస్తాం. పరీక్షల సమయంలో ఏ స్థాయి ఉద్యోగి అక్రమాలకు పాల్పడినా కఠిన చర్యలుంటాయి. – లక్ష్మీనారాయణ, డీఈఓ -
భార్యను దుర్భాషలాడాడని... చేతులు నరికేశాడు
విజయనగరం(ఎస్.కోట): విజయనగరం జిల్లాలో దారుణం జరిగింది. జిల్లాలోని ఎస్.కోట మండల కేంద్రంలో ఆదివారం ఆర్సీఎం స్కూల్ వద్ద తన భార్యను దుర్భాషలాడిన వ్యక్తి చేతులను భర్త నరికాడు. ఎస్కోటకు చెందిన శ్రీనివాసరావు అనే వ్యక్తి కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉంటాడు. అయితే అతని భార్య ఒపెన్ స్కూల్ పరీక్షలు రాస్తుంది. ఎస్కోటకు చెందిన ఇబ్రహీం అనే వ్యక్తి పరీక్షలు రాస్తూ సదరు మహిళను కించపరిచేలా మాట్లాడటంతో ఆమె భర్తకు ఫిర్యాదు చేసింది. దీంతో ఆగ్రహించిన శ్రీనివాసరావు, ఇబ్రహీంపై కత్తితో దాడి చేసి చేతులు నరికాడు. తీవ్రంగా గాయపడిన ఇబ్రహీంను వైజాగ్‌లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.