చూసుకో..రాసుకో.. | mas copying in open exams | Sakshi
Sakshi News home page

చూసుకో..రాసుకో..

Published Sat, Apr 15 2017 11:32 PM | Last Updated on Tue, Sep 5 2017 8:51 AM

చూసుకో..రాసుకో..

చూసుకో..రాసుకో..

జిల్లాలో ఈ నెల 12 నుంచి ప్రారంభమైన ఓపెన్‌ స్కూల్‌ పరీక్షల్లో అక్రమాలు చోటుచేసుకుంటున్నాయి. ‘రాసుకున్నోళ్లకు రాసుకున్నంత’ అన్న రీతిలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. మాస్‌ కాపీయింగ్‌ను ‍యథేచ్ఛగా ప్రోత్సహిస్తున్నారు. కొన్ని చోట్ల ఒకరికి బదులు మరొకరు పరీక్ష రాస్తున్నారు. ఇదంతా ఇన్విజిలేటర్ల పర్యవేక్షణలోనే సిట్టింగ్‌, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లు ఉండగానే జరుగుతోందంటే ఆశ్చర్యం కలగకమానదు.

- ఓపెన్‌ స్కూల్‌ పరీక్షల్లో జోరుగా మాస్‌కాపీయింగ్‌
- కొన్నిచోట్ల ఇన్విజిలేటర్లే ప్రోత్సహిస్తున్న వైనం


అనంతపురం ఎడ్యుకేషన్‌ : ఓపెన్‌ స్కూల్‌ పరీక్షల్లో చూచిరాతలకు అధికారులు ఈసారీ అడ్డుకట్ట వేయలేకపోయారు. ఈనెల 12 నుంచి జిల్లాలో ప్రారంభమైన సార్వత్రిక విద్యాపీఠం(ఓపెన్‌ స్కూల్‌) ఇంటర్‌ పరీక్షల్లో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. జిల్లాలో అనంతపురం, తాడిపత్రి, గుత్తి, ధర్మవరం, కదిరి, పెనుకొండ, కళ్యాణదుర్గంలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. చాలా కేంద్రాల్లో చూచిరాతలు, మాస్‌ కాపీయింగ్‌ జరుగుతోంది. తమకు అనుకూలమైన వారిని చీఫ్‌ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంటల్‌ అధికారులు, ఇన్విజిలేటర్లుగా నియమించుకుని మాస్‌ కాపీయింగ్‌కు పాల్పడుతున్నారు. కొందరు కో-ఆర్డినేటర్లు ఆయా సెంటర్లలో తిష్టవేస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా కొందరు ఇన్విజిలేటర్లు ఏకంగా బోర్డుపైనే సమాధానాలు రాయిస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. కొన్ని కేంద్రాల్లో గేట్లకు తాళాలు వేసి, మరికొన్ని కేంద్రాల్లో గేటు వద్ద ఒకరిద్దరిని కాపాలాగా ఉంచి స్కా​‍్వడ్‌ వస్తే అన్నీ సర్దేసుకుంటున్నారు.

ఇన్విజిలేటర్ల పర్యవేక్షణలోనే చూచిరాతలు
కదిరి : కదిరి జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాల, బాలికల జూనియర్‌ కళాశాలలో ఓపెన్‌ స్కూల్‌ ఇంటర్‌ పరీక్షల్లో అక్రమాలు జరుగుతున్నాయి. ఓపెన్‌ స్కూల్‌ పరీక్షా కేంద్రాల నిర్వాహకుల అనుచరులు కొందరు వాచ్‌మన్, క్లర్క్, వాటర్‌మ్యాన్‌ అవతారమెత్తి పరీక్ష ప్రారంభం కాగానే అన్ని గదులకు తిరుగుతూ జవాబులతో కూడిన స్లిప్‌లు అందిస్తున్నారు. ఈ విషయం తెలిసి విలేకరులు అక్కడికి వెళ్తే ‘మీడియా వాళ్లకు పరీక్షా కేంద్రాల్లోకి అనుమతి లేదు’ అని అక్కడున్న ఇన్విజిలేటర్లతోపాటు సిట్టింగ్‌ స్క్వాడ్‌ పేరుతో వచ్చిన అధికారులు అడ్డు చెబుతున్నారు. ఒకరి బదులు మరొకరు పరీక్ష రాస్తున్నారని, అలాంటి వారిపై చర్యలు తీసుకుని పరీక్షలు సజావుగా నిర్వహించాలని చెబితే ‘పరీక్ష ఎలా నిర్వహించాలో మాకు తెలుసు.. మీకు అనుమతి లేదు.. పోలీస్‌ ఈ మీడియా వాళ్లను బయటకు పంపేయండి’ అని పోలీసులను ఆదేశిస్తున్నారు.

ఒక్కొక్కరు రూ.10 వేలు ఇచ్చారట!
‘మిమ్మల్ని పాస్‌ చేయించే బాధ్యత మాది.. మీకు చూసి రాయడం వస్తే చాలు.. పాస్‌ గ్యారంటీ. పోలీసోళ్లను, మీడియా వాళ్లను మ్యానేజ్‌ చేయాలి.. అనుకూలమైన ఇన్విజిలేటర్లను వేయించుకోవాలి.. సిట్టింగ్‌ స్క్వాడ్, ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌లను మ్యానేజ్‌ చేయాలి.. ఎంత రిస్క్‌ ఉంటుందో మీకేం తెలుసు..’ అంటూ ఒక్కొక్కరి దగ్గర నిర్వాహకులు రూ.10 వేలు తీసుకున్నారని అభ్యర్థులు పరీక్షా కేంద్రం నుంచి బయటకు వస్తూ ఓపెన్‌గానే చెప్పారు.

చిట్టీలు దొరికితే సెంటరు రద్దు చేస్తాం
ఓపెన్‌ స్కూల్‌ పరీక్షలను చాలా సీరియస్‌గా తీసుకుంటున్నాం. అన్ని కేంద్రాల్లోనూ సిట్టింగ్‌ స్క్వాడ్‌ ఏర్పాటు చేశాం. మాస్‌కాపీయింగ్‌ను ప్రోత్సహిస్తే సంబంధిత సిబ్బందిపై కఠిన చర్యలు ఉంటాయి. అభ్యర్థుల వద్ద ఎలాంటి చిట్టీలు దొరికినా వారు ఏ సెంటర్‌ నుంచి దరఖాస్తు చేసుకున్నారో ఆ కేంద్రం గుర్తింపు రద్దు చేస్తాం. చిట్టీలు దొరికితే ఆయా సెంటర్ల కో-ఆర్డినేటర్లదే బాధ్యత.
- డీఈఓ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement